గాజా స్ట్రిప్‎పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 20 మంది పాలస్తీనీయుల మృతి

గాజా స్ట్రిప్‎పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 20 మంది పాలస్తీనీయుల మృతి

డెయిర్​అల్​బలాహ్: గాజా స్ట్రిప్‎పై ఇజ్రాయెల్​మరోసారి విరుచుకుపడింది. ఇజ్రాయెల్​డిఫెన్స్​ఫోర్స్​(ఐడీఎఫ్​) శనివారం రోజంతా జరిపిన వైమానిక దాడిలో దాదాపు 20 మంది పాలస్తీనా ప్రజలు మృతిచెందారు. ఈమేరకు పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో ఐదుగురు చిన్నారులు ఉన్నట్టు తెలిపారు. గాజా నగరంలోని శరణార్థి శిబిరంలోని ఓ స్కూల్‎పై జరిపిన దాడిలో ముగ్గురు పిల్లలతో సహా ఎనిమిది మంది మరణించినట్టు వెల్లడించారు. 

అలాగే, సెంట్రల్ సిటీ డెయిర్ అల్-బలాహ్‌‌‌‌లోని ఒక ఇంటిపై శనివారం అర్ధరాత్రి జరిగిన దాడిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలతో సహా కనీసం 8 మంది మృతిచెందినట్టు చెప్పారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దక్షిణ నగరంలో ఖాన్ యూనిస్‌‌‌‌లో జరిగిన దాడిలో ఒక వ్యక్తి, అతని భార్య, గాజా నగరంలో కారుపై జరిగిన దాడిలో ఇద్దరు వ్యక్తులు కన్నుమూసినట్టు వెల్లడించారు.కాగా, ఆ ప్రాంతంలో ఉన్న హమాస్​ మిలిటెంట్లను అంతమొందించేందుకే తాము దాడి చేసినట్టు ఇజ్రాయెల్​ మిలిటరీ తెలిపింది.

గాజాలోకి వాటికన్​రాయబారి ఎంట్రీ 

హోలీ ల్యాండ్‌‌‌‌లోని క్యాథలిక్ చర్చి నాయకుడు కార్డినల్ పియర్‌‌‌‌బాటిస్టా పిజ్జబల్లాను గాజాలోకి ప్రవేశించడానికి, ఆ భూభాగంలోని క్రైస్తవ సంఘం సభ్యులతో ప్రిక్రిస్మస్ సమావేశం జరుపుకోవడానికి ఇజ్రాయెల్​అధికారులు అనుమతించారు. దీంతో గాజా స్ట్రిప్‎లో అడుగుపెట్టిన ఆయన హోలీ ఫ్యామిలీ చర్చిలో డజన్ల కొద్దీ కుటుంబాలతో కలిసి సంబురాలు నిర్వహించారు. ఇదే సమయంలో గాజా అంతటా ఇజ్రాయెల్​ ఎయిర్​స్ట్రైక్స్ చేయడం గమనార్హం.

ఈ నేపథ్యంలో పిజ్జబల్లా మాట్లాడుతూ.. తాము వెలుగులు నింపేందుకు ఈ వేడుకలు నిర్వహిస్తామని, కానీ ఇక్కడ ఆ వెలుగులు ఏవని ప్రశ్నించారు. కాగా, గాజా స్ట్రిప్‎పై ఇజ్రాయెల్​బాంబు దాడులకు దిగుతుండడంతో తమ రాయబారి ఆ గడ్డపై కాలుమోపలేకుపోతున్నారని పోప్ ​ఫ్రాన్సిస్ శనివారం వ్యాఖ్యానించారు. అక్కడ చిన్నారులు చనిపోతున్నారని, యుద్ధం కాదిది క్రూరత్వమని మండిపడ్డారు. ఆ మరుసటిరోజే ఇజ్రాయెల్​అధికారులు వాటికన్​రాయబారి పిజ్జబల్లాను గాజా స్ట్రిప్‎లోకి అనుమతించారు.