హైదరాబాద్: బడ్జెట్ చివరి రోజున కాగ్ రిపోర్టులు అసెంబ్లీకి సమర్పించటం ఆనవాయితీ. ఆదివారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆఖరి రోజైనా కాగ్ రిపోర్టులు ఈసారి సభలో ప్రవేశ పెట్ట లేదు. రాష్ట్రంలోని వాస్తవ ఆర్థిక పరిస్థితులకు అద్దం పట్టే ఈ రిపోర్టులు ఎక్కడ ఆగిపోయాయి.. ఎందుకు సమర్పించలేదన్న అంశంపై అసెంబ్లీ లాబీల్లో చర్చ జరిగింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గతేడాది ఆడిట్ రిపోర్టులను ఇంకా రెడీ చేయలేదని.. అందుకే ఇవ్వలేకపోయామని అధికారులు చెబుతున్నారు. ఏటా జనవరి నెలాఖరులోనే కాగ్ తమ ఆడిట్ రిపోర్టులను గవర్నర్ కు అందజేస్తాయి. గవర్నర్ ఆమోదంతో వీటిని అసెంబ్లీ టేబుల్పై ఉంచుతారు. కానీ.. ఈసారి ఫిబ్రవరి రెండో వారం కావస్తున్నా గవర్నర్ కు ఈ రిపోర్టులు అందలేదు.
కాగ్ రిపోర్టుల తయారీలో ఎందుకు ఆలస్యం చేసిందన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మార్చింది. నిజానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులన్నింటినీ ఆడిట్ రిపోర్టులు బయటపడతాయి. రాష్ట్రం వచ్చినప్పటి నుంచీ భారీ బడ్జెట్ ప్రవేశపెడుతున్న ప్రభుత్వం.. ఏటా రెవిన్యూ మిగులు చూపించింది. కానీ అదంతా ఉత్తిదేనని.. కాగ్ ఆడిట్లో బయటపడింది. 2020–21లో తెలంగాణ రూ.9 వేల కోట్ల లోటులో ఉందని నిరుడు కాగ్ తమ నివేదికలోనే వేలెత్తి చూపించింది. అప్పటికే రూ.2.75 కోట్ల అప్పులున్నట్లు బయటపెట్టింది. వివిధ పద్దుల్లో అవకతవకలను ప్రస్తావించింది. దీంతో 2022 మార్చి నాటి ఆడిట్ రిపోర్టులో ఏముంది..? తెలంగాణ మరింత అప్పుల్లో కూరుకుపోయిందా.. రెవిన్యూ లోటు మరింత ఆందోళన పరిస్థితికి చేరిందా..? అనేది ఆసక్తి రేపింది. కానీ.. ఈసారి కాగ్ తమ రిపోర్టులు బయట పెట్టకపోవటంతో ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.
రిపోర్టుల తయారీలో కాగ్ లేట్ చేసిందా లేక ప్రభుత్వమే ప్లాన్ ప్రకారమే రిపోర్టుల తయారీకి మోకాలడ్డిందా..? అనే సందేహాలు వ్యకమవుతున్నాయి. ఏటా ఆడిట్ రిపోర్టులను తయారు చేసేటప్పుడు.. తాము గుర్తించిన అబ్జక్షన్లన్నింటినీ కాగ్ ముందుగా రాష్ట్ర ఆర్థిక శాఖకు పంపిస్తుంది. గడువులోగా వాటికి సంబంధించిన వివరణ ఇవ్వాలని కోరుతుంది. కానీ.. ఈ వివరణలు ఇవ్వకుండా ప్రభుత్వం ఆలస్యం చేసింది. ఇదిగో ఇస్తున్నాం... అదిగో ఇస్తున్నాం.. అంటూ బడ్జెట్ సమావేశాల దాకా సాగదీస్తూ వచ్చింది. దీంతో కాగ్ రిపోర్టుల తయారీకి బ్రేక్ పడింది. ఎలక్షన్ ఇయర్ కావటంతో అప్పులు, నెలనెలా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిని దాచిపెట్టేందుకే ప్రభుత్వం ఈ వ్యూహం అమలు చేసిందనే విమర్శలున్నాయి. ఇప్పుడు ఆగిపోయినా.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వీటిని ప్రవేశపెట్టే వీలుందని, లేదంటే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఒకేసారి రెండేడ్ల ఆడిట్ రిపోర్టులు ఇచ్చే అవకాశముంటుందని ఒక ఉన్నతాధికారి చెప్పారు.