బీసీసీఐ మాట లెక్క చేయని అయ్యర్, ఇషాన్ కిషన్.. ప్రమాదంలో క్రికెట్ కెరీర్

బీసీసీఐ మాట లెక్క చేయని అయ్యర్, ఇషాన్ కిషన్.. ప్రమాదంలో క్రికెట్ కెరీర్

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కెరీర్ సందిగ్ధంలో పడినట్టుగానే కనిపిస్తోంది. ప్రస్తుతం టీమిండియాలో స్థానం కోసం పోరాడుతున్న వీరిద్దరూ.. బీసీసీఐ మాట లెక్క చేయనట్లుగా తెలుస్తోంది. ఆటగాడు ఫిట్‌గా ఉంటే..దేశవాళీ క్రికెట్ ఆడేందుకు అందుబాటులో ఉండాలని బీసీసీఐ సెక్రటరీ జయ్ షా ఇటీవల సూచించారు. ఇందులో భాగంగా కిషాన్, అయ్యర్  దీపక్ చాహర్‌లు ఫిబ్రవరి 16న ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ ఆడాల్సిందిగా ప్రత్యేకంగా చెప్పారు.     

నివేదిక ప్రకారం..ఈ రోజు (ఫిబ్రవరి 16) నుండి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీలో తర్వాత రౌండ్ ఆడాలని.. BCCI ఈ వారం ప్రారంభంలో ఆటగాళ్లకు మెయిల్ చేసింది. అయితే కిషన్, అయ్యర్ చివరి లీగ్ దశ రౌండ్ ప్రారంభమైనప్పటికీ వాళ్ళు ఆడలేదు. క్రికెటర్లు ఫిట్‌గా  అందుబాటులో ఉన్నప్పటికీ.. రంజీ ట్రోఫీలో దూరంగా ఉంటూ ఐపీఎల్ లాంటి క్యాష్ లీగ్ ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రస్తుతం భారత క్రికెట్‌లో చర్చ తారాస్థాయికి చేరుకుంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సెక్రటరీ జయ్ షా ఇటీవల ఆటగాళ్లు ఫిట్‌గా ఉంటేనే దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని స్పష్టంగా చేసినా ఆటగాళ్లు రంజీల్లో ఆడేందుకు ఆసక్తి చూపించలేదు. 

ప్రస్తుతం కిషన్ ఫిట్‌గా ఉన్నాడు. ఇటీవలే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి బరోడాలో శిక్షణ పొందుతూ కనిపించాడు.  మరోవైపు రెండో టెస్టు తర్వాత ఇంగ్లండ్ సిరీస్‌లో శ్రేయాస్ ను భారత టెస్ట్ జట్టు నుండి తొలగించారు. అతని గాయం గురించి రకరకాల ఊహాగానాలు ఉన్నా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడమని బీసీసీఐ ప్రత్యేకంగా కోరిన ఆటగాళ్లలో అయ్యర్ ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. రాజ్ కోట్ టెస్ట్ కు ముందు స్టేడియం పేరు మార్చే కార్యక్రమంలో బీసీసీఐ సెక్రటరీ జయ్ షా మాట్లాడుతూ ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లందరికీ దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని ఆదేశాలు పంపుతానని చెప్పారు. 

ఫామ్ లేక జట్టులో చోటు కోసం కష్టపడుతున్న వీరు బీసీసీఐ మాటను లెక్క చేయకుండా రంజీలతో మాకు సంబంధం లేదన్నట్టు ఉన్నారు. దీంతో వీరిద్దరిపై బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇషాన్ కిషాన్ చివరిసారిగా 2023 డిసెంబర్ లో ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు ఎంపికైనా తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్ట్ లు విఫలమైన తర్వాత అయ్యర్ కు మూడో టెస్టులో చోటు కోల్పోయాడు.