
అమరావతి : నర్సాపురంలో సీఎం జగన్ పర్యటన పేరుతో చెట్లు నరికివేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. జగన్ రెడ్డి కాదు... ఆయన రివర్స్ రెడ్డి అని ట్వీట్ చేశారు. సాధారణంగా ప్రజాప్రతినిధులు తమ పర్యటనల్లో మొక్కలు నాటడం చూశామని, కానీ సీఎం వస్తున్నారని భారీ వృక్షాలను.. అది కూడా ఏ మాత్రం అడ్డుగాలేని చెట్లను నరికి వేయడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కలు నాటడం నేర్పాల్సిన పాలకులే... చెట్లు నరికెయ్యమని సందేశం పంపుతున్నారా? అని ప్రశ్నించారు. ఇదే కదా రివర్స్ పాలన అంటే అన్న చంద్రబాబు... నువ్వు జగన్ రెడ్డి కాదు...రివర్స్ రెడ్డి అని కామెంట్ చేశారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి? అని మండిపడ్డారు.
సీఎం పర్యటన నేపథ్యంలో నరసాపురం ప్రాంతీయ ఆసుపత్రి ముందు ఎన్నో ఏళ్లుగా నీడనిస్తున్న చెట్టును పురపాలక సిబ్బంది నరికివేశారు. మామూలుగా సీఎం వస్తున్నారంటే ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల అడ్డగింతలు లాంటి రిస్ట్రిక్షన్స్ ఉండడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నరసాపురం పట్టణంలోని థామస్ వంతెనవైపుగా సీఎం కాన్వాయ్ వెళ్లకపోయినా చెట్ల కొమ్మలను నరికేశారని విమర్శిస్తు్న్నారు. మేదర్ల వంతెన, ట్యాక్సీ స్టాండ్ ఏరియాలోనూ పెద్ద ఎత్తున చెట్లు, కొమ్మలను తొలగించినట్టు సమాచారం. సీఎం కాన్వాయ్ వచ్చే మార్గంలో డివైడర్‌కు రెండువైపులా ఉన్న చెట్ల కొమ్మలు నరికేసి ఫ్లెక్సీలు పెట్టారని ఆరోపిస్తున్నారు.