హనియేను మేమే లేపేశాం: ఎట్టకేలకు ఒప్పుకున్న ఇజ్రాయెల్

హనియేను మేమే లేపేశాం: ఎట్టకేలకు ఒప్పుకున్న ఇజ్రాయెల్

టెల్ అవీవ్: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యపై ఎట్టకేలకు ఇజ్రాయెల్ మౌనం వీడింది. ఇస్మాయిల్ హనియేను హత్య చేసింది తామేనని తొలిసారి బహిరంగంగా ఇజ్రాయెల్ ఒప్పుకుంది. 2024 జూలైలో హమాస్ చీఫ్ హనియేను మట్టుబెట్టింది మేమేనని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ఫస్ట్ టైమ్ అధికారికంగా ధృవీకరించారు. ఇటీవల టెల్ అవీవ్‌లో హౌతీ క్షిపణి దాడులు చేయడంపై సోమవారం (డిసెంబర్ 23) రక్షణ మంత్రి కాట్జ్ స్పందించారు. ఓ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ హౌతి రెబల్ గ్రూప్‎కు వార్నింగ్ ఇచ్చారు. 

ఇజ్రాయెల్‎పై కాలు దువ్విన హమాస్, హెజ్బొల్లాలను నాశనం చేశాం. హనియే, సిన్వార్, నస్రల్లా వంటి అగ్ర నేతలను అంతమొందించాం. ఇరాన్ యాంటీ-ఎయిర్‌ క్రాఫ్ట్ సిస్టమ్‌లను ధ్వంసం చేశాం. సిరియాలో బషర్ అస్సాద్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టాం. గాజా, టెహ్రాన్, లెబనాన్‎లో  చేసినట్లే హోడెయిడా, సనాలో చేస్తాం. హౌతీల వ్యూహాత్మక మౌలిక సదుపాయాలపై దాడి చేసి.. హౌతి గ్రూప్‎ను తుదిముట్టిస్తాం’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హమాస్, హెబ్బొల్లాకు పట్టిన గతే హౌతిలకు పడుతోందని హెచ్చరించారు. 

2024 అక్టోబర్‌ 7వ తేదీన హమాస్, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‎పై క్షిపణులతో హమాస్‌ బలగాలు మెరుపు దాడులు చేశాయి. ఆ దాడుల్లో మొత్తం 1,200 మంది ఇజ్రాయెల్ దేశస్తులు మరణించారు. మరో 250 మందిని పౌరులను హమాస్ బందీలుగా తీసుకుంది. ఈ పరిణామాల అనంతరం హమాస్, ఇజ్రాయెల్ ఒకరిపై మరోకరు నిరంతరాయంగా దాడులు చేసుకుంటున్నారు. తమ దేశంపై మెరుపు దాడులు చేసిన హమాస్‎పై ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. 

ALSO READ : బంగ్లాలో హిందువులపై ఆగని దాడులు.. షేక్ హసీనాను అప్పగించాలని భారత్కు లేఖ

ఇందులో భాగంగానే హమాస్ అగ్రనేతలను మట్టు బెట్టింది. ఇరాన్ దేశ నూతన అధ్యక్షుడి ప్రమాణస్వీకారంలో పాల్గొన్న హనియేను.. అదే నగరంలో బాంబు దాడి చేసి ఇజ్రాయెల్ హతం చేసింది. శుత్రదుర్బేధ్యమైన వాయు రక్షణ వ్యవస్థ ఉన్న ఇరాన్ లో హమాస్ అగ్రనేతను ఇజ్రాయెల్ హత్య చేయడం అప్పట్లో ప్రపంచ దేశాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, హనియేను చంపింది మేమేనని ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రకటించలేదు. తాజాగా ఆ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రి ధృవీకరించారు.