ఎంత పని చేశారురా : ప్రభుత్వం నుంచి రూ.3 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

ఎంత పని చేశారురా : ప్రభుత్వం నుంచి రూ.3 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

ఒకే నెలలో జరిగిన రెండు వేరు సైబర్ దాడుల్లో భారత ప్రభుత్వ ఏజెన్సీకి 3 కోట్ల నష్టం వాటిల్లింది. అసలైన ఈ-మెయిల్స్‌ను భర్తీ చేసిన హ్యాకర్.. మోసపూరిత ఇన్‌వాయిస్‌లు, బ్యాంక్ ఖాతా వివరాల ద్వారా భారత అధికారులను ఏమార్చి ఈ డబ్బులు కొట్టేశాడు. ఈ ఘటన గతేడాది సెప్టెంబరులో జరగ్గా.. తాజాగా, ఈ మోసాన్ని వివరిస్తూ ISA డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్.. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి రాసిన లేఖతో బయటపడింది.

అసలేం జరిగిందంటే..?

సోమాలియా విక్రేత హేల్ బరైస్ ఎనర్జీ సొల్యూషన్స్‍కు భారత ప్రభుత్వం రూ. 3 కోట్లు (రూ. 30 మిలియన్లు) చెల్లించాల్సి ఉంది. ఆ డబ్బులు కోసం ఓ హ్యాకర్ తెలివితేటలు ప్రదర్శించాడు. అసలైన ఈ-మెయిల్స్‌ను భర్తీ చేసి.. మోసపూరిత ఇన్‌వాయిస్‌లు, బ్యాంకు ఖాతా వివరాలు పొందుపరిచి అభ్యర్థన లేఖ ద్వారా భారత అధికారులను ఏమార్చాడు. అవి నిజమని నమ్మి భారతదేశ మొదటి గ్లోబల్ ఔట్రీచ్ బాడీ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ISA) చెల్లింపులు చేసింది. తీరా చూస్తే, సోమాలియా విక్రేత హేల్ బరైస్ ఎనర్జీ సొల్యూషన్స్ తమకు ఎలాంటి చెల్లింపులు అందలేదని భారత ప్రభుత్వ ఏజెన్సీకి తెలిపింది. అనుమానంతో..  వచ్చిన అభ్యర్థన లేఖ, పొందుపరిచిన ఇన్‌వాయిస్‌లను పరిశీలించగా జరిగిన మోసం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ISA డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ తెలిపారు. 

'సైబర్ దాడి చేసిన వ్యక్తి మా అంతర్జాతీయ విక్రేతల బ్యాంకుల వివరాలను మార్చాడు. మోసపూరిత బ్యాంకు ఖాతాలకు డబ్బులు చెల్లించడానికి ఇన్‌వాయిస్‌లు పంపాడు. ఇది మా విక్రేతలకు చెల్లించాల్సి ఉంది. సెప్టెంబర్ 19న జరిగిన తప్పిదాన్ని గుర్తించాం.. సోమాలియా విక్రేత హేల్ బరైస్ ఎనర్జీ సొల్యూషన్స్ తమకు ఎలాంటి చెల్లింపులు అందలేదని తెలియజేసింది.." అని ISA డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ మంత్రికి రాసిన లేఖలో ప్రస్తావించారు.

ఏంటి ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్..?

ఉష్ణమండల దేశాలన్నీ కలిపి భారీ స్థాయిలో సౌరశక్తిని ఉత్పత్తి చేసుకోవాలనే లక్ష్యంతో 2015లో భారత ప్రధాని మోడీ అంతర్జాతీయ సౌర కూటమి(ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్)ని ప్రారంభించారు. ప్రస్తుతం ఇందులో 101 సభ్య దేశాలు ఉన్నాయి. 

ఈ కూటమి ప్రధాన లక్ష్యాలు

  • 2030 నాటికి 1000 బిలియన్​ డాలర్ల పెట్టుబడులను సమకూర్చుకోవడం
  • 2030 నాటికి 1000 గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయడం
  • 2030 నాటికి 1000 మిలియన్ల జనాభాకు సౌరశక్తిని, పర్యావరణ రహిత శక్తిని సరఫరా చేయడం ద్వారా ప్రతి ఏటా 1000 మిలియన్​ టన్నుల ఉద్గారాలను తగ్గించడం
  • దీని ప్రధాన కార్యాలయం హర్యానాలోని గురుగ్రామ్​లో ఉంది.