ఇదేం కొట్టుడు సామీ: ఉప్పల్‎లో ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ

ఇదేం కొట్టుడు సామీ:  ఉప్పల్‎లో ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ

ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్‎తో జరుగుతోన్న మ్యాచ్‎లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. స్పిన్నరా.. పేసరా అనే దానితో సంబంధమే లేకుండా రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోశారు. ముఖ్యంగా టీమిండియా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఉప్పల్ స్టేడియంలో పరుగుల వర్షం కురిపించాడు. సెకండ్ డౌన్లో బ్యాటింగ్‎కు వచ్చిన ఈ ఝార్ఖండ్ డైనమేట్.. మెరుపు సెంచరీ చేశాడు. గ్రౌండ్ నలువైపులా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ఆర్ఆర్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 45 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు బాది సెంచరీ మార్క్ అందుకున్నాడు. 

ఈ మ్యాచులో మొత్తం 46 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ 11 ఫోర్లు, 6 సిక్సర్ల సహయంతో 106 పరుగులు చేశాడు. లీగ్ తొలి మ్యాచులోనే కిషాన్ సెంచరీ చేయడం విశేషం. ఈ మ్యాచులో ట్రావిస్ హెడ్ 67, అభిషేక్ వర్మ 24, నితీష్ రెడ్డి 30, క్లాసెన్ 34 పరుగులతో రాణించడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ హిస్టరీలో ఇది సెకండ్ హాయెస్ట్ స్కోర్. ఫస్ట్ హాయెస్ట్ స్కోర్ 287 కూడా హైదరాబాదేది కావడం విశేషం. మరో రెండు పరుగులు చేసి ఉంటే తమ రికార్డ్‎ను తామే ఎస్ఆర్‎హెచ్ బ్రేక్ చేసేది. 

ALSO READ : SRH vs RR IPL 2025: 105 మీటర్ల భారీ సిక్సర్.. రాజస్థాన్‌ను చితక్కొట్టిన హెడ్

2024 డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో 26 ఏళ్ల ఇషాన్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడి మరీ రూ11. 25 కోట్ల భారీ ధరకు ఇషాన్ ను కొనుగోలు చేసింది. ఇషాన్‎కు ఐపీఎల్‎లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. లాస్ట్ సీజన్లో ఇషాన్ కిషన్ లీగ్ లోనే మోస్ట్ పాపులర్ టీమ్ ముంబై ఇండియన్స్ తరుఫున ఆడాడు. మెగా వేలంలో ఎస్ఆర్‎హెచ్ ఇషాన్ ను సొంతం చేసుకుంది. ఎస్ఆర్ హెచ్ మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని తొలి మ్యాచులోనే మెరుపు సెంచరీతో నిలబెట్టుకున్నాడు ఇషాన్ కిషన్.