రఫాపై ఇజ్రాయెల్ భీకర దాడి .. 16 మంది మృతి

  • తల్​​ ఆల్​ సుల్తాన్​ పక్కనే ఉన్న వాయువ్య రఫాపై వైమానిక దాడి
  • సురక్షిత ప్రాంతంగా ప్రకటించిన చోటే తాజాగా బాంబుల మోత

కైరో: రఫాపై ఇజ్రాయెల్​ మరోసారి విరుచుకుపడింది.  తల్​​ ఆల్​ సుల్తాన్​ పక్కనే ఉన్న వాయువ్య రఫాపై మంగళవారం వైమానిక దాడి చేసింది. ఫ్లైటర్​ జెట్లు, డ్రోన్లతో దాడికి పాల్పడింది. బాంబుల మోతలతో ఈ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఈ ఘటనలో 16 మంది పాలస్తీనియన్లు మృతిచెందినట్టు పాలస్తీనియన్​ సివిల్​ డిఫెన్స్​, పాలస్తీనియన్​ రెడ్​ క్రీసెంట్​ పేర్కొంది.

గాజా-–ఈజిప్ట్ సరిహద్దు వెంబడి రఫాలో పరిమిత కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు ఇజ్రాయెల్ తెలుపగా.. రఫాలోని పశ్చిమ ప్రాంతాల్లో కూడా సోమవారం రాత్రిపూట భారీ బాంబు పేలుళ్లు జరిగినట్లు నివాసితులు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి కూడా రఫాపై ఇజ్రాయెల్​ భీకర వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో ఏకంగా 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మరువకుముందే రఫాపై ఇజ్రాయెల్ ​మళ్లీ విరుచుకుపడింది.

తల్‌‌‌‌ అల్‌‌‌‌ సుల్తాన్‌‌‌‌ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెలే ప్రకటించింది. దీంతో ఉత్తర, మధ్య గాజా నుంచి కట్టుబట్టలతో తరలి వచ్చిన పాలస్తీనియన్లు ఇక్కడ గుడారాలు వేసుకొని తలదాచుకుంటున్నారు. కాగా, ఇది దురదృష్టకర ఘటన అని ఇజ్రాయెల్​ ప్రధాని నెతన్యాహు విచారం వ్యక్తంచేశారు. దీనిపై విచారణ జరుపుతున్నట్టు ఇజ్రాయెల్​ మిలిటరీ తెలిపింది. 

ప్రపంచవ్యాప్తంగా నిరసనలు

రఫాపై దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇజ్రాయెల్​పై అమెరికా, ఫ్రాన్స్‌‌‌‌ సహా స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, నార్వే, ఈజిప్టు, ఖతార్, తుర్కీయేలు మండిపడ్డాయి. ఈ దాడులకు నిరసనగా పారిస్​లోని ఇజ్రాయెల్​ ఎంబసీ ఎదుట 10 వేల మంది ఆందోళనలో పాల్గొన్నారు. మాడ్రిడ్​  బార్సిలోనాలోనూ నిరసనలు తెలిపారు. గాజాలో వెంటనే కాల్పుల విరమణ జరపాలని యునైటెడ్​ నేషన్స్​తోపాటు ఈయూ​, ఈజిప్ట్, ఖతార్​, సౌదీ అరేబియా, ఫ్రాన్స్​ డిమాండ్​ చేశాయి.