IND vs AFG: ఇషాన్ కిషన్ పరిస్థితి ఏంటి..? కోహ్లీ స్థానంలో ఆడతాడనుకుంటే ఇలా జరిగిందేంటి

IND vs AFG: ఇషాన్ కిషన్ పరిస్థితి ఏంటి..? కోహ్లీ స్థానంలో ఆడతాడనుకుంటే ఇలా జరిగిందేంటి

టీమిండియాలో దూసుకొస్తున్న యంగ్ క్రికెటర్లలో ఇషాన్ కిషన్ ఒకడు. అన్ని ఫార్మాట్ లకు సెలక్ట్ అవుతూ భవిష్యత్తు స్టార్ బ్యాటర్ గా ప్రసంశలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో ఏకంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్థానంపైనే కన్నేసినట్టు వార్తలు వచ్చాయి. గత నెలలో విరాట్ కోహ్లి టీ20 ప్రపంచ కప్ 2024 ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని.. T20I, IPLలో కోహ్లీకి అద్భుతమైన రికార్డ్ ఉన్నప్పటికీ.. నెంబర్ 3 లో కిషన్ ఆడతాడని నివేదికలు వెల్లడించాయి. చాలా మంది క్రికెట్ ప్రేమికులు ఇదే నిజం అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. సీన్ మొత్తం రివర్స్ అయింది. 

ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ లో భాగంగా కోహ్లీ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనుకున్న కిషన్ ను సెలక్టర్లు ఎంపిక చేయకపోగా.. విరాట్ టీ20ల్లో 14 నెలల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు. కిషన్ ను కనీసం వికెట్ కీపర్ బ్యాటర్ కూడా పరిశీలించలేనట్లు అర్ధమవుతుంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) నివేదికల ప్రకారం.. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇప్పుడు కిషన్‌ను పక్కన పెట్టేయాలని చూస్తున్నట్టు సమాచారం. 

యంగ్ ప్లేయర్ జితేష్ శర్మతో పాటు ఫామ్ లో ఉన్న సంజు శాంసన్ కు ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ కు అవకాశం దక్కింది. 2024 టీ20 వరల్డ్ కప్ కు ఇదే చివరి సిరీస్ కానుండడంతో కిషన్ ఈ మెగా టోర్నీకి దూరంగా పెడుతున్నారనే వార్తలు ప్రస్తుతం వైరల్ గా  మారుతున్నాయి. ఐపీఎల్ 2024 నిరూపించుకుంటేనే కిషన్ కు అవకాశం దక్కొచ్చు. లేకపోతే టీ20 వరల్డ్ కప్ పై ఆశలు వదులుకోవాల్సిందే. 

కిషన్ చివరిసారిగా దక్షిణాఫ్రికా టీ 20 జట్టులో స్థానం సంపాదించాడు. టీ20 సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.   ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వలన బీసీసీఐను రిక్వెస్ట్ చేయడంతో ఈ జార్ఖండ్ ప్లేయర్ ను టెస్ట్ స్క్వాడ్ నుంచి రిలీజ్ చేశారు. అయితే కిషన్ బీసీసీఐని ఏమని రిక్వెస్ట్ చేసాడో ప్రస్తావించలేదు. తాజాగా వస్తున్న సమాచార ప్రకారం కిషన్ మానసికంగా అలసిపోయాడని.. ఈ కారణంగానే క్రికెట్ నుంచి కొంతకాలం బ్రేక్ కావాలని కోరినట్టు నివేదికలు చెబుతున్నాయి. మొత్తానికి బ్రేక్ కావాలని కోరిన కిషన్ కు సెలక్టర్లు పెద్ద షాక్ ఇచ్చారు.