
టెక్నాలజీ అంది వచ్చాక క్రికెట్ స్మార్ట్ అయిపోయింది. మొన్నటికి మొన్న బ్యాటును తాకితే బంతి బౌండరీ దాటేలా ఆల్గో బ్యాట్‌ను తయారు చేశారు. ఇప్పుడు అదే బాటలో కొత్తగా స్మార్ట్ బాల్‌ను సృష్టించారు. ఆస్ట్రేలియాకు చెందిన కూకబుర్రా సంస్థ ఆ బంతిని తయారు చేసింది. మరి, ఆ బంతివల్ల ఉపయోగాలేంటి? అది స్మార్ట్ బాల్ ఎందుకైంది? బౌలర్లు తాము వేసిన బంతి స్పీడ్, లెంగ్త్, లైన్, హైట్‌ను రియల్‌టైంలో తెలుసుకునేలా బంతిలో ఓ మైక్రోచిప్‌ను పెట్టారు. ఆ మైక్రోచిప్‌ను స్మార్ట్‌వాచ్‌కు కనెక్ట్ చేశారు. బంతి రెవల్యూషన్స్ (బంతి తిరగడం) ఆధారంగా స్మార్ట్‌చిప్ డేటాను తీసుకుంటుంది. బంతి స్పీడు, వదిలేటప్పుడు బంతి ఎత్తు, పిచ్ అయ్యాక బౌన్స్‌ను లెక్కిస్తుంది. ఆ లెక్కలను తెలుసుకునేలా బంతిని వదిలిన వెంటనే బౌలర్ తాను పెట్టుకున్న స్మార్ట్ వాచీలో డేటా వస్తుంది. దానికి తగ్గట్టు బౌలర్ రివ్యూ చేసుకోవచ్చు. దాని వల్ల బౌలింగ్ తీరును బౌలర్ మెరుగుపరుచుకునే వీలుంటుంది. సంస్థ రెండేళ్లుగా ఈ స్మార్ట్ బంతిపై పని చేస్తోంది. ఇప్పటికైతే దానిని టెస్ట్ చేయలేదు. ఓ పెద్ద దేశవాళీ టీ20 మ్యాచ్‌లో పరీక్షించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది నుంచి ఐసీసీకి, పలు దేశాల క్రికెట్ బోర్డులకు వాటిని ఇవ్వాలని భావిస్తోంది. ఆ తర్వాత అన్ని ఫార్మాట్లలోనూ వాడేందుకు సన్నాహాలు చేస్తోంది.