జులై 13న మియాపూర్​లో జగన్నాథ రథయాత్ర

ఖైరతాబాద్, వెలుగు : మియాపూర్​లో ఈ నెల 13న ‘జగన్నాథ రథయాత్ర’ నిర్వహిస్తున్నట్టు ఇస్కాన్​మియాపూర్ శాఖ అధ్యక్షుడు శ్రీరాందాస్ తెలిపారు. గురువారం ఆయన సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు చందానగర్​ఆర్.ఎస్.బ్రదర్స్​వద్ద రథయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. మదీనగూడ, ఆల్విన్ క్రాస్ రోడ్స్, మియాపూర్ క్రాస్ రోడ్స్, జె.పి.నగర్ మీదుగా విశ్వనాథ గార్డెన్ వరకు కొనసాగుతుందని చెప్పారు.

దారి పొడువునా భక్తులకు ప్రసాదం పంపిణీ, సంకీర్తనలు, ఆధ్యాత్మిక నృత్యాలు ఉంటాయన్నారు. అదే రోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు విశ్వనాథ గార్డెన్ లో సమావేశం ఉంటుందని, ప్రభూజీల ప్రసంగాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఇస్కాన్ ప్రభూజీలు ఆనంద్, గోపీనాథ్, మధుర్ శ్యామ్, సభ్యులు గోపరాజు శ్రీనివాస్, దేవిశెట్టి శ్రీనివాస్ పాల్గన్నారు.