లాహోర్: పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కోసం విమానాన్ని దారి మళ్లించడంతో వందలాదిమంది ప్రయాణికులకు అసౌకర్యం కలిగింది. ఇస్లామాబాద్ కు బయలుదేరిన ఈ విమానం లాహోర్లో దిగడంతో ప్రయాణీకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(పీఐఏ)కు చెందిన ఈ విమానంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మర్యమ్ నవాజ్, ఇతర ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉన్నారు.
వీరంతా సౌదీ అరేబియా పర్యటన ముగించుకుని పాక్ కు తిరిగి వస్తున్నారు. సోమవారం పీకే 842 విమానం 393 మంది ప్రయాణికులతో జెడ్డా నుంచి ఇస్లామాబాద్ కు బయలుదేరింది. ఈ విమానం రాత్రి 10. 30 గంటలకు ఇస్లామాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావాలి. కానీ, విమానాన్ని దారి మళ్లించి లాహోర్ లో 9.25 గంటలకు ల్యాండ్ చేశారు. అల్లామా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ప్రధాని, సీఎంతో సహా 79 మంది ప్రయాణికులు దిగిపోయారు.
ఆ తర్వాత విమానం రాత్రి 11.17 గంటలకు ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. ఈ ఘటనపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెడ్ కార్పెట్ కార్యక్రమాలపై పాక్ ప్రధాని షరీఫ్ నిషేధం విధించిన కొన్ని రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.