- నేటి యువత, మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి: మంత్రులు
- రవీంద్రభారతిలో ఈశ్వరీబాయి 106వ జయంతి వేడుకలు
బషీర్ బాగ్, వెలుగు: జెట్టి ఈశ్వరీబాయి సేవలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. ఆమె పోరాటపటిమను నేటి యువత, మహిళలు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈశ్వరీబాయి 106 వ జయంతి వేడుకలను ఆదివారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె కూతురు, మాజీ మంత్రి గీతారెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఈశ్వరీబాయి ఒక ఫైర్ బ్రాండ్ అని , ఆమె కూతురు గీతారెడ్డి దానిని పునికిపుచ్చుకున్నారన్నారు. సామాజిక, ఆర్థిక, కుల వివక్ష ఉన్న సమయంలో కార్పొరేటర్ స్థాయి నుంచి జాతీయ పార్టీ స్థాపించే స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర బాబు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలు గొంతుకగా, ధీర వనితగా ఈశ్వరీబాయి ముందుకు సాగారని పేర్కొన్నారు.
ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మాట్లాడిన స్పీచ్ లు, నేటి యువ నాయకులకు స్ఫూర్తి దాయకమన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దళిత ఐకాన్ గా ఈశ్వరీబాయి నిలుస్తారని అన్నారు. ఆమె కూతురు గీతా రెడ్డి.. తల్లి పోరాట పటిమను కొనసాగిస్తున్నారని, ఆమె సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించుకుంటుందన్నారు. భవిష్యత్ తరాలు ఈశ్వరీబాయిని జ్ఞాపకం ఉంచుకునేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుందని, ఆమె ఆశయాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
గతంలో సేవభావంతో రాజకీయాల్లోకి వచ్చేవారని.. కానీ, ఇప్పుడు కొంత మంది స్టేటస్ కోసం వస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మహిళలకు స్వేచ్ఛ ఉంటేనే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని తన తల్లి నమ్మేవారని ఈశ్వరీబాయి ట్రస్ట్ చైర్పర్సన్గీతారెడ్డి అన్నారు. తన తల్లి ఈశ్వరీబాయి జయంతికి హాజరైన వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. అనంతరం హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావుకు ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డు–2024 ప్రదానం చేశారు.