
ఐపీఎల్ 18లో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 6) సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న జీటీ పేసర్ ఇషాంత్ శర్మకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ మ్యాచులో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఇషాంత్ శర్మకు మ్యాచ్ ఫీజులో రూ.25 లక్షల జరిమానా విధించింది ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ. ఫైన్‌తో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించింది.
మరో రెండు డీమెరిట్ పాయింట్లు వస్తే ఇషాంత్ శర్మపై ఒక మ్యాచ్ నిషేధం పడే అశకాశం ఉంది. ఇషాంత్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడని బీసీసీఐ స్పష్టం చేసింది. దుస్తుల్ని కానీ, గ్రౌండ్ ఈక్విప్మెంట్ పట్ల కానీ అమర్యాదరకంగా ప్రవర్తిస్తే ఐపీఎల్ ప్రవర్తనా నియామావళిలోని 2.2 ప్రకారం లెవల్ 1 కింద ఫైన్ విధిస్తారు. లెవల్ 1 నేరాన్ని ఇషాంత్ శర్మ అంగీకరించడంతో.. మ్యాచ్ రెఫరీ నిర్ణయం ప్రకారం జరిమానా విధించినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
►ALSO READ | SRH vs GT: ఎస్ఆర్హెచ్ ఓటమికి కారణం అదే.. కుల్లంకుల్లా చెప్పేసిన అంబటి రాయుడు
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అతిథ్య ఎస్ఆర్హెచ్ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అయితే.. గుజరాత్ మ్యాచ్ గెలిసినప్పటికీ జీటీ సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ చెత్త ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లు వేసిన ఇషాంత్ ఒక్క వికెట్ తీయకుండా 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచులో ఎస్ఆర్హెచ్ మొత్తం 152 పరుగులు చేస్తే.. ఇందులో ఒక్క ఇషాంత్ శర్మనే 53 పరుగులు ఇవ్వడం గమనార్హం. తన బౌలింగ్‌ను ఎస్ఆర్హెచ్ చితకబాదటంతో ఇషాంత్ తీవ్ర అసహనానికి గురై గ్రౌండ్లో నిబంధనలు ఉల్లంఘించాడు. అప్పటికే పరుగులు ఎక్కువ ఇచ్చానని బాధలో ఉన్నా ఇషాంత్‌కు.. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించడంతో బీసీసీఐ ఫైన్ వేసి మరో షాక్ ఇచ్చింది.