జకీర్​.. ఎక్కడైనా అదే తీరు!

జకీర్​.. ఎక్కడైనా అదే తీరు!

జకీర్ అబ్దుల్ కరీం నాయక్.. పాపులర్​ పబ్లిక్​ స్పీకర్​. ఇస్లాం మత బోధకుడు. ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్​ఎఫ్​) స్థాపించి, పీస్ టీవీ ఛానెల్ పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మత విశ్వాసాల గురించి వివరిస్తుంటారు. ఇస్లాం సాహిత్యంపై పుస్తకాలు కూడా రాశారు. ముంబై యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్​ పట్టా పొందిన జకీర్​ నాయక్.. డాక్టర్​గా కెరీర్​ ప్రారంభించి, తర్వాత ఇస్లాం ప్రసంగాలు చేస్తూ పూర్తి సమయాన్ని మత కార్యకలాపాలకే కేటాయించారు.

ఈ క్రమంలో జకీర్​ని వివాదాలు చుట్టుముట్టాయి. తాజాగా మలేసియాలో ఆయన పబ్లిక్​ స్పీచ్​లపై ఏడు రాష్ట్రాలు నిషేధం విధించాయి. మతాలు, జాతుల విషయాలు మలేసియాలో చాలా సున్నితమైన అంశాలు. అక్కడి మొత్తం జనాభా 3.2 కోట్లు. ఇందులో దాదాపు 60 శాతం మంది ముస్లింలే. మిగతావాళ్లు ఇండియా, చైనా జాతీయులు. వీరిలో హిందువులే ఎక్కువ మంది. అలాంటి దేశంలో జకీర్​​ హిందువులను, చైనీయులను ఉద్దేశించి చులకనగా మాట్లాడారనే ఆరోపణలు వచ్చాయి.

దీనికి సంబంధించి స్థానిక పోలీసులు ఆయన్ని పది గంటల పాటు విచారణ జరిపారు. ఇది జరిగిన ఒక్క రోజులోనే వివిధ రాష్ట్రాలు నిషేధ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెలారంభంలో జకీర్​ ఒక స్పీచ్​ ఇస్తూ… ‘ఇండియాలోని ముస్లిం మైనారిటీల కన్నా మలేసియాలోని హిందువులు వంద రెట్లు ఎక్కువ హక్కులు పొందుతున్నారు. మలేసియాలో ఉంటున్న చైనీయులు ఆ దేశానికి గెస్టులు మాత్రమే. ఎప్పటికైనా వాళ్లు తమ సొంత దేశాలకు వెళ్లిపోవాల్సిందే’ అన్నారు. ఈ స్పీచ్​ వివాదానికి కేంద్రంగా మారింది.  మలేసియా సర్కారు మండిపడింది. ఆయన్ని దేశం నుంచి వెలేయాలని మంత్రులు సైతం డిమాండ్​ చేశారు.

ఇప్పటివరకు ఏడు రాష్ట్రాల్లో నిషేధం

జకీర్​ ప్రసంగాలపై నిషేధం విధించిన విషయాన్ని మలేసియా పోలీసులు నిర్ధారించారు. నేషనల్​ సెక్యూరిటీ, రేసియల్​ హార్మనీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ‘రాయల్​ మలేషియా పోలీస్​’ కార్పొరేట్​ కమ్యూనికేషన్స్ హెడ్​ దతుక్​ అస్మావతి అహ్మద్ ప్రకటన చేశారు. జకీర్​ పబ్లిక్​ స్పీచ్​లపై నిషేధం విధించిన రాష్ట్రాల లిస్టు.. మెలాక, జొహొత్​, సెలాంగర్​, పెనాంగ్​, కేదా, పెర్లిస్​, సర్వక్.    ​  ​

ఇండియాలో మనీ లాండరింగ్​ ఆరోపణలు

జకీర్​ నాయక్​ ఇండియాలో మనీ లాండరింగ్​ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ఇండియాలో టెర్రరిజాన్ని రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారనే ఆరోపణలున్నాయి ఆయన్ని అరెస్ట్​ చేయటానికి నేషనల్​ ఇన్వెస్టిగేటివ్​ ఏజెన్సీ (ఎన్​ఐఏ), ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) ప్రయత్నిస్తున్నాయి.  కానీ, ఆయన మూడేళ్ల నుంచి మలేసియా దాటి ఇండియాకి రావట్లేదు.  జకీర్​ని ఇండియాకి అప్పగించే కేసు ఆ దేశంలో ఇప్పటికే పెండింగ్​లో ఉంది.

సారీ..

కొందరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. అయినా ఈ పరిణామాల వల్ల ఎవరి మనసూ నొచ్చుకోకూడదనే ఉద్దేశంతోనే సారీ చెబుతున్నాను. నేనెప్పుడూ​ శాంతి దూతనే. ఖురాన్​ చెబుతున్నదీ అదే. ముందుగా నా ప్రసంగం వినండి. తర్వాత తప్పో ఒప్పో నిర్ణయించండి. అంతేకానీ గుడ్డిగా మాత్రం ఏదీ నమ్మొద్దు. ముఖ్యంగా ముస్లిమేతరులకు నా రిక్వెస్ట్​ ఇదే.

       – జకీర్ నాయక్