మహాకుంభ్ నగర్: యూపీలోని త్రివేణి సంగమం వద్ద కొనసాగుతున్న మహా కుంభమేళాలో రోజూ లక్ష మందికి ఉచితంగా భోజనం అందిస్తున్నట్టు ఇస్కాన్ సంస్థ వెల్లడించింది. అదానీ గ్రూప్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపింది. మహాకుంభ్ నగర్ లోని హర్షవర్ధన్ మార్గ్ క్యాంపులో ఏర్పాటు చేసిన కిచెన్ లో ఒక విడతలో 35 వేల మందికి సరిపడా భోజనం సిద్ధం చేస్తున్నామని, ఇలా రోజూ మూడు విడతల్లో దాదాపు లక్ష మందికి భోజనాలు అందిస్తున్నామని ఇస్కాన్ డైరెక్టర్ (సీఎస్ఆర్) మధుకాంత్ దాస్ ‘పీటీఐ’కి వెల్లడించారు.
భక్తులకు అందిస్తున్న భోజనంలో పప్పు, రాజ్మా లేదా చోలే, వివిధ కూరలు, రోటీ, అన్నం, హల్వా లేదా బూందీ లడ్డూ వంటివి ఉన్నాయన్నారు. వీటన్నింటినీ మట్టి పొయ్యిల మీద, కట్టెలు, ఆవు పేడతో చేసిన పిడకల మంటతోనే వండుతున్నట్టు తెలిపారు. ప్రయాగ్ రాజ్ లో మొత్తం 40 కేంద్రాల్లో భోజనాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు.
కుంభమేళా విధుల్లో పాల్గొంటున్న 15 వేల మంది సిబ్బందికి కూడా తాము ఫుడ్ అందిస్తున్నామన్నారు. భోజనం పంపిణీ కోసం వంద వెహికల్స్ వినియోగిస్తున్నామని, వీటిని అదానీ గ్రూప్ అందజేసిందన్నారు. ఇస్కాన్ తోపాటు అదానీ గ్రూప్ నుంచి మొత్తం 3.5 వేల మంది వాలంటీర్లు ఈ భోజన సేవల్లో పాల్గొంటున్నారని చెప్పారు. అదానీ గ్రూప్ ఉద్యోగులు విడతల వారీగా కుంభమేళాకు వచ్చి
వాలంటీర్లుగా పని చేస్తున్నారని పేర్కొన్నారు.
7.51 కోట్ల రుద్రాక్షలతో 12 జ్యోతిర్లింగాలు
మహా కుంభమేళాలో రుద్రాక్షలతో రూపొందించిన ద్వాదశ జ్యోతిర్లింగాలు భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రయాగ్ రాజ్ లోని శివ నగరి వద్ద 7.51 కోట్ల రుద్రాక్షలతో 12 జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేశారు. ఒక్కో జ్యోతిర్లింగం 11 ఫీట్ల ఎత్తు, 9 ఫీట్ల వెడల్పు, 7 ఫీట్ల మందంతో రూపొందించారు. అన్ని జ్యోతిర్లింగాలపై రుద్రాక్షమాలలతో అలంకరించారు. ఇందుకోసం అవసరమైన రుద్రాక్షలన్నింటినీ పది వేల గ్రామాల్లో భిక్షాటన ద్వారా సేకరించామని మౌని బాబా అనే స్వామీజీ తెలిపారు.
‘‘టెర్రరిజం అంతమైపోవాలి. బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ దొరకాలి. అనే సంకల్పంతో ఐరన్ శివలింగాలను ఏర్పాటు చేసి, వాటిపై రుద్రాక్ష మాలలతో అలంకరించాం” అని ఆయన వెల్లడించారు.
కుంభమేళాలో రాజ్ నాథ్
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా మహాకుంభమేళాలో పాల్గొన్నారు. యూపీలోని ప్రయాగ్ రాజ్ వద్ద గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో ఆయన శనివారం పుణ్య స్నానం ఆచరించారు. సమీపంలోని అక్షయ వట్, పాటల్ పురి టెంపుల్, సరస్వతి కుండ్, హనుమాన్ టెంపు ల్ ను కూడా రాజ్ నాథ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.