హమాస్ తీవ్రవాదుల దృష్టిలో అది ఘన విజయం. ఇజ్రాయెలీల కోణంలో అది యుద్ధ ప్రకటన. మిగిలిన దేశాల వారికి అది ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య ఘర్షణల రక్తసిక్త చరిత్రలో మరో అధ్యాయం. పాలస్తీనా టెర్రరిస్టు సంస్థ హమాస్, ఇజ్రాయెల్ మధ్య 2023న అక్టోబర్ 7న ప్రారంభమైంది అక్షరాలా యుద్ధమే అనడంలో మాత్రం సందేహం లేదు. రెండు వైపులా అపారమైన ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయి. కాకపోతే దాడి, ప్రతిదాడుల తీవ్రత పరిశీలిస్తే ఇది ఈసారి తాడోపేడో తేల్చుకునే వ్యవహారంలానే కనిపిస్తోంది. దీన్ని మధ్య ప్రాచ్య సమస్యగా తోసిపుచ్చడానికి లేదు. ఇజ్రాయెల్ పై పాలస్తీనా తీవ్రవాదుల దాడిలో విదేశీయులు కూడా చాలామంది చనిపోయారు.
ఇది ‘ఇస్లాం టెర్రరిజం’ రంగును సంతరించుకోవడం వల్ల పర్యవసానాలు, పరిణామాల ప్రభావం మిగిలిన దేశాలపైన కూడా తప్పకుండా పడుతుంది. పైగా, యూదులు, క్రైస్తవులు, ముస్లింల విశ్వాసాలతో ముడిపడిన ప్రాంతం అది. వర్తమాన పరిణామాల గతిని అంచనా వేయలేమని నిపుణులే తలలు పట్టుకుంటున్నారు. ఊహాగానాలకు ముందు ఒకసారి చరిత్రలోకి వెళితే...
ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ 1947 నవంబర్ 29న ఒక తీర్మానాన్ని (నంబరు 181) ఆమోదించింది. దీనికే విభజన తీర్మానంగా పేరు. ఈ తీర్మానం ప్రకారం ఒకప్పటి బ్రిటిష్ మాండేట్ ఆఫ్ పాలస్తీన్‌ను 1948 మే నెలలో యూదు–అరబ్ రాజ్యాలుగా విభజించవలసి ఉంది. అలాగే, ఈ తీర్మానం ప్రకారం మతపరమైన ప్రాధాన్యం కలిగిన జెరూసలేం చుట్టూ ఉన్న ప్రాంతం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ నియంత్రణ కిందకు రావాలి. తీర్మానానికి అనుగుణంగా 1948 మే 14న ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా అవతరించింది.
అయితే, ఆ ఒడంబడికను గుర్తించేందుకు పాలస్తీనియన్ అరబ్బులు తిరస్కరించారు. ఈ తీర్మానం యూదులకు అనుకూలంగా ఉందని, విభజన కింద యూదుల భూభాగంలో కొనసాగే అరబ్బులకు ఇది సమంజసం కాదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అమెరికా మధ్యేమార్గాన్ని అనుసరించింది. అది ఐక్యరాజ్య సమితి తీర్మానానికి మద్దతు ఇస్తూనే, మధ్య ప్రాచ్యంలోని అరబ్బులు, యూదుల మధ్య చర్చలను ప్రోత్సహించింది.
ఇజ్రాయెల్ అవతరించడంతోనే అరబ్బులకు యూదులకు మధ్య మొదటి యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ విజయంతో1949లో ఈ యుద్ధం ముగిసింది. ఆ యుద్ధంలో సుమారుగా ఏడు లక్షల 50 వేల మంది పాలస్తీనియన్లు నిర్వాసితులయ్యారని చెప్తారు. యుద్ధం పర్యవసానంగా ఆ ప్రాంతం మూడు భాగాలైంది. 1. ఇజ్రాయెల్. 2. వెస్ట్ బ్యాంక్ (జోర్డాన్ నదికి పశ్చిమ గట్టు) 3. గాజా స్ట్రిప్.
రెండవ యుద్ధం
తదనంతర కాలంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ముఖ్యంగా ఈజిప్టు, జోర్డాన్, సిరియాలు ఇజ్రాయెల్‌తో కయ్యానికి దిగాయి. ఆసియా నుంచి మధ్య ప్రాచ్యానికి, యూరప్‌కు నౌకల్లో ఏవి రవాణా కావాలన్నా సూయజ్ కాలువ గుండానే సాగాలి. దాని నిర్వహణ అధికారం బ్రిటిష్ ప్రభుత్వం చేతుల్లో ఉండేది. నిర్వహణ బాధ్యతలను ఒక ఫ్రెంచి యాజమాన్యంలోని కంపెనీ చూసుకునేది. ఈజిప్టు ప్రభుత్వం సూయజ్ కాలువ నిర్వహణను1956లో తన అధీనంలోకి తెచ్చుకుంది. ఈజిప్టు యత్నాన్ని మొదట అడ్డుకున్నది ఇజ్రాయెలే. తర్వాత, బ్రిటన్, ఫ్రాన్స్ సేనలు దానికి తోడయ్యాయి. 1956 అక్టోబర్ 29న మొదలైన ఈ వివాదం1956 నవంబర్ 7న అంతమైంది.
అంతర్జాతీయంగా, ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి మేరకు బ్రిటిష్ సేనలు వేగంగా అక్కడ నుంచి ఉపసంహరించుకున్నాయి. ఐక్యరాజ్య సమితి తన శాంతి దళాలను అక్కడకు పంపింది. ఆ సంఘటన కొడిగడుతున్న బ్రిటిష్ వైభవానికి మరో నిదర్శనంగా నిలిచింది. అప్పటి బ్రిటిష్ ప్రధాని ఆంథొని ఈడెన్ రాజీనామా చేయవలసి వచ్చింది. సూయజ్ కాలువపై యాజమాన్యం, సార్వభౌమాధికారం ఈజిప్టుకు దత్తమయ్యాయి. సూయజ్ సంక్షోభం తర్వాత, సినాయ్ ద్వీపకల్పంపై ఇజ్రాయెల్ దాడికి దిగింది.
ఎర్ర సముద్రానికి, మధ్యధరా సముద్రానికి మధ్యలోనున్న ఎడారి ప్రాంతం సినాయ్ ద్వీపకల్పం. ఈజిప్టునకు చెందిన ఈ ప్రాంతంలో జనాభా చాలా తక్కువ. అది ఆఫ్రికా–ఆసియా దేశాలను కలుపుతున్న వారధి. జోర్డాన్, సౌదీ అరేబియాలు దానికి పొరుగున ఉన్న ప్రాంతాలు. ఇజ్రాయెల్ సేనలు మరింత బలోపేతం అవుతాయనే భయంతో ఈజిప్టు, జోర్డాన్, సిరియాలు పరస్పర రక్షణ సహకారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. సిరియా, జోర్డాన్‌ల అండ చూసుకుని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దులు గమాల్ నాజర్ వరుసగా యుద్ధ విన్యాసాలతో ఇజ్రాయెల్‌ను భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఇజ్రాయెల్ ముందస్తు జాగ్రత్తగా 1967 జూన్ లో ఈజిప్టు, సిరియా వైమానిక దళాలపై దాడులకు దిగింది.
ఈ యుద్ధం ఆరు రోజులు సాగింది. ఫలితంగా, ఈజిప్టు నుంచి సినాయ్ ద్వీపకల్పాన్ని, గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్ చేజిక్కించుకుంది. అలాగే, జోర్డాన్ నుంచి వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలెం ఇజ్రాయెల్ వశమయ్యాయి. సిరియా కూడా గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్‌కు వదులుకోవాల్సి వచ్చింది. సిరియాలో నైరుతి దిశలో కొండలతో కూడిన మైదాన ప్రాంతం గోలన్ హైట్స్.
యోమ్ కిప్పూర్ యుద్ధం
అరబ్బులు- ఇజ్రాయెలీల మధ్య 1973లో చోటుచేసుకున్న యుద్ధం ఇది. దీన్నే అక్టోబర్ యుద్ధం అని కూడా అంటారు. యూదులకు పండుగ రోజైన యోమ్ కిప్పూర్ (అక్టోబర్ 6) న ఈజిప్టు, సిరియాలు ఈ దాడిని ప్రారంభించడం వల్ల దానికి యోమ్ కిప్పూర్ యుద్ధంగా పేరు వచ్చింది. ఈజిప్టు, సిరియాలు తాము కోల్పోయిన భూభాగాలను తిరిగి వశపరుచుకునేందుకు ఇజ్రాయెల్ పై ఒకేసారి మెరుపు దాడికి దిగాయి. ఈ యుద్ధంలో 2,500 మందికి పైగా ఇజ్రాయెలీలు, వేలాది మంది ఈజిప్షియన్లు, సిరియన్లు చనిపోయారు.
ఈ యుద్ధం వల్ల మూడు దేశాలు బాగుపడింది ఏమీ లేదు. కాకపోతే, ఇంతకుముందు వదులుకున్న భూభాగాలకు సంబంధించి చర్చలు జరిపేందుకు ఈజిప్టు, సిరియాలకు అవకాశం లభించింది. ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్ దాన్నే విజయంగా భావించాడు. ఇజ్రాయెల్ దాదాపు 39 చదరపు కిలోమీటర్ల భూభాగం షెబ్బా ఫారమ్స్‌ను 1967 నుంచి తన అధీనంలో ఉంచుకుంది. ఆ భూభాగం తనదని లెబనాన్ చెప్తోంది. షెబ్బా ఫారమ్స్ లెబనాన్‌కే చెందుతుందని సిరియా కూడా అంగీకరిస్తోంది.
ఫ్రాన్స్ ఆదరాబాదరాగా సరిహద్దులను నిర్ణయించడంతో1920 నుంచి షెబ్బా ఫామ్స్ సిరియా మ్యాప్‌లలో ఉంటూ వచ్చింది. నిజానికి, ఏవిధంగా చూసినా అది లెబనాన్ లో భాగమవుతుంది. ఇక్కడ సుమారుగా14 వ్యవసాయ క్షేత్రాలు ఉండడం వల్ల షెబ్బా ఫామ్స్ గా పేరు వచ్చింది. షీబాయే షెబ్బాగా మారిందని చెప్పుకోవచ్చు. షీబా అంటే వాగ్దానం, ప్రతిన అని అర్థం.
క్యాంప్ డేవిడ్ ఒప్పందం
వరుసగా అనేక కాల్పుల విరమణలు, శాంతి చర్చల తర్వాత ఈజిప్టు, ఇజ్రాయెల్ దేశాల ప్రతినిధులు ఒక శాంతి ఒప్పందంపై1978లో అమెరికాలో సంతకాలు చేశారు. అమెరికా ఆధ్వర్యంలో ఈజిప్టు- ఇజ్రాయెల్ మధ్య 30 ఏండ్ల ఘర్షణలకు ముగింపు పలికిన ఈ ఒప్పందం క్యాంప్ డేవిడ్ ఒప్పందంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, ఇజ్రాయెల్ ప్రదాన మంత్రి మినచెమ్ బెగిన్, ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్లు ఇందులో కీలక పాత్ర వహించారు.
అమెరికా అధ్యక్షుడు సేదదీరడానికి వెళ్ళే మేరీ ల్యాండ్ రాష్ట్రంలోని క్యాంప్ డేవిడ్‌లో చర్చలు జరగడం వల్ల ఈ ఒప్పందానికి క్యాంప్ డేవిడ్ ఒప్పందంగా పేరొచ్చింది. ఈ ఒప్పందానికిగాను సాదత్, బెగిన్లకు నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది.
ఆస్లో ఒప్పందాలు
క్యాంప్ డేవిడ్ ఒప్పందంలోని అంశాలు ఇజ్రాయెల్ దాని పొరుగు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచినప్పటికీ పాలస్తీనా స్యయం నిర్ణయాధికార హక్కు, స్వయం పాలన అంశాలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి. వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్లలో నివసిస్తున్న పాలస్తీనీయులు1987లో ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇది మొదటి ఇంతిఫాదాగా వార్తలకెక్కింది. మళ్ళీ చర్చలతో1993లో ఆస్లో ఒప్పందం కుదిరింది.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి ఇట్జాక్ రబీన్, పాలస్తీనా విమోచన సంస్థ నాయకుడు యాసర్ అరాఫత్ 1993 సెప్టెంబర్ 13న అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సమక్షంలో ఈ ఒప్పందంపై వాషింగ్టన్ లో సంతకాలు చేశారు. 1995 సెప్టెంబర్ లో మరోసారి మరిన్ని వివరాలతో కూడిన ఒప్పందంపై ఈజిప్టులో సంతకాలు జరిగాయి. ఈ రెండు ఒప్పందాలు ఆస్లో ఒప్పందాలుగా ఖ్యాతి వహించాయి. వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్లలో పాలస్తీనియన్ల స్వయం పాలనకు ఇది ఒక చట్రాన్ని రూపొందించింది.
ఇది కొత్తగా ఏర్పడిన పాలస్తీనియన్ ప్రాధికార సంస్థ, ఇజ్రాయెల్ ప్రభుత్వాలు పరస్పరం గుర్తించు కోవడానికి తోడ్పడింది. మళ్ళీ 1995లో మొదటి ఒప్పందంలోని అంశాల విస్తరణ లక్ష్యంగా ఆస్లోలోనే రెండవ ఒప్పందం కుదిరింది. వెస్ట్ బ్యాంక్‌లోని ఆరు నగరాలు, 450 పట్టణాల నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా ఉప సంహరించుకోవాలని నిర్ణయమైంది.
ఈ ఒప్పందానికి కృషి చేసినందుకుగాను రబీన్, అరాఫత్, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి షిమోన్ పెరెస్లకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. అయితే, ఈ ఒప్పందాలు కుదరడానికి అవసరమైన సానుకూల వాతావరణానికి తోడ్పడే చర్చలు నార్వేలోని ఆస్లోలో రహస్యంగా ప్రారంభం కావడం వల్ల వీటికి ఆస్లో ఒప్పందాలుగా పేరు వచ్చింది.
రెండవ ఇంతిఫాదా
అరబిక్ భాషలో ‘ఇంతిఫాదా’కి ‘కుదిపేయడం’ అనే అర్థం చెప్పుకోవచ్చు. వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ నియంత్రణ నచ్చని పాలస్తీనియన్లు 2000 సంవత్సరంలో ఆందోళనలు కొనసాగించారు. ఇస్లామీయులకు మూడవ పవిత్ర స్థలమైన అల్-అక్సామసీదును అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఏరియల్ షరాన్ సందర్శించడం వారికి గిట్టలేదు. వారు 2000 సెప్టెంబర్‌లో మొదలుపెట్టిన రెండవ ఇంతిఫాదా 2005 వరకు కొనసాగింది. దాంతో వెస్ట్ బ్యాంక్ చుట్టూ ఒక ప్రహరీ గోడ నిర్మించాలని ఇజ్రాయెల్ 2002లో నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులు వ్యతిరేకించాయి.
అతివాదుల పైచేయి
పాలస్తీనియన్ అథారిటీ పార్లమెంటరీ ఎన్నికల్లో 2006లో హమాస్ గెలుపొందింది. ఫాతా పార్టీ అధికారం నుంచి వైదొలగింది. పాలస్తీనియన్లలో ముఠా తగాదాలు పెచ్చుమీరాయి. పాలస్తీనియన్ ముస్లిం బ్రదర్ హుడ్ సంస్థ నుంచి స్ఫూర్తి పొందిన హమాస్ ఒక రాజకీయ, తీవ్రవాద ఉద్యమాన్ని రగిలించింది. గాజా స్ట్రిప్ పై పూర్తి నియంత్రణ సాధించడం దాని లక్ష్యం. మధ్యధరా సముద్ర తీరంలోని చిన్న భూభాగం గాజా స్ట్రిప్. ఈ స్ట్రిప్ కి దక్షిణంగా ఈజిప్టు ఉంది.
ఈ ప్రాంతం 1993 నుంచి పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన పాలస్తీనియన్ అథారిటీ పాలనలో ఉంది. ఇక్కడ ఇంకో తిరకాసు ఉంది. హమాస్ ఎన్నికల విజయాన్ని అమెరికా, యూరోపియన్ యూనియన్లు గుర్తించలేదు. పాశ్చాత్య దేశాలు1990ల చివరల నుంచే హమాస్‌ను తీవ్రవాద సంస్థగా పరిగణిస్తున్నాయి. హమాస్ అధికారాన్ని చేజిక్కించుకోవడంతో దానికి ఫాతాకి మధ్య హింసాయుత ఘర్షణలు చెలరేగాయి. ముందు ఆ రెండింటి మధ్య శాంతి కుదర్చడానికి 2006 నుంచి 2011 వరకు అనేక దఫాల చర్చలు జరిగాయి. మొత్తానికి, ఇష్టంలేకపోయినప్పటికీ రెండు పక్షాలు రాజీకి వచ్చాయి. ఫాతా 2014లో హమాస్ నేతృత్వంలోని ఐక్యతా ప్రభుత్వంలో చేరింది.
హద్దులు రద్దు
పాలస్తీనియన్ భూభాగాలలో ఘర్షణలతో ఇజ్రాయెల్ ప్రభుత్వానికి, హమాస్‌కి మధ్య 2014లో సైనిక పరమైన ఘర్షణ మొదలైంది. హమాస్ దాదాపు మూడు వేల రాకెట్లతో ఇజ్రాయెల్ పై దాడి చేసింది. ఇజ్రాయెల్ కూడా గాజాపై పెద్దఎత్తున ప్రతిదాడికి దిగిందని వేరే చెప్పనక్కరలేదు. ఈజిప్టు మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణతో ఆ విడత ఘర్షణలు 2014 ఆగస్టులో కాస్త చల్లారాయి. ఇజ్రాయెలీలకు, పాలస్తీనియన్లకు మధ్య 2015లో హింసాయుత ఘర్షణలు మళ్ళీ పెచ్చుమీరాయి.
ఆస్లో ఒప్పందాల ప్రకారం కుదిరిన భూభాగాల హద్దులకు కట్టుబడి ఉండనక్కరలేదని ఫాతాకు చెందిన పాలస్తీనియన్ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రకటించాడు. ఫలితంగా, గాజా స్ట్రిప్కి, ఇజ్రాయెల్‌కి మధ్యనున్న హద్దు ఇనుప కంచె వద్ద పాలస్తీనియన్లు 2018 మార్చి నుంచి మే నెల వరకు వారానికోసారి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇజ్రాయెల్ 70వ స్వాతంత్ర్య దినోత్సవం ‘నక్బా’ సందర్భంగా, నిరసనకారుల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంది.
రాళ్లు, ఇతర వస్తువులతో ఇజ్రాయెల్ పై దాడికి దిగారు. వారిని చెదరగొట్టడానికి ఇజ్రాయెల్ కాల్పులకు దిగడం రెండు వైపులా కొంతమంది చనిపోవడం షరా మామూలే. వేడెక్కిన రాజకీయ వాతావరణంతో ఫాతాకు హమాస్ కు మధ్య మళ్లీ చీలిక ఏర్పడింది. సయోధ్య చెదిరిపోయింది. సూటిగా చెప్పాలంటే, పాలస్తీనియన్ ప్రాధికార సంస్థపై పట్టు కలిగిన మహమూద్ అబ్బాస్ నాయకత్వంలోని ఫాతా పార్టీ వెస్ట్ బ్యాంక్‌ను పాలిస్తుంటే, గాజా స్ట్రిప్‌ను హమాస్ శాసిస్తూ వస్తోంది.
పాలస్తీనియన్లు అందరినీ ప్రాధికార సంస్థ గొడుగు కిందకు తెచ్చేందుకు అబ్బాస్ ప్రయత్నాలు సాగిస్తున్నా.. 2020 వరకు రెండు ప్రాంతాల్లో పాలన పైన చెప్పుకున్నట్లుగానే సాగింది. హమాస్‌కి, ఇజ్రాయెలీ రక్షణ దళాలకు మధ్య 2018 మే నెలలో పెద్దఎత్తున ఘర్షణలు రేగాయి. తాజా దాడిలో మాదిరిగానే, అప్పుడు కూడా గాజాలోని తీవ్రవాదులు వందలాది రాకెట్లతో ఇజ్రాయెల్ పై దాడి చేశారు. ఆత్మరక్షణకు ఇజ్రాయెల్ ప్రతిదాడి చేసిందని చెప్పుకోవడం చర్విత చర్వణం అవుతుంది.
పరిష్కార ప్రయత్నాలు
రావణ కాష్టంలా మారిన ఇజ్రాయెలీ–- పాలస్తీనా మంటలను చల్లార్చడానికి తమ విదేశాంగ విధానంలో ప్రాధాన్యం ఇవ్వాలని అమెరికా నిర్ణయించుకుంది. పాలస్తీనా శరణార్థులకు సాయం చేస్తున్న ఐక్యరాజ్య సమితికి చెందిన రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీకి నిధులు సమకూర్చడాన్ని 2018లో అప్పటి డొనాల్డ్ జె. ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. అంతవరకు టెల్ అవీవ్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు మార్చింది.
ఇజ్రాయెలీ నాయకత్వం ఆ నిర్ణయాన్ని హర్షిస్తే, పాలస్తీనియన్ నాయకులు, మధ్య ప్రాచ్యం, యూరప్‌లోని కొన్ని దేశాలవారు దాన్ని ఖండించారు. అందుకు కారణం... సంపూర్ణ, సమైక్య జెరూసలెంను ఇజ్రాయెల్ తన రాజధానిగా పరిగణిస్తోంది. భవిష్యత్ పాలస్తీనా రాజ్యానికి జెరూసలెంలోని తూర్పు భాగం రాజధానిగా ఉండాలని పాలస్తీనా డిమాండ్ చేస్తోంది. ట్రంప్ ప్రభుత్వం 2020 జనవరిలో ‘శాంతి నుంచి సంపదకు’ పేరుతో ఒక పథకాన్ని ప్రకటించింది. అది వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనియన్లు ఉంటున్న ప్రాంతాలను భవిష్యత్తులో ఇజ్రాయెల్ విలీనం చేసుకునేందుకు తోడ్పడుతుందని, “అవిభాజ్య” జెరూసలెంపై పూర్తి పట్టు ఇజ్రాయెల్‌కే చెందుతుందని చెప్తూ పాలస్తీనియన్లు ఆ పథకాన్ని తిరస్కరించారు. తాజా ఘర్షణలతో జర్మనీ మరికొన్ని దేశాలు కూడా పాలస్తీనీయులకు ఇస్తున్న నిధులను నిలిపివేశాయి.
అబ్రహాం ఒప్పందాలు
ఆ ప్రాంతంలో సుస్థిరతకు, శాంతికి ఇజ్రాయెల్‌తో సాధారణ సంబంధాలను నెలకొల్పుకోవాలని ఈజిప్టు 1979లోనే నిర్ణయించుకుంటే, జోర్డాన్ 1994లోగానీ ఆ రకమైన నిర్ణయానికి రాలేకపోయింది. ఇజ్రాయెల్ తో సంబంధాలను సాధారణీకరించుకోవాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు.ఏ.ఇ) 2020 ఆగస్టులో నిర్ణయించుకుంటే, బహరైన్ అదే నిర్ణయాన్ని 2020 సెప్టెంబర్‌లో ప్రకటించింది. ఈ ఒప్పందాలు అబ్రహాం ఒప్పందాలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. మధ్య ప్రాచ్యంలో శాంతి స్థాపన లక్ష్యంగా పోలెండ్ లోని వార్సాలో అమెరికా అంతకుముందు ఇజ్రాయెల్, పలు అరబ్ దేశాల మధ్య మంత్రుల స్థాయి చర్చలకు ఆతిథ్యం వహించింది. ఈ చర్చల ఫలితంగానే అబ్రహాం ఒప్పందాలు కుదిరాయి. అయితే, హమాస్ సంస్థతోపాటు ఫాతాకు చెందిన పాలస్తీనా నాయకుడు మహమూద్ అబ్బాస్ కూడా ఈ ఒప్పందాలను తిరస్కరించాడు.
కోర్టుల్లోనూ కీచులాట
జెరూసలెం తూర్పు భాగంలో షేక్ జరా అనే ప్రాంతం ఉంది. అక్కడ నివసిస్తున్న పలు పాలస్తీనియన్ కుటుంబాలు 2021 మే నెలకల్లా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి యూదు కుటుంబాలకు అప్పగించాలని ఇజ్రాయెలీ కోర్టు ఒకటి 2020 అక్టోబరులో తీర్పు చెప్పింది. షేక్ జరాకు చెందిన పలు పాలస్తీనా కుటుంబాలు ఈ తీర్పునకు వ్యతిరేకంగా అప్పీలు చేసుకున్నాయి. ఈ కేసు విచారణ సందర్భంగా కూడా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. పెండింగ్‌లో ఉన్న ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పాలస్తీనియన్లు 2021 ఏప్రిల్ చివర నుంచి జెరూసలెం వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించడం మొదలుపెట్టారు.
షేక్ జరా నుంచి ఆ కుటుంబాలు ఖాళీ చేయాల్సిందేనని కోర్టు 2021 మే నెలలో తీర్పును వెలువరించింది. షేక్ జరా ప్రాంతవాసులు రాత్రిళ్ళు బైఠాయింపులు జరపడం మొదలుపెట్టారు. రంజాన్ మాసంలో నిరసనకారులకు, ఇజ్రాయెలీ సెటిలర్లకు మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అల్-అక్సా మసీదు ఆవరణలో హింస మొదలైంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు నీటిని చిమ్మడం, రబ్బరు బులెట్లు, చివరకు గ్రెనేడ్లు విసరడం వంటి పద్ధతులను ఉపయోగించాల్సి వచ్చింది. ఫలితంగా, జెరూసలెం మరోసారి ఆందోళనలు, అల్లర్లు, హింసతో అట్టుడికింది. ఈజిప్టు మధ్యవర్తిత్వంతో 2021 మే 21న కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించింది.
ఇంటెలిజెన్స్ వైఫల్యం
హమాస్ 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై వందలాది రాకెట్లతో అనూహ్యంగా దాడి చేసింది. అనేక భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. దాదాపు 250 మంది హమాస్ మిలిటెంట్లు ఇనుప కంచెలను ఛేదించుకుని ఇజ్రాయెల్ లోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. సైనిక స్థావరాలను, నగరాలను లక్ష్యంగా చేసుకున్నారు. సైనికులను, పౌరులను బందీలుగా పట్టుకుని తీసుకెళ్ళారు. ఇంతకాలం హమాస్‌ను కట్టడి చేయడంలో, గాజాను అదుపులో పెట్టుకోవడంలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థపైనే ఆధారపడుతూ వచ్చింది.
సైన్యంతో భూ ఆక్రమణను ఎదుర్కొంటూ, ఆందోళనలను అణచివేస్తూ వచ్చింది. తాజా దాడిలో ఈ రెండు రక్షణలు విఫలమయ్యాయి. ఇజ్రాయెలీ అంతర్గత ఇంటెలిజెన్స్ సంస్థ షిన్-బెట్, బాహ్య నిఘా సంస్థ మొస్సాద్ రెండూ ప్రపంచంలోనే అత్యుత్తమైన నిఘా సంస్థలో ఒకటిగా పరిగణన పొందాయి. తీవ్రవాదులు అన్ని ఆయుధాలను సమీకరించుకోవడం, దాడులకు సమాయత్తం కావడం ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ లేదా సైన్యం దృష్టికి రాకపోవడం వింతే! కానీ, దానికి కొన్ని కారణాలు కనపడుతున్నాయి.
ఇజ్రాయెల్‌లో న్యాయవ్యవస్థ సంస్కరణల విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రభుత్వ నిర్ణయాలపై న్యాయవ్యవస్థకి ఉన్న సమీక్ష అధికారానికి ఈ సంస్కరణలు కత్తెర వేస్తున్నాయని విమర్శకుల భావన. సంకీర్ణ ప్రభుత్వంలోని ఒత్తిడులు, అనివార్యతల కారణంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆ ప్రతిఘటనను పోలీసులతో ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. సైన్యం కూడా దేశంలోని కల్లోల పరిస్థితులను అరికట్టడంపై దృష్టి సారించాల్సి వచ్చింది.
ఏదైనా, ఒక కేసులో దోషిగా తేలినా, జైలు శిక్ష పడకపోతే ఆ వ్యక్తి మంత్రిగా కొనసాగవచ్చంటూ నెసెట్ ఒక చట్టం చేసింది. షొమె హ తొరా (షాస్) పార్టీ సభ్యుడు ఒకరు పన్నుల చెల్లింపును ఎగవేసిన కేసుల్లో దోషిగా తేలాడు. కానీ, ఆయనకు పడిన శిక్ష సస్పెన్షన్‌లో ఉంది. ఆయన మూడు మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నాడు. ఆయనకు సాయపడడానికే కొత్త చట్టం తెచ్చారని జనాభిప్రాయం. ఒక లిఖిత రాజ్యాంగం లేకుండా నెట్టుకొస్తున్న ఇజ్రాయెల్ లో ఇటువంటి పరిస్థితులు తలెత్తడంలో ఆశ్చర్యం లేదు. లిఖిత రాజ్యాంగం ఉన్న దేశాలలో కూడా వివిధ వ్యవస్థల అధికార పరిధుల మధ్య వివాదాలు తలెత్తడాన్ని చూస్తున్నాం.
రాజకీయ అనివార్యతలు
ఇజ్రాయెల్ లో 2022 డిసెంబర్లో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని అత్యంత మితవాద, మతపరమైన ప్రభుత్వంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ప్రధాన భాగస్వామ్యపక్షమైన లికుడ్ పార్టీకి నెతన్యాహు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన సంకీర్ణ ప్రభుత్వంలో రెండు అల్ట్రా ఆర్తొడాక్స్ పార్టీలు, మరో మూడు అత్యంత మితవాద పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ మూడు పార్టీల్లో జియోనిజం పార్టీ ఒకటి. వెస్ట్ బ్యాంక్ లో సెటిలర్ల ఉద్యమానికి జియోనిజం పార్టీ మద్దతు ఇస్తోంది. వెస్ట్ బ్యాంక్ లో సెటిల్ మెంట్ల విస్తరణ, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని పాలక సంకీర్ణ ప్రభుత్వం బాహాటంగానే ప్రకటించింది. దీన్ని ఇజ్రాయెల్‌లోని ప్రతిపక్షాలు కూడా విమర్శించాయి. వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంలలో ప్రస్తుతం దాదాపు ఏడు లక్షల మంది సెటిలర్లు ఉంటారని ఒక అంచనా. స్వలింగ సంపర్కుల వివాహాల పట్ల వివక్షను కనబరచాల్సిందేనని కూడా పాలక సంకీర్ణం నిర్ణయించింది. దీన్ని కూడా ప్రజల్లో కొన్ని వర్గాలవారు వ్యతిరేకించారు. మొత్తం 120 మంది సభ్యులతో ఇజ్రాయెల్‌లో ఒకే చట్టసభ ఉంది. దాన్ని నెసెట్ పేరుతో పిలుస్తారు. నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీకి 32 సీట్లు లభించాయి. అతి రూఢివాద యూదు పార్టీలకు18 సీట్లు లభించాయి. మరో తీవ్రవాద మితవాద కూటమికి 14 సీట్లు లభించాయి. ఈ మూడు పక్షాలు కలిసిన సంకీర్ణ ప్రభుత్వానికి 2022 డిసెంబర్లో నెతన్యాహు నాయకుడయ్యారు.
ఎమర్జెన్సీ ఐక్యతా ప్రభుత్వం
అయితే, ఇజ్రాయెల్ ప్రస్తుతం యుద్ధ వాతావరణాన్ని చూస్తున్నందువల్ల ప్రతిపక్షాలన్నీ పాలక కూటమికి మద్దతును, సంఘీభావాన్ని ప్రకటించాయి. అవసరమైతే ఎమర్జెన్సీ ఐక్యతా ప్రభుత్వంలో తాము కూడా చేరతామని పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకుడు యయిన్ లాపిడ్ ప్రకటించారు. మహిళలు, పురుషులు ఇద్దరూ సైన్యంలో కొంతకాలం విధిగా పనిచేయాలని ఇజ్రాయెల్‌లో ఒక నియమం ఉంది. సైన్యంలో సేవ, శిక్షణ పూర్తయ్యాక పౌరులను రిజర్వు దళాలకు కేటాయిస్తారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినపుడు రెగ్యులర్ దళాలు వీరి సేవలను వినియోగించుకుంటాయి. రిజర్వు దళాలలోని మూడు లక్షల మంది ప్రస్తుతం దేశ రక్షణ విధులు నిర్వహిస్తున్నారు.
ఇరాన్ పాత్రపై అనుమానాలు
ఇరాన్లో బందీలుగా ఉన్న అమెరికన్లను విడిపించుకునేందుకు చమురు కొనుగోళ్ళకు సంబంధించి స్తంభింపజేసిన 600 కోట్ల డాలర్ల విడుదలకు అమెరికా వీలు కల్పించింది. ఆ నిధులలో కొన్నింటిని ఇరాన్ హమాస్ తీవ్రవాదులకు తరలించినట్లుగా భావిస్తున్నారు. ఇరాన్ ఈ ఆరోపణను ఖండించినా హిజ్బుల్లా వంటి సంస్థలకు తాను మద్దతు ఇస్తున్నట్లు బాహాటంగానే ప్రకటిస్తోంది. ఇరాన్ కొన్ని ఆయుధాలను మందుగుండు సామగ్రిని హమాస్‌కు అందించినట్లు తెలుస్తూనే ఉంది. ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్ భద్రతా దళ అధికారులు బీరూట్‌లో హమాస్ సభ్యులకు పచ్చజెండా ఊపినట్లు వార్తలు వస్తున్నాయి. దాడి తర్వాత టెహరాన్‌లో ‘గొప్ప విముక్తి మొదలైంది’ అని రాసిన బోర్డులు వెలిశాయి. ఇరాన్, ఖతార్, లెబనాన్ వంటి దేశాలు హమాస్‌కు మద్దతు ప్రకటిస్తే, ఇజ్రాయెల్ కున్న ఆత్మరక్షణ హక్కును దాదాపుగా 84 దేశాలు సమర్థించాయి.
భారత్ వైఖరి ఏమిటి?
భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇజ్రాయెల్ పై ఇటీవల హమాస్ చేసిన దాడిని టెర్రరిస్టు చర్యగా అభివర్ణించారు. ఈ కష్టకాలంలో ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ప్రకటించారు. కొన్ని దశాబ్దాలపాటు అలీన, అరబ్ అనుకూల విధానాన్ని అనుసరించిన తర్వాత, ఇజ్రాయెల్‌తో భారత్ అధికారిక సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. ఇజ్రాయెల్ అవతరణను భారత్ 1950లోనే గుర్తించినా స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకునేందుకు తటపటాయిస్తూ వచ్చింది. ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా భారత్ ఓటు వేస్తూ వచ్చింది. ఇజ్రాయెల్ మాత్రం భారత్‌తో స్నేహం విషయంలో ఎప్పుడూ నిర్ణయాత్మకంగానే వ్యవహరిస్తూ వచ్చింది. పాకిస్తాన్, చైనాలు భారత్ మీద యుద్ధానికి వచ్చినపుడు ఇజ్రాయెల్ జంకుగొంకు లేకుండా భారత్‌కు మద్దతు ఇచ్చింది. భారతదేశాన్ని (2003లో) సందర్శించిన మొదటి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రిగా ఏరియల్ షెరాన్ చరిత్ర సృష్టించారు. అలాగే, ఇజ్రాయెల్‌ను (2017లో) సందర్శించిన మొదటి భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ నిలిచారు.
టెల్ అవీవ్‌లో 1992 జనవరిలో భారత రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేశాక రెండు దేశాల మధ్య సంబంధాలు పెంపొందుతూ వచ్చాయి. దాంతో ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్-–పాలస్తీనా సమస్య ఓటింగ్‌కు వచ్చినప్పుడు భారత్ కొన్ని సందర్భాలలో గైర్హాజరైంది. భద్రత విషయంలో రెండు దేశాలకు ఉన్న ముప్పులు, వ్యూహాత్మక ప్రయోజనాల విషయంలో ఉన్న సారూప్యతలు, మారుతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులు భారత్-–ఇజ్రాయెల్లను సన్నిహితం చేశాయి. ఇజ్రాయెల్‌కు నమ్మదగిన మిత్రదేశమైన అమెరికాతో వ్యూహాత్మక సంబంధాల విషయంలో భారత్ ముందడుగు వేసింది.
ఇజ్రాయెల్–-భారత్ రెండు దేశాలు బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందినవే. భారత్‌కు పాకిస్తాన్ ఎలాగో ఇజ్రాయెల్‌కు పాలస్తీనా అలాంటిదని అనుకోవచ్చు. అయితే, పాలస్తీనా ఏర్పాటుకు భారత్ వ్యతిరేకం కాదు. అరాఫత్, అబ్బాస్ వంటి పాలస్తీనా నాయకులు భారతదేశ పర్యటనకు వచ్చారు. పాలస్తీనా అనుకూలురు టెర్రరిస్టు చర్యలకు దిగడాన్ని మాత్రం భారత్ వ్యతిరేకిస్తోంది. తాజా ఘర్షణల విషయంలో కూడా ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా సైనికులను, ఆయుధాలను పంపింది. ఆత్మరక్షణ హక్కును పరిరక్షించుకుంటూనే, ఏ సమస్యనైనా శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నది భారత్ అభిమతం.
ఎవరి బలమెంత?
ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడి గత 50 ఏండ్లలో ఎన్నడూ లేనంత దారుణమైందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. వందల మంది హమాస్ మిలిటెంట్లు సమన్వయంతో దాడి చేశారు. ఇజ్రాయెల్ నగరాల్లోకి చొరబడి, సైనిక స్థావరాలను ధ్వంసం చేశారు. వాస్తవానికి ఇజ్రాయెల్ బలంతో పోలిస్తే.. హమాస్ బలం చాలా తక్కువ. అయినా వెనుకడుగు వేయకుండా దాడి చేసింది.
ఇజ్రాయెల్ మిలిటరీ
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలటరీల్లో ఇది కూడా ఒకటి. ఇంటర్నేషనల్ ర్యాంకింగ్‌లో రష్యా, యునైటెడ్ స్టేట్స్, చైనా తర్వాత నాల్గవ స్థానంలో ఉంది. ఇజ్రాయెల్ వైమానిక దళం ప్రపంచంలోని అత్యంత అధునాతన వైమానిక దళాలలో ఒకటి. అధునాతన ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. F–35 స్టెల్త్ ఫైటర్లు, స్మార్ట్ బాంబులు, సెన్సర్ల నెట్‌వర్క్ సిస్టమ్, క్షిపణులు, డ్రోన్‌లను అడ్డుకునే వ్యవస్థలు ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర అణుశక్తి కూడా ఉంది. 80 నుండి 200 వార్‌హెడ్‌లు నిల్వ చేసిందని అంచనా. వెపన్ కంట్రోల్ సెంటర్ ప్రకారం.. ఇజ్రాయెల్ దాదాపు 90 ప్లూటోనియం బేస్‌డ్ అణు వార్‌హెడ్‌లను కలిగి ఉంది. ఇక ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్)లో దాదాపు 1,70,000 మంది సైనిక సిబ్బంది ఉన్నారు. ఇదే కాకుండా సైన్యంలో సేవ చేయడానికి మూడు మిలియన్లకు పైగా దేశ పౌరులు అందుబాటులో ఉన్నారు. కేవలం తొమ్మిది మిలియన్ల జనాభా మాత్రమే ఉన్న ఇజ్రాయెల్ దగ్గర భారీగా సైన్యం ఉంది.
హమాస్ మిలటరీ
రాకెట్లు, అత్యాధునిక గ్లైడర్లు, డ్రోన్లు, సముద్ర మార్గంలో దాడులు చేయడానికి కావాల్సిన బోట్లు... హమాస్ మిలిటెంట్ల దగ్గర ఉన్నాయి. ఇరాన్ సహా ముస్లిం దేశాలు ఈ ఆయుధాలను సమకూరుస్తున్నాయని అంచనా. ఇరానియన్ R–160, M302 రాకెట్లతో సహా భుజం నుంచి ప్రయోగించే రాకెట్లు కూడా ఉన్నాయి. హమాస్ సైన్యం ఇజ్రాయెల్ సైన్యంతో పోలిస్తే.. చాలా తక్కువ. అందుకే ఇజ్రాయెల్ పౌరులను అడ్డు పెట్టుకుని దాడులకు దిగుతోంది. హమాస్ సైన్యం దాదాపు 30,000 నుంచి 50,000 మాత్రమే అని ఒక అంచనా. 2009లో హమాస్ సాయుధ విభాగమైన కస్సామ్ బ్రిగేడ్స్ బలం 7,000 నుంచి 10,000 మధ్య ఉన్నట్లు అంచనా. కానీ.. ఇటీవలి ఈ మధ్య సైన్యాన్ని బాగా పెంచుకుంది.
మొసాద్
కొన్నేండ్ల క్రితం దుబాయ్‌లోని ఓ హోటల్ రూంలో బెడ్ మీద పడి ఉన్న ఒక శవాన్ని గమనించారు ఆ హోటల్ సిబ్బంది. అతను ఎవరనేది ఎంక్వైరీ చేస్తే.. పాలస్తీనా అతివాద సంస్థ ‘హమాస్’ సీనియర్ నాయకుడు మహమ్మద్ అల్ మభువా అని తెలిసింది. ఆయన చనిపోయిన స్థితిని చూసి అందరూ అది సహజ మరణం అనుకున్నారు. ఎందుకంటే.. హోటల్ గదికి బయట ‘‘డోంట్ డిస్టర్బ్’’ అని బోర్డు పెట్టి ఉంది. గది లోపలి నుంచి గడి పెట్టి ఉంది. లోపలికి మరో వ్యక్తి వెళ్లిన ఆనవాళ్లు లేవు. కానీ.. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే... అది ప్లాన్ వేసి చేసిన హత్య అని తెలిసింది. ఆ హత్య చేసింది ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ ‘మొసాద్’ అనుకున్నారంతా. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. హోటల్లో ఫుల్ సెక్యూరిటీ ఉంది. అయినా.. ఇద్దరు మొసాద్ సభ్యులు హోటల్‌లోకి వెళ్లి హత్య చేసి తప్పించుకుని పారిపోయారు. వాళ్లను పట్టుకోవడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. వాళ్ల పాస్‌పోర్ట్‌లు కూడా ఫేక్ అని తేలింది. ఇలాంటి ఆపరేషన్లు వాళ్లకు కొత్తేమీ కాదు. చెప్పుకుంటూ పోతే.. చట్టాలను దాటి ఎన్నో ఆపరేషన్లు చేశారు వాళ్లు. 1960ల్లో చేసిన ఓ ఆపరేషన్ వల్ల అంతర్జాతీయ సమాజం దృష్టి మొసాద్‌పై పడింది. మాజీ నాజీ అధికారి అడాల్ఫ్ ఈచ్‌మన్‌ను ప్రాణాలతో పట్టుకునేందుకు మొసాద్ ఈ ఆపరేషన్ చేపట్టింది. అర్జెంటీనాలో అతణ్ని పట్టుకొని ప్రాణాలతో ఇజ్రాయెల్‌కి తీసుకొచ్చింది. ఇందులో ఉండేవాళ్లు ఆపరేషన్‌లో ఎంత రిస్క్ ఉన్నా వెనకడుగు వేయరు. ఎప్పటికప్పుడు శత్రు దేశాలను కనిపెడుతూ ఉంటారు. కానీ.. ఈసారి మాత్రం హమాస్ ఎత్తులను ఊహించలేకపోయారు.
బలమైన సంస్థ
మొసాద్ పశ్చిమ దేశాల్లో రెండో అతిపెద్ద గూఢచర్య సంస్థ. ఇజ్రాయెల్ మిలటరీలో సూపర్ పవర్‌గా మారడానికి మొసాద్ పాత్ర చాలా కీలకం. దీని కోసం గవర్నమెంట్ మూడు బిలియన్ల వార్షిక బడ్జెట్ ఇస్తుంటుంది. ఇందులో సుమారు 7,000 మంది పనిచేస్తున్నారు. 2021 జూన్‌లో యోస్సీ కోహెన్ తర్వాత మొసాద్ చీఫ్‌గా డేవిడ్ డాడీ బర్నియా బాధ్యతలు తీసుకున్నాడు.
మొసాద్‌లో అంతర్గతంగా అనేక విభాగాలు పనిచేస్తున్నాయి. కానీ.. అవి ఏం చేస్తాయనే వివరాలు చాలావరకు గోప్యంగా ఉంటాయి. మొసాద్‌కు పాలస్తీనా మిలిటెంట్ గ్రూపులతోపాటు లెబనాన్, సిరియా, ఇరాన్ లాంటి శత్రు దేశాల్లో ఇన్‌ఫార్మర్లు ఉన్నారు. గూఢచారి నెట్‌వర్క్ ద్వారా మిలిటెంట్ నాయకుల కదలికలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటుంది మొసాద్.
విభాగాలు
మొసాద్ కలెక్షన్స్ డిపార్ట్‌మెంట్.. ఇది ప్రపంచవ్యాప్తంగా గూఢచర్య కార్యకలాపాలకు బాధ్యత వహిస్తున్న అతిపెద్ద విభాగం.పొలిటికల్ యాక్షన్ అండ్ లైజన్ డిపార్ట్‌మెంట్.. రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తుంటుంది. స్నేహపూర్వక విదేశీ గూఢచార సేవలు, ఇజ్రాయెల్ అధికారిక దౌత్య సంబంధాలు లేని దేశాలతో కలిసి పనిచేస్తుంది.మెట్సాడా అని కూడా పిలువబడే స్పెషల్ ఆపరేషన్స్ విభాగం కూడా ఉంది. హత్యలు, విధ్వంసాలు చేయడం, పారామిలిటరీ, మానసిక యుద్ధ కార్యకలాపాలను చేస్తుంది.ల్యాప్ విభాగం.. సైకలాజికల్ వార్ఫేర్, ప్రాపగండా, మోసపూరిత ఆపరేషన్లకు బాధ్యత వహిస్తుంది.పరిశోధన విభాగం.. రోజువారీ పరిస్థితి నివేదికలు, ప్రతివారం, నెలవారీ నివేదికలు లాంటివి రెడీ చేస్తుంది. మొసాద్ కార్యకలాపాలకు సపోర్ట్‌గా సాంకేతిక విభాగం కూడా ఉంటుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇది డెవలప్ చేస్తుంటుంది.
-మల్లంపల్లి ధూర్జటి