జీతాలు ఫిక్స్​ చేసేది ఇట్లనేనా?

జీతాలు ఫిక్స్​ చేసేది ఇట్లనేనా?
  • ఉద్యోగులను ముంచి.. స్వామి భక్తిని చాటుకున్న పీఆర్సీ

తెలంగాణ రాష్ట్ర తొలి పే రివిజన్​ కమిషన్(పీఆర్సీ)​ ఇచ్చిన రిపోర్ట్​ ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. 30 నెలల టైంలో వివిధ సంఘాలతో సమావేశాలు పెట్టి, వారి నుంచి 501 ప్రతిపాదనలు స్వీకరించి రూపొందించామని చెప్పుకున్న ఈ రిపోర్ట్.. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన పీఆర్సీల కంటే దారుణంగా ఉంది. 2005లో ఇచ్చిన 8వ పీఆర్సీ రిపోర్ట్​ అత్యంత దరిద్రమైనదిగా ఉండగా, ఇప్పుడు బిస్వాల్‌‌కమిషన్​ రిపోర్ట్​ ఆ ప్లేస్​ను ఆక్రమించింది. అందుకే రాష్ట్రంలోని 9 లక్షల మంది ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు ఈ రిపోర్ట్​ను తిరస్కరిస్తున్నారు. పీఆర్సీ రిపోర్ట్​లో సిఫారసులు ఉద్యోగుల శ్రేయస్సును మరిచి, ప్రభుత్వం పట్ల భక్తిని చూపించుకున్నట్టుగా మాత్రమే ఉంది. ఉద్యోగుల ఆశలను, ఆకాంక్షలను నీరుగార్చిందని వెల్లడవుతోంది.

కనీస వేతనం ఎలా నిర్ణయించాలి?

వేతన సవరణలో కీలకమైన అంశం కనీస వేతనాన్ని నిర్ణయించటం. కనీస వేతనం ఆధారంగానే ఫిట్‌‌మెంట్​ను నిర్ణయిస్తారు. పౌరులందరికీ ఉపాధి కల్పించటంతోపాటు సమంజసమైన వేతనాన్ని ఇప్పించాల్సిన బాధ్యత రాజ్యానిదేనని రాజ్యాంగం చెబుతోంది. ఆ మేరకు 1948 నవంబర్‌‌లో జాతీయ సలహా మండలి సమంజస వేతనాలపై ఫెయిర్‌‌వేజ్‌‌కమిటీని నియమించింది. ఈ కమిటీలో ప్రభుత్వం, యాజమాన్యం, ఉద్యోగుల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. ఫెయిర్‌‌వేజ్‌‌కమిటీ వేతనాలను 3 కేటగిరీలుగా నిర్వచించింది.

లివింగ్‌‌వేజ్‌‌: కార్మికుడు(ఉద్యోగి) అతని కుటుంబం కనీస అవసరాలేగాక విద్య, వైద్యం, బీమా, సామాజిక అవసరాలు, వృద్ధాప్యంలో జీవనం తదితర అవసరాలతో పాటు సౌకర్యవంతమైన జీవన విధానానికి అనుగుణంగా నిర్ణయించేది. ఇది ఉద్యోగులకు అంతిమ లక్ష్యంగా ఉంటుంది.

ఫెయిర్‌‌వేజ్‌‌: కార్మికుని ఉత్పాదక సామర్థ్యంపై ఆధారపడి నిర్ణయించేది. లివింగ్‌‌వేజ్‌‌కు తక్కువగానూ, కనీస వేతనానికంటే ఎక్కువగా ఉంటుంది.

మినిమం వేజ్‌‌: కనీస వేతనం జీవితపు కనీస అవసరాలను తీర్చడమే కాకుండా ఉద్యోగుల సామర్థ్యం నిలిపేందుకు కూడా తోడ్పడాలి. విద్య, వైద్యం వంటి అవసరాలు తీర్చేదిగా ఉండాలి.

1.1957లో ఢిల్లీలో నిర్వహించిన 15వ ఇండియన్‌‌ లేబర్‌‌ కాన్ఫరెన్స్‌‌(ఐఎల్‌‌సీ) కనీస వేతనానికి సంబంధించి ఓ తీర్మానాన్ని ఆమోదించింది. దాని ప్రకారం..

2.సగటు శ్రామికుని కుటుంబం అంటే భార్య, భర్త, ఇద్దరు పిల్లలను కలిపి మూడు వినియోగపు యూనిట్లుగా పరిగణించాలి.

3.డాక్టర్ అక్ట్రాయిడ్‌‌సిఫారసుల ప్రకారం సగటు పౌరునికి కనీసం 2,700 కేలరీల శక్తినిచ్చే ఆహారం కనీస అవసరంగా లెక్కించాలి.

4.ప్రతి వ్యక్తికి 18 గజాలు బట్ట చొప్పున నలుగురు వ్యక్తుల కుటుంబానికి 72 గజాల దుస్తులు అవసరం.

5.ఒక ప్రాంతంలో దిగువ తరగతి ఆదాయ వర్గానికి చెందిన నివాస గృహానికి నిర్ణయించిన కనీస అద్దెనూ ఆ ప్రాంతంలో ఇంటి అద్దెగా నిర్ణయించాలి.

6. ఫ్యూయల్, విద్యుత్‌‌, ఇతర చిల్లర ఖర్చుల కోసం కనీస వేతనంపై 20% అదనంగా ఉండాలి. ఇంకా విద్య, వైద్యం, కనీస వినోదం, పండుగలు తదితర అవసరాల కోసం 25% అదనంగా కలిపి వేతనాన్ని నిర్ణయించాలని 1991లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కనీస వేతనాన్ని ఐదేండ్లకు మించకుండా ఒకసారి సవరించాలని, సవరణ కోసం కమిటీ నియామకం లేదా నోటిఫికేషన్‌‌పద్ధతులను ఫాలో కావాలని కనీస వేతన చట్టం-1948లో పేర్కొన్నారు.

కనీస జీతం 24 వేలు ఉండాలె

ఈ ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకునే ప్రతి ఐదేండ్లకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలను సవరిస్తున్నది. అది ఉద్యోగుల హక్కు. తెలంగాణ తొలి పీఆర్సీ కూడా ఐఎల్‌‌సీ రూల్స్, 7వ కేంద్ర వేతన సంఘం సిఫారసులు పరిగణనలోకి తీసుకుని అత్యంత వాస్తవికంగా, అవసరాల ఆధారంగా కనీస వేతనాన్ని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చింది. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ఇటీవలి కాలంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోలు, డీజిల్‌‌ధరలైతే రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చదువు, మెడిసిన్​ అత్యంత ఖరీదైనవిగా తయారయ్యాయి. స్మార్ట్‌‌ఫోన్లు, టీవీలు, ఇంటర్నెట్‌‌నిత్యావసరాలుగా మారాయి. ఈ నేపథ్యంలో కనీస వేతనం రూ.24 వేలు అంతకన్నా ఎక్కువ ఉండటం సరైనది. కానీ పీఆర్సీలో కనీస వేతనాన్ని రూ.19,000కే కుదించి సిఫారసు చేశారు.

బడ్జెట్‌‌పై జీతాలే పెద్ద భారమన్న ప్రచారం సరికాదు

రాష్ట్ర బడ్జెట్‌‌లో ఎక్కువ భాగం ఉద్యోగుల జీతభత్యాలకే ఖర్చు అవుతున్నాయన్న ప్రచారం సత్యదూరమని పీఆర్సీ రిపోర్ట్​లోని లెక్కలు చెబుతున్నాయి. 2000–01 ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్‌‌లో వేతనాలు, పెన్షన్ల ఖర్చు 76.13 శాతం. 2013–14 నాటికి అది 57.54 శాతానికి తగ్గింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత 2016–17 నాటికి 38.0 శాతానికి తగ్గింది. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌‌ భగీరథ, మిషన్‌‌కాకతీయ, రైతుబంధు వంటివి అమలు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని, చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగిందని పీఆర్సీ వెల్లడించింది. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలి. అది చేయకుండా ఉద్యోగుల వేతనాల పెంపును అడ్డుకోవడం సరికాదు. వేతనం పెంచడం మాట అటుంచి పొందుతున్న హెచ్‌‌ఆర్‌‌ఏ రేట్లను తగ్గించాలని సిఫారసు చేయడమా? ఉద్యోగుల వేతనాల్లో 1% ఈహెచ్‌‌ఎస్‌‌ చందాగా మినహాయించాలని సిఫారసు చేసిన పీఆర్సీ ఆస్పత్రుల్లో అందించాల్సిన ట్రీట్​మెంట్, మెడిసిన్స్​ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. చైల్డ్‌‌ కేర్‌‌ లీవ్‌‌ను 90 రోజుల నుంచి 120 రోజులకు పెంచాలని సిఫారసు చేసినట్లు చెప్తున్నారు. కానీ, గత పీఆర్సీ 730 రోజులు(2 ఏండ్లు) చైల్డ్‌‌ కేర్‌‌ లీవ్‌‌ మంజూరు చేసినా ప్రభుత్వం అమలు చేయకుండా 90 రోజులకే పరిమితం చేసింది. కన్వేయన్స్‌‌, ట్రావెలింగ్‌‌ తదితర అలవెన్సులు, స్పెషల్‌‌పేల పెంపుదల నామమాత్రంగానే ఉన్నది. గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచాలని సూచించింది.

ఈ అంశాలే కాస్త ఊరట

రిటైర్మెంట్‌‌ ఏజ్​ 60 ఏండ్లకు పెంచాలని, 20 ఏండ్ల సర్వీసుకే పూర్తి పెన్షన్‌‌ ఇవ్వాలని, చనిపోయిన ఉద్యోగుల అంత్యక్రియల ఖర్చులు రూ.30,000లకు పెంచటం, సీపీఎస్​కు ప్రభుత్వ కాంట్రిబ్యూషన్‌‌ను 14 శాతానికి పెంచడం, చనిపోయిన సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్‌‌, కాంట్రాక్ట్‌‌, ఔట్‌‌సోర్సింగ్‌‌, కాంటింజెంట్‌‌, ఎన్‌‌ఎంఆర్‌‌ ఉద్యోగులకు కనీస వేతనాలు, సెలవులు ఇవ్వాలని సిఫారసు చేయటం మాత్రమే ఆయా వర్గాలకు కాస్త ఊరట.

ప్రభుత్వం రెస్పాండ్ కాకుంటే ఉద్యమం తప్పదు

అనేక ఆందోళనలు, పోరాటాల తర్వాత వెలువడిన పీఆర్సీ రిపోర్ట్​ ఊరించి ఉసూరుమనిపించింది. పీఆర్సీ రిపోర్ట్​పై ఇంత తీవ్ర నిరసన మునుపెన్నడూ రాలేదు. ఇప్పటికైనా ఉద్యోగుల మనోభావాలను ప్రభుత్వం అర్థం చేసుకుని పీఆర్సీలో అవసరమైన మార్పులు చేయాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించి గౌరవప్రదమైన వేతనాలు ఇవ్వకుంటే ఉద్యమాలకు సిద్ధపడే పరిస్థితి వస్తుందని గుర్తించాలి. మంచి ఫిట్‌‌మెంట్‌‌తో వేతనాలు, 2018 జూలై 1 నుంచి పీఆర్సీ ప్రయోజనాల అమలు, గ్రాట్యుటీ రూ.20 లక్షలకు పెంపు, హెచ్ఆర్ఏ శ్లాబులు యథాతథంగా కొనసాగించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి. లేదంటే యూనియన్లు ఐక్యపోరాటం చేసేందుకు కార్యాచరణ ప్రకటించాలి. అలా చేయకుండా ప్రభుత్వంపై నమ్మకం ఉందంటూ సాగిలపడితే సమస్యలు పరిష్కారం కాకపోగా యూనియన్ సభ్యులకు నేతలపై భరోసా పోతుంది.

మినిమం ఫిట్‌‌మెంట్ కూడా ఇయ్యలే

వేతనాల పెరుగుదలలో అత్యంత కీలకమైంది ఫిట్‌‌మెంట్‌‌. ఐఎల్‌‌సీకి అనుగుణంగా నిర్ణయించే కనీస వేతనాన్ని బట్టే ఫిట్‌‌మెంట్‌‌ఉంటుంది. గత పీఆర్సీ నిర్ణయించిన కనీస వేతనం, పీఆర్సీ అమలు తేదీ నాటికి పొందుతున్న డీఏ మొత్తానికి, నూతనంగా నిర్ణయించిన కనీస వేతనానికి మధ్య వ్యత్యాసమే ఫిట్‌‌మెంట్‌‌. ప్రస్తుత పీఆర్సీ నిర్ణయించిన కనీస వేతనం రూ.19,000. గత పీఆర్సీలో కనీస వేతనం రూ.13,000. 2018 జూలై 1 నాటికి పొందుతున్న డీఏ 30.392% అంటే రూ.3,951. 19,000–16,951(-13,000+3,951)= 2,049. గత పీఆర్సీలో కనీస వేతనం రూ.13,000పైన రూ.2,049ని లెక్కిస్తే 15.76% ఫిట్‌‌మెంట్‌‌గా నిర్ణయించాలి. కానీ ప్రభుత్వం ప్రకటించిన 43% ఫిట్‌‌మెంట్‌‌ఆధారంగా బేసిక్‌‌ పేని రూ.13,825గా లెక్కించి 7.5% ఫిట్‌‌మెంట్​ను పీఆర్సీ ఖరారు చేసింది. అంటే పాత లెక్కలను కంపేర్ చేసి చూసినా ప్రభుత్వం మినిమం ఫిట్‌‌మెంట్ కూడా ఇవ్వలేదని అర్థమవుతుంది.

ఇంత ఘోరమైన ఫిట్‌‌మెంట్ ఎప్పుడూ సిఫారసు చేయలే

1974 తర్వాత ఇంత తక్కువ ఫిట్‌‌మెంట్‌‌ను ఏ కమిషన్ కూడా సిఫారసు చేయలేదు. అలాగే ఫిట్‌‌మెంట్​ను లెక్కించిన విధానం కూడా సైంటిఫిక్​గా లేదు. ఊహాజనితమైన బేసిక్‌‌ పేపై 30.392% డీఏ, 7.5% ఫిట్‌‌మెంట్‌‌తో కలిపి రూపొందించిన మాస్టర్‌‌స్కేల్‌‌ స్టేజిలు కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. ఉదాహరణకు రూ.13,000, రూ.13,390, రూ.13,780, రూ.14,170 గతంలో  మాస్టర్‌‌స్కేల్​ స్టేజీలుగా ఉన్నాయి. పీఆర్సీ పరిగణనలోకి తీసుకున్న రూ.13,825 స్టేజీ కానేకాదు. రూ.14,170 ప్రకారం వేతనం స్థిరీకరించాలి. రూ.14170+ 30.392% డీఏ+7.5% ఫిట్‌‌మెంట్‌‌ మొత్తం- రూ.19,540 అవుతుంది. అంటే మాస్టర్‌‌ స్కేల్‌‌లో తదుపరి స్టేజి రూ.19,640 వద్ద వేతనం స్థిరీకరించబడాలి. కానీ పీఆర్సీ రూ.19,000 వద్దనే స్థిరీకరించటం వలన పీఆర్సీ నిర్ణయించిన ఫిట్‌‌మెంట్​ ప్రకారమే కనీస వేతనం స్థిరీకరణలో రూ.640 నష్టం జరిగింది. -చావ రవి, టీఎస్‌‌యూటీఎఫ్‌‌, ప్రధాన కార్యదర్శి.

For More News..

ఈ బడ్జెట్ వచ్చే పదేండ్ల అభివృద్ధికి బాటలు వేస్తుంది

కోర్టు టైం వేస్ట్ చేస్తారా?.. 25 వేలు ఫైన్ కట్టండి

పోతిరెడ్డిపాడు పక్కనే రాయలసీమ లిఫ్ట్‌

సంపూర్ణ అక్షరాస్యత ఊసేలేదు.. నీతి ఆయోగ్ పదేపదే అలర్ట్ చేసినా పట్టించుకోలేదు