
నవమాసాలు మోసి అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కొడుకే ఆ తల్లికి శాపంగా మారాడు. ఏ తల్లి అయినా ఇలాంటి కొడుకునా కని పెంచింది అనుకునేలా విచక్షణ మరిచి తల్లిని పొట్టనపెట్టుకున్నాడు. మద్యానికి బానిసై తరచూ గొడవ పడుతూ కుటుంబానికి భారం అయినా.. అన్నీ భరిస్తూ పోషిస్తూ వస్తున్న తల్లిని కిరాతకంగా పొడిచి చంపడం సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధి డివినో విల్లాస్ లో జరిగింది ఈ దారుణ ఘటన. తాగుడుకు బానిస అయిన నవారు కార్తీక్ రెడ్డి (26) తల్లి రాధిక (52) పై కత్తితో దాడి చేశాడు. ఆస్తి తనపేరున రాయాలని, అడిగినంత డబ్బు ఇవ్వాలని తాగుడు మత్తులో కన్న తల్లి అని మరిచి చంపేశాడు.
కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన రాధికను కుటుంబ సభ్యులు హుటాహుటిన సిటిజన్ ఆసుపత్రికి తరలిచారు. తీవ్రంగా రక్త స్రావం జరగడంతో చికిత్స పొందుతూ రాధిక మృతి చెందారు.
మద్యానికి బానిసై ఆస్తికోసం కుటుంబ సభ్యులతో తరచూ గొడవపడుతూ ఉండేవాడని, సోమవారం (మార్చి3) ఉదయం దారుణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.