Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ 2024.. కిషాన్ ఔట్..? శాంసన్‌కు ఛాన్స్

దేశంలో జరిగే ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ ఆడేందుకు భారత క్రికెటర్లు సిద్ధమయ్యారు. గురువారం (సెప్టెంబర్ 5) అనంతపురం వేదికగా ఈ టోర్నీ తొలి రౌండ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం టీమిండియాకు మ్యాచ్ లు ఏమీ లేకపోవడంతో భారత క్రికెట్ అభిమానుల దృష్టి ఈ టోర్నీపై నిలిచింది. రోహిత్ శర్మ, బుమ్రా, అశ్విన్, జడేనా లాంటి స్టార్ ఆటగాళ్లను మినహాయిస్తే మిగిలిన భారత క్రికెటర్లందరూ ఈ ట్రోఫీ ఆడబోతున్నారు. అయితే ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్ లకు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.   

నివేదికల ప్రకారం.. కిషాన్ బుచ్చి బాబు టోర్నమెంట్ లో గాయపడ్డాడు. అతని గాయంపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో కిషాన్ తొలి రౌండ్ మ్యాచ్ లకు దూరం అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ కిషాన్ ఆడకపోతే అతని స్థానంలో కేరళ వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులోకి ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దులీప్ ట్రోఫీకి ఎంపిక చేసిన నాలుగు స్క్వాడ్ లో సంజు శాంసన్ కు చోటు దక్కని సంగతి తెలిసిందే. 

భారత క్రికెటర్లు దులీప్ ట్రోఫీ ఆడడానికి సోమవారం (సెప్టెంబర్ 2) అనంత‌పురానికి చేరుకున్నారు. సోమవారం రాత్రి వీరు న‌గ‌రానికి చేరుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్‌, అర్ష్‌దీప్ సింగ్‌, అక్ష‌ర్ ప‌టేల్, శ్రేయ‌స్ అయ్య‌ర్‌ లాంటి అంతర్జాతీయ భారత క్రికెటర్లు ఉండడంతో సిటీ అంతా కోలాహలంగా మారింది. ఈ టోర్నీలో మొత్తం 6 మ్యాచ్ లు జరుగుతాయి. వాటిలో 5 మ్యాచ్ లు అనంతపురంలోనే  జరుగనున్నాయి. ఆర్డీటీ స్టేడియంలో ఈ మ్యాచ్ లు జరుగుతాయి. ఈ దేశీవాళీ టోర్నీ సెప్టెంబర్ 5 నుంచి 24వ తేదీ వరకు జరుగనుంది.
 
దులీప్ ట్రోఫీ కోసం బీసీసీఐ బుధవారం (ఆగస్ట్ 14) జట్లను ప్రకటించింది. టీమ్ ఏ, టీం బి, టీమ్ సి, టీం డి జట్లకు వరుసగా శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్,  శ్రేయాస్ అయ్యర్  కెప్టెన్లుగా జట్టును నడిపిస్తారు. దులీప్ ట్రోఫీ నుంచి రెస్ట్ తీసుకున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ నేరుగా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉంటారు.