న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాపై 4–1తో టీ20 సిరీస్ గెలిచిన ఇండియా యంగ్ టీమ్.. ఇప్పుడు సౌతాఫ్రికా సవాల్‌కు రెడీ అయ్యింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ నెల 10న సఫారీలతో తొలి టీ20 ఆడనున్నారు. ఈ నేపథ్యంలో సిరీస్‌కు తుది జట్టును ఖరారు చేయడం చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు తలనొప్పిగా మారింది. కొత్తగా వచ్చిన ప్రతి ప్లేయర్ అద్భుతంగా ఆడుతుండటంతో తుది జట్టు ఎంపికపై డైలమా కొనసాగుతున్నది. ముఖ్యంగా కీపర్ ప్లేస్ కోసం ఇషాన్ కిషన్, జితేశ్ శర్మలో ఎవర్ని తీసుకోవాలన్న దానిపై సందిగ్ధత మొదలైంది. ఇటీవల ఇండియా తరఫున ఆడిన ప్రతి మ్యాచ్‌లో ఇషాన్ మంచి ఫామ్‌ను చూపెట్టాడు. వరల్డ్ కప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఆకట్టుకున్నాడు. ఆసీస్‌తో తొలి రెండు టీ20ల్లో అదరగొట్టాడు. ఇక చివరి రెండు టీ20లు ఆడిన జితేశ్ కూడా ఎవరూ ఊహించని విధంగా తన బ్యాట్ పవర్ చూపెట్టాడు. దీంతో టీ20 వరల్డ్ కప్‌కు టైమ్ దగ్గరపడుతుండటంతో ఇప్పుడు టీమ్ డైనమిక్స్ అన్నీ మారిపోతున్నాయి. మరి ఈ ఇద్దరిలో చీఫ్ కోచ్ ఎవరిపై ఫోకస్ చేస్తాడో చూడాలి.
ఫినిషర్‌గా జితేశ్..
ఆస్ట్రేలియాతో తొలి మూడు టీ20ల్లో మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇషాన్ వరుసగా రెండు హాఫ్ సెంచరీలు (58, 52) చేశాడు. కానీ థర్డ్ మ్యాచ్‌లో డకౌటయ్యాడు. దీంతో అతనికి రెస్ట్ ఇచ్చిన మేనేజ్‌మెంట్ జితేశ్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఈ చాన్స్‌ను అతను అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు. ఫినిషర్‌గా తన సత్తా ఏంటో సెలెక్టర్లకు చూపెట్టాడు. రింకూ సింగ్‌కు దీటుగా భారీ సిక్సర్లు కొట్టిన అతను చివరి రెండు మ్యాచ్‌ల్లో 35 (19 బాల్స్), 24 (16 బాల్స్) రన్స్ చేశాడు. షార్ట్ ఫార్మాట్ అంటేనే వేగానికి మారు పేరు. ఓవర్‌కు కనీసం 18 నుంచి 20 రన్స్ రాబట్టే సత్తా ఉన్న ప్లేయర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అలాంటి లక్షణాలే ఇప్పుడు జితేశ్‌లో కనిపిస్తున్నాయి. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ కీపర్‌గానూ అతనికి మంచి మార్కులే పడ్డాయి. కాబట్టి ఇషాన్‌ను వెనక్కి నెట్టి టీమ్‌లో చోటు సుస్థిరం చేసుకుంటాడా? ఇప్పుడున్న సమీకరణాల ప్రకారం ఈ సిరీస్ ఇద్దరికి అత్యంత కీలకం. ఇందులో వచ్చే చాన్స్‌ను మిస్ చేసుకుంటే దాదాపుగా టీమిండియా ప్లేస్‌కు దూరమైనట్లే. ఇక వరల్డ్‌కప్‌కు ముందు ఐపీఎల్ కూడా ఉంది. కాబట్టి అందులోనూ దుమ్మురేపాలి. అప్పుడే సెలెక్షన్ రేస్‌లో ముందుకు రావొచ్చు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌ను జితేశ్, ఇషాన్ ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.
కోహ్లీ ప్లేస్‌లో ఇషాన్ !
మరోవైపు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టీ20 కెరీర్ ముగిసిందనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో అతను ఆడే చాన్సెస్ లేవనే చర్చలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు కోహ్లీ టీ20లు ఆడక ఏడాది దాటిపోయింది. ఇప్పుడు సౌతాఫ్రికా సిరీస్‌కు కూడా దూరంగా ఉంటున్నాడు. ఇదే టైమ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా మెగా ఈవెంట్‌కు అందుబాటులో ఉంటామని సంకేతాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ లేకపోతే అతని ప్లేస్‌లో ఇషాన్‌ను ఆడించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను కోచ్ రాహుల్ ద్రవిడ్ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కోహ్లీ నిర్ణయం ఎలా ఉన్నా.. ఐపీఎల్ పెర్ఫామెన్స్‌ను బట్టే మెగా టీ20 వరల్డ్ కప్ ఈవెంట్‌కు టీమ్ ఎంపిక ఉంటుంది.