గాజా: సెంట్రల్ గాజా స్ట్రిప్లోని ఒక మసీదుపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన బాంబు దాడుల్లో 21 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. డీర్ అల్ -బలాహ్ ప్రాంతంలోని షుహాదా అల్-అక్సా హాస్పిటల్ సమీపంలో ఉన్న మసీదుపై ఇజ్రాయెల్ బాంబు దాడులకు దిగింది. నిరాశ్రయులైన పాలస్తీనియన్లు ఆ మసీదులో తలదాచుకున్నట్లు సమాచారం. హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ కాంప్లెక్స్గా ఆ మసీదును వినియోగిస్తున్నారని పేర్కొన్న ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో విరుచుకుపడింది. అయితే.. ఆ మసీదులో కమాండ్ అండ్ కంట్రోల్ కాంప్లెక్స్గా హమాస్ కార్యకలాపాలు సాగిస్తుందని ఇజ్రాయెల్ చెబుతున్నప్పటికీ ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. హమాస్కు చెందిన ముగ్గురు టాప్ లీడర్లను మూడు నెలల కిందే గాజాలో హతమార్చామని ఇజ్రాయెల్ మిలటరీ ఇప్పటికే ప్రకటించింది.
గాజా అప్రకటిత ప్రధానిగా వ్యవహరించిన రావీ ముష్తాహా కూడా చనిపోయినవారిలో ఉన్నాడని తెలిపింది. అతనితో పాటు హమాస్ పొలిటికల్ బ్యూరో సీనియర్ లీడర్ సమీ అల్ సిరాజ్, జనరల్ సెక్యూరిటీ చీఫ్ సమి ఒదేహ్‌ను కూడా మట్టుబెట్టామని చెప్పింది. వీరు తూర్పు గాజాలోని సొరంగాల్లో దాక్కున్నట్లు తమ దళాలకు కచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చిందని, దీంతో ఫైటర్ జెట్ల సాయంతో ఆపరేషన్ చేపట్టామని చెప్పింది. ఈ సొరంగ మార్గం ఒకప్పుడు హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌గా ఉందని, హమాస్ టాప్ లీడర్లంతా ఎక్కువ కాలం ఈ సొరంగ మార్గాల్లోనే తలదాచుకునేవాళ్లని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. కాగా, ఈ ముగ్గురి మృతిపై హమాస్ లీడర్లు ఇప్పటి దాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ముగ్గురు లీడర్లతో పాటు వందలాది మంది మిలిటెంట్ల మరణాలను హమాస్ కావాలనే దాస్తున్నదని ఇజ్రాయెల్ తెలిపింది. మిలిటెంట్ల ఆత్మ స్థైర్యం దెబ్బతింటుందనే హమాస్ ఇలా చేస్తున్నదని చెప్పింది.