వరల్డ్ కప్ లో భాగంగా నిన్న జరిగిన తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆటగాళ్లందరూ సమిష్టిగా పోరాడడంతో 12 ఏళ్ళ తర్వాత వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ, అయ్యర్ సెంచరీలతో చెలరేగగా ఓపెనర్ గిల్ 80 పరుగులు చేసాడు. రోహిత్, రాహుల్ వేగంగా ఆడారు. బౌలింగ్ లో షమీ 7 వికెట్లతో సంచలన స్పెల్ వేస్తే కీలక దశలో బుమ్రా, కుల్దీప్ కివీస్ ఆటగాళ్లను కట్టడి చేశారు. భారీ ఛేజింగ్ లో జడేజా పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు.
ఈ మ్యాచ్ లో ఆడిన వారందరూ హీరోలైతే ఆడకుండానే ఇషాన్ కిషాన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇన్నింగ్స్ 36 ఓవర్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ కు తిమ్మిర్లు వచ్చాయి. అప్పటికే సెంచరీ చేసి మంచి ఊపు మీద ఉన్న మిచెల్ బ్యాటింగ్ చేయడానికి బాగా ఇబ్బందికి గురయ్యాడు. బ్యాటింగ్ చేయలేక గ్రౌండ్ లోనే పడిపోయాడు. ఈ దశలో మైదానంలో భారత ఆటగాళ్లకు డ్రింక్స్ ఇవ్వడానికి వచ్చిన కిషాన్..మిచెల్ కాలును లాగుతూ ఉపశమనం కలిగించాడు. సాధారణంగా ప్రత్యర్థి ప్లేయర్లు ఇలా చేయడం అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ కిషన్ మాత్రం మ్యాచ్ లో లేకున్నా మిచెల్ కు సహాయం చేసి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు.
Also Read:- దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్..ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్ ఇదే
కిషాన్ చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆడకుండానే నువ్వు హీరోవయ్యావంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. కిషాన్ చేసిన ఈ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. గిల్ డెంగ్యూ బారిన పడడంతో ఈ వరల్డ్ కప్ తొలి రెండు మ్యాచ్ లు ఆడిన కిషాన్ తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై డకౌట్ కాగా.. ఆఫ్ఘనిస్థాన్ పై జరిగిన మ్యాచ్ లో 47 పరుగులు చేసాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ఎంతో సందడి చేసే కిషాన్..తనలో గొప్ప మనసుందని నిరూపించాడు.