SRH vs MI: ముంబైకి ఫ్రీ వికెట్: అర్ధం లేని క్రీడా స్ఫూర్తి.. ఔట్ కాకుండానే వెళ్లిపోయిన కిషాన్

SRH vs MI: ముంబైకి ఫ్రీ వికెట్: అర్ధం లేని క్రీడా స్ఫూర్తి.. ఔట్ కాకుండానే వెళ్లిపోయిన కిషాన్

ఐపీఎల్ 2025 లో ఇషాన్ కిషాన్ తన క్రీడా స్పూర్తితో అనవసర త్యాగం చేశాడు. బుధవారం (ఏప్రిల్ 23) ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో ఔట్ కాకుండానే పెవిలియన్ కు చేరి ముంబై ఇండియన్స్ కు వరంలా మారాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ తొలి బంతి దీపక్ చాహర్ లెగ్ సైడ్ వేశాడు. కిషాన్ ముందుకు జరిగి ఆడడంతో బాల్ అతని తొడకు తాకి వికెట్ కీపర్ చేతిలో పడింది. ఇక్కడే పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. హార్దిక్ నుండి అప్పీల్ వచ్చినా.. కీపర్, బౌలర్ దగ్గర నుండి ఎలాంటి అప్పీల్ లేదు.

అంపైర్ ఔట్ ఇద్దామా వద్దా అనుకుంటున్నా సమయంలో కిషాన్ తల వంచుకొని పెవిలియన్ కు వెళ్తున్నాడు. దీంతో ఔట్ అంటూ అంపైర్ వేలు పైకి ఎత్తాడు. కిషాన్ తనకు తానుగా వెళ్లడం చూసి అంపైర్ ఔట్ అని ప్రకటించాడు. దీంతో ఊహించకుండా వచ్చిన ఈ వికెట్ చూసి సెలెబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాత రిప్లేలో బంతి అల్ట్రా ఎడ్జ్ కు తాకలేదని చూపించింది. కిషాన్ తీసుకున్న నిర్ణయంతో స్టేడియంలో  ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. రెండో ఓవర్లో బోల్ట్ బౌలింగ్ లో చక్కని సిక్సర్ కొట్టిన కిషాన్ 8 బంతుల్లో 8 పరుగులు చేసి ఔటయ్యాడు. 

కిషాన్ ఔట్ కావడంతో సన్ రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత అభిషేక్ శర్మ(8) , నితీష్ కుమార్ రెడ్డి(2), అనికేత్ వర్మ (8) వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసన్ (44 బంతుల్లో 71: 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే బ్యాటింగ్ భారాన్ని మోశాడు. క్లాసన్ హాఫ్ సెంచరీతో పాటు అభినవ్ మనోహర్ (37 బంతుల్లో 43) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. 71 పరుగులు చేసి క్లాసన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.