Buchi Babu Trophy 2024: బుచ్చి బాబు ట్రోఫీ.. కెప్టెన్‌గా ఇషాన్ కిషన్

Buchi Babu Trophy 2024: బుచ్చి బాబు ట్రోఫీ.. కెప్టెన్‌గా ఇషాన్ కిషన్

టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ భారత జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్నాడు. అయితే టీమిండియాలో స్థానం సంపాదించడానికి అతనికి దారులు తెరుచుకున్నాయి. బుచ్చి బాబు ట్రోఫీలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తన రాష్ట్ర జట్టు జార్ఖండ్‌కు కెప్టెన్ గా కిషన్ కు బాధ్యతలు అప్పగించారు. తమిళనాడు రాష్ట్రంలో ఆగస్టు 15న టోర్నీ ప్రారంభం కానుంది. టోర్నమెంట్‌లో మొత్తం 12 జట్లు ఆడతాయి. టెస్ట్ ఫార్మాట్ లో జరిగే ఈ టోర్నీలో మ్యాచ్ నాలుగు రోజులు జరుగుతుంది. వీటిలో 10 రాష్ట్ర జట్లు కాగా, రెండు జట్లు తమిళనాడుకు చెందినవి. 

ఇషాన్ కిషన్ 2023 సంవత్సరంలో భారత స్క్వాడ్ లో ఉంటున్నాడు. తుది జట్టులో ఆడే అవకాశం తక్కువగానే వచ్చినా.. ప్రయాణాలు చేస్తూనే ఉన్నాడు.  2023 వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కిషన్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో ఆడాడు. తొలి మూడు టీ20 ల తర్వాత కిషన్ కు తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ లో ఎంపికైన కిషాన్.. బెంచ్ కే పరిమితమయ్యాడు. దీనికి తోడు బీసీసీఐ మాట లెక్క చేయకపోవడంతో అతని సెంట్రల్ కాంట్రాక్ట్ పోయింది. దీనితో పాటు భారత జట్టులో స్థానం కోల్పోయాడు. 

టైటిల్ రేసులో 12 జట్లు..

మొత్తం 12 జట్లు తలపడుతోన్న ఈ టోర్నీని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) నిర్వహిస్తోంది. పాల్గొంటున్న 12 జట్లను ఒక్కో గ్రూపుకు రెండు జట్లు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. తమిళనాడులోని తిరునెల్వేలి, కోయంబత్తూరు, సేలం, నాథమ్ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి సెమీఫైనల్ కు తిరునెల్వేలిలో జరగనుండగా, రెండో సెమీ-ఫైనల్, గ్రాండ్ ఫినాలేకు నాథమ్‌ ఆతిథ్యమివ్వనుంది. రంజీ ట్రోఫీ లీగ్ దశల మాదిరిగానే నాలుగు రోజుల రెడ్-బాల్ ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుంది. విజేతగా నిలిచిన జట్టు రూ.3 లక్షలు, రన్నరప్‌గా నిలిచిన జట్టు రూ. 2 లక్షలు ప్రైజ్ మనీ అందుకోనున్నాయి.