GT vs DC: ఢిల్లీ యువ బ్యాటర్‌కు వేలు చూపించిన ఇషాంత్.. అంపైర్‌తో గిల్ వాదన

GT vs DC: ఢిల్లీ యువ బ్యాటర్‌కు వేలు చూపించిన ఇషాంత్.. అంపైర్‌తో గిల్ వాదన

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పేసర్ ఇషాంత్ శర్మ, ఢిల్లీ క్యాపిటల్స్ ఫినిషర్ అశుతోష్ శర్మ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇన్నింగ్స్ 19 ఓవర్ చివరి బంతికి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇషాంత్ వేసిన బౌన్సర్ ను అశుతోష్ పుల్ షాట్ ఆడాలని ప్రయత్నించగా.. అది కాస్త మిస్ అయ్యి వికెట్ కీపర్ బట్లర్ చేతిలో పడింది. టైటాన్స్ క్యాచ్ కోసం  అప్పీల్ చేయగా.. బ్యాట్స్ మన్ భుజం నుండి వెళ్లిపోవడంతో అంపైర్ తిరస్కరించి నాటౌట్ గా ప్రకటించాడు. 

అంపైర్ తన నిర్ణయం ప్రకటించిన తర్వాత అశుతోష్ శర్మ తన భుజాన్ని చూపించాడు. బంతి తనను ఎక్కడ తాకిందో చూపించడానికి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ తన స్లీవ్‌ను పైకి లాగాడు. అయితే ఇది బౌలర్ ఇషాంత్ శర్మకు నచ్చలేదు. అంపైర్ నాటౌట్ ఇచ్చిన తర్వాత నువ్వెందుకు మాట్లాడుతున్నావు అన్నట్టు అశుతోష్ వైపు వేలు చూపించి మాట్లాడాడు. వీరి మధ్య గొడవలో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ జోక్యం చేసుకుని ఆన్-ఫీల్డ్ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ఎక్కువ సేపు మాట్లాడడంతో ఆటకు కాస్త అంతరాయం కలిగింది. 

ఈ మ్యాచ్ లో అశుతోష్ (19 బంతుల్లో 37:2 ఫోర్లు, 3 సిక్సర్లు)   కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ఇషాంత్ శర్మ.. డోనోవన్ ఫెర్రీరా వికెట్ తీసుకున్నాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ (32 బంతుల్లో 39: ఫోర్, 2 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ కు తోడు మిగిలిన వారు సమిష్టిగా రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు భారీ స్కోర్ చేసింది. 39 పరుగులు చేసి అక్షర్ పటేల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అర్షద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, సాయి కిషోర్, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు.