గాజాపై... ఇజ్రాయెల్ మరోసారి దాడికి పాల్పడింది. హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులకు తెగపడుతోంది. అంతర్జాతీయ నిబంధనలను అతిక్రమిస్తూ మారణహోమం సృష్టిస్తోంది. తాజాగా... గురువారం ( జూన్ 6) ఉదయం సుమారు 11 గంటల సమయంలో సెంట్రల్ గాజాలోని ఓ పాఠశాల భవనంపై ఇజ్రాయెల్ సైన్యం విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 27 మంది మృతి చెందగా.. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతుల్లో 5మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని రెస్క్యూ బృందాలు ఆస్పత్రులకు తరలించాయి. అయితే హమాస్, ఇస్లామిక్ జిహాద్ వంటి సంస్థలు ఈ పాఠశాలను తమ పనుల కోసం ఉపయోగించుకుంటున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. కానీ, దీనిపై ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య గత కొంతకాలంగా యుద్ధం కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో సెంట్రల్ గాజాలోని 5 ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. ఈ యుద్ధం కారణంగా నిరాశ్రయులైన వారికి ఈ పాఠశాలలు ఆశ్రయం కల్పిస్తున్నాయి. అలాంటి పాఠశాలలపై దాడికి పాల్పడడంతో అంతర్జాతీయ సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ యుద్ధం రోజురోజుకు పెరిగిపోతుండడంతో ఇరాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. గాజాపై ఇజ్రాయెల్ బాంబుల దాడులను ఆపకపోతే యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.
వెనక్కి రావాలని సూచన
గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ మొదలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. దీంతో నార్త్ గాజాలో ఉన్న 11 లక్షలమంది పాలస్తీనా ప్రజలు అక్కడినుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున గాజా బార్డర్ నుంచి బలగాలను వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్‌కు ఇరాన్ ప్రభుత్వం సూచించింది. గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడులు చేస్తే.. పెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. కాగా, గాజాలోని హమాస్, లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థలకు ఇరాన్ ప్రభుత్వం మద్దతు ఇస్తుంది.