- ఆరుగురు హెజ్బొల్లా ఫైటర్లు మృతి.. 11 మందికి గాయాలు
- మూడు నెలల కిందే గాజాఅప్రకటిత ప్రధాని ముష్తాహాను మట్టుబెట్టాం: ఇజ్రాయెల్
- హమాస్ టాప్ కమాండర్లు సిరాజ్, ఒదేహ్‌నూ హతమార్చామని వెల్లడి
- ఇరాన్ హిట్ లిస్ట్‌లో నెతన్యాహు పేరు?
- సోషల్ మీడియాలో పోస్టర్ వైరల్
జెరూసలెం/బీరుట్/టెహ్రాన్: గాజా, లెబనాన్, సిరియాపై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపిస్తున్నది. హమాస్, హెజ్బొల్లా టాప్ లీడర్లు, కమాండర్లే లక్ష్యంగా దాడులు ముమ్మరం చేసింది. ఏ కొద్ది అవకాశం ఇచ్చినా హమాస్, హెజ్బొల్లా ఫైటర్లు కోలుకుంటారనే ఆలోచనతో మిసైళ్లు ప్రయోగిస్తున్నది. గురువారం తెల్లవారుజామున కూడా లెబనాన్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. సెంట్రల్ బీరుట్ బచౌరా జిల్లాలోని ఓ అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో ఏడుగురు హెజ్బొల్లా ఫైటర్లు చనిపోయారు. 11 మంది గాయపడ్డారు. హెజ్బొల్లా సివిల్ డిఫెన్స్ యూనిట్ కూడా తమ సభ్యుల మృతిని ధృవీకరించింది. మరిన్ని దాడులు తప్పవని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది.
ఈ అపార్ట్‌మెంట్ లెబనాన్ పార్లమెంట్ సమీపంలోనే ఉంది. దాడిలో అపార్ట్‌మెంట్ మొత్తం కుప్పకూలిపోయింది. కాగా, గడిచిన 15 రోజుల్లో 1,276 మంది లెబనన్లు చనిపోయారు. లెబనాన్‌లో హెజ్బొల్లాకు చెందిన 200కు పైగా స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. వెపన్స్ స్టోర్ చేసిన క్యాంపులను ధ్వంసం చేసినట్లు తెలిపింది. అలాగే గురువారం సిరియా పశ్చిమతీరంలోని ఆయుధ డిపోపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. హెజ్బొల్లా ఫైటర్స్‌కు ఇక్కడి నుంచి ఆయుధాలు సరఫరా అవుతున్నందుకే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
ఇరాన్ హిట్ లిస్ట్‌లో ఇజ్రాయెల్ కీలక నేతలు
ఇజ్రాయెల్ అగ్రనేతలతో కూడిన ఇరాన్ హిట్ లిస్ట్ జాబితా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ లిస్ట్‌లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సహా రక్షణ మంత్రి యోవ్ గాలంట్, ఇజ్రాయెల్ ఆర్మీ, నేవీ, వైమానిక దళ కమాండర్లు కూడా ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే, వీటిపై అటు ఇజ్రాయెల్ కానీ.. ఇటు ఇరాన్ కానీ.. స్పందించలేదు. ఒకవేళ నెతన్యాహు పేరు ఈ జాబితాలో లేకపోయినా.. సీనియర్ ఇజ్రాయెల్ లీడర్లను లక్ష్యంగా చేసుకొని ఉండొచ్చన్న ప్రచారం సాగుతోంది. ఇరాన్ కీలక నేతలనూ అంతమొందించాలన్న అంశంపై ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్లో భేటీలో చర్చ జరిగిందని, ఆ జాబితాలో సుప్రీం నేత అయతుల్లా ఖమేనీతో పాటు కీలక కమాండర్ల పేర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ హిట్ లిస్ట్ జాబితా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
హసన్ నస్రల్లా అల్లుడు కూడా మృతి
బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా, అతడి కూతురు ఇప్పటికే చనిపోయారు. తాజాగా నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్ ఖాసిర్ కూడా మృతి చెందినట్లు తెలుస్తున్నది. డమాస్కస్‌లోని మజ్జే జిల్లాలో అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇద్దరు మృతి చెందారు. వారితో పాటు నస్రల్లా అల్లుడు కూడా చనిపోయినట్లు సిరియన్ మానవ హక్కుల అబ్జర్వేటరీ తెలిపింది. హసన్ మృతిని హెజ్బొల్లాకు చెందిన ఓ మీడియా సంస్థ కూడా ధృవీకరించింది. అదేవిధంగా, అమెరికా పౌరుడు కూడా చనిపోయినట్లు యూఎస్ పేర్కొన్నది. మిచిగాన్‌లోని డియర్‌బోర్న్‌కు చెందిన కమెల్ అహ్మద్ జావెద్ మృతి చెందినట్లు అమెరికా ప్రకటించింది.
ALSO READ | చైనా, నార్త్ కొరియా, ఇరాన్లో ఇన్ఫార్మర్లు కావలెను .. వీడియో షేర్ చేసిన సీఐఏ
టెల్ అవీవ్ పై హౌతీ రెబల్స్ డ్రోన్ దాడులు
ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ సమీప ప్రాంతంపై గురువారం ఉదయం డ్రోన్ దాడులు చేసినట్లు యెమెన్ హౌతీ రెబల్స్ ప్రకటించారు. కొన్ని కీలక లక్ష్యాలను టార్గెట్‌గా అటాక్ చేసినట్లు తెలిపారు. తాము జరిపిన డ్రోన్ దాడుల ఆపరేషన్ విజయవంతమైనట్లు పేర్కొన్నారు. అయితే, హౌతీ రెబల్స్ డ్రోన్లను అడ్డుకున్నామని ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటించింది. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా కాల్పుల విరమణకు అంగీకరించారని, ఆ తర్వాతే ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో చనిపోయారని లెబనాన్ విదేశాంగ మంత్రి తెలిపారు. కాల్పుల విరమణకు సంబంధించి ఆయన కీలక కామెంట్లు చేశారన్నారు. అమెరికా, ఫ్రాన్స్ ప్రతినిధులతో కూడా మాట్లాడారని వివరించారు. సెప్టెంబర్ 27న బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసినప్పుడు నస్రల్లా దహియే సౌత్ ఏరియాలోని బంకర్లో ఉన్నారని తెలిపారు. గత శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హసన్ (64)తో పాటు టాప్ కమాండర్లు చనిపోయారని హబీబ్ వివరించారు.
ఇరాక్ లో 100 మంది శిశువులకు నస్రల్లా పేరు
ఇజ్రాయెల్ దాడిలో బీరుట్ లో సెప్టెంబర్ 27న చనిపోయిన హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాకు నివాళిగా ఇరాక్‌లో 100 మంది నవజాత శిశివులకు నస్రల్లా అని పేరు పెట్టారు. ఈ వివరాలను ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది.
ఆ మరణాలను హమాస్ దాస్తున్నది..
హమాస్‌కు చెందిన ముగ్గురు టాప్ లీడర్లను మూడు నెలల కిందే గాజాలో హతమార్చామని ఇజ్రాయెల్ మిలటరీ గురువారం ప్రకటించింది. గాజా అప్రకటిత ప్రధానిగా వ్యవహరించిన రావీ ముష్తాహా కూడా చనిపోయినవారిలో ఉన్నాడని తెలిపింది. అతనితో పాటు హమాస్ పొలిటికల్ బ్యూరో సీనియర్ లీడర్ సమీ అల్ సిరాజ్, జనరల్ సెక్యూరిటీ చీఫ్ సమి ఒదేహ్‌ను కూడా మట్టుబెట్టామని చెప్పింది. వీరు తూర్పు గాజాలోని సొరంగాల్లో దాక్కున్నట్లు తమ దళాలకు కచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చిందని, దీంతో ఫైటర్ జెట్ల సాయంతో ఆపరేషన్ చేపట్టామని చెప్పింది. ఈ సొరంగ మార్గం ఒకప్పుడు హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌గా ఉందని, హమాస్ టాప్ లీడర్లంతా ఎక్కువ కాలం ఈ సొరంగ మార్గాల్లోనే తలదాచుకునేవాళ్లని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. కాగా, ఈ ముగ్గురి మృతిపై హమాస్ లీడర్లు ఇప్పటి దాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ముగ్గురు లీడర్లతో పాటు వందలాది మంది మిలిటెంట్ల మరణాలను హమాస్ కావాలనే దాస్తున్నదని ఇజ్రాయెల్ తెలిపింది. మిలిటెంట్ల ఆత్మ స్థైర్యం దెబ్బతింటుందనే హమాస్ ఇలా చేస్తున్నదని చెప్పింది.