కాజీపేట, వెలుగు: కాజీపేటలో కరోనా అనుమానితుల కోసం ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. రైల్వే ప్రయాణికులతో వ్యాప్తి చెందే ప్రమాదం ఉండడంతో ఎవరికైన కరోనా లక్షణాలు ఉంటే వారిని వెంటనే చికిత్స కోసం తరలించడం కోసం కాజీపేటలోని రైల్వే జనరల్ ఇన్ స్టిట్యూట్ కమ్యూనిటీ హాల్ ను ఐసోలేషన్ వార్డుగా మారుస్తున్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ రవీంద్రశర్మ ఇటీవల కమ్యూనిటీ హాల్ ను పరిశీలించారు. ఐసోలేషన్ వార్డు ఏర్పాటు కోసం ప్రతిపాదించారు.
మొత్తం మూడు…
ఈ నెల 21న రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో క్వారంటైన్ కు తరలకుండా రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు భార్యభర్తలను గుర్తించారు. ఇక్కడ ఐసోలేషన్ వార్డు లేకపోవడంతో వారిని ఎంజీఎంకు, ఆ తర్వాత సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి పంపించాల్సి వచ్చింది. అలాగే ఆదివారం సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో వస్తున్న ఒక అనుమానితుడిని భువనగిరిలో దించాల్సి వచ్చింది. ఈ రెండు రోజుల్లోనే ముగ్గురు అనుమానితులు రైళ్లలో ప్రయాణించడంతో రైల్వే అధికారులు సాధ్యమైనంత త్వరగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వేపరంగా వైద్య సౌకర్యాలు కల్పించినట్లయితే వారిని ఇక్కడకు తరలించే అవకాశం ఉంది. కాజీపేట రైల్వే పాలీక్లినిక్ లో చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్, ముగ్గురు డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది ఉన్నారు. ఐసోలేషన్ వార్డులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు, డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది సేవలను ఉపయోగించుకోనున్నారు. రైల్వే కమ్యూనిటీ హాల్లో 40 పడకలు, రైల్వే పాలీక్లినిక్ లో 20 పడకలు, రైల్వే డిస్పెన్సరీలో 20 పడకలతో మూడు ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేస్తున్నట్లు డీజిల్ లోకో షెడ్ సీనియర్ డీఎంఈ, ఐసోలేషన్ వార్డుల పర్యవేక్షకులు శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 24 లేక 25వ తేదీ నుంచి ఈ ఐసోలేషన్ వార్డు అందుబాటులోకి రానుంది.