గాజా సిటీలో పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న తబీన్ స్కూల్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడిలో 80 మంది చనిపోయారు. మరో 47 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చనిపోయిన వారిలో చాలా మంది మహిళలు, పిల్లలున్నారని పాలస్తీనా అధికారులు వెల్లడించారు. దీనిపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించింది. ఆ స్కూల్‌ను హమాస్ తన కమాండ్ సెంటర్ గా ఉపయోగిస్తోందని, అందుకే దాడి చేశామని పేర్కొంది.
గాజా స్ట్రిప్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నది. శనివారం తెల్లవారుజామున సెంట్రల్ గాజా సిటీలో పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న తబీన్ స్కూల్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడిలో 80 మంది చనిపోయారు. మరో 47 మంది గాయపడినట్లు పాలస్తీనియన్ హెల్త్ అఫీషియల్స్ వెల్లడించారు. మృతుల్లో చాలా మంది మహిళలు, పిల్లలు ఉన్నారని తెలిపారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి క్రిటికల్ గా ఉందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వివరించారు.
ఈ దాడి గడిచిన పది నెలల్లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన ఘోరమైన దాడులలో ఒకటని పేర్కొన్నారు. దీనిపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించింది. స్కూల్ లో తలదాచుకున్న సాధారణ ప్రజలపై దాడి చేశారంటూ పాలస్తీనియన్లు చేసిన ఆరోపణను ఖండించింది. సదరు స్కూలును హమాస్ తన కమాండ్ సెంటర్ గా ఉపయోగిస్తోందని, అందుకే దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం సమర్థించుకుంది. ఇజ్రాయెల్ సైన్యం వివరణను హమాస్ తీవ్రంగా ఖండించింది.
ఘటనాస్థలానికి సంబంధించిన వీడియోలను స్థానిక మీడియా ప్రసారం చేసింది. అందులో స్కూల్ బిల్డింగ్ గోడలన్ని పూర్తిగా దెబ్బతిన్నట్లు కనిపిస్తున్నది. శిథిలాల కింద డెడ్ బాడీలు చిక్కుకుని ఉన్నాయి. కాగా.. జూలై 4 నుంచి ఇప్పటిదాకా గాజాలోని పాఠశాలలపై 21 దాడులు జరిగాయని యూఎన్ మానవ హక్కుల కార్యాలయం శనివారం వెల్లడించింది.
ఈ దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా వందలాది మంది మరణించారని తన నివేదికలో పేర్కొంది. పాలస్తీన పౌరులు ప్రాణభయంతో అనేక పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్నారని తెలిపింది. కానీ వారిపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు జరపడం బాధాకరమని చెప్పింది. శరణార్థులకు సురక్షితమైన ఆశ్రయం కల్పించడం ఇజ్రాయెల్ బాధ్యత అని నివేదిక పేర్కొంది.