- హమాస్ అకృత్యాలు వెలుగులోకి..
- వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్
జెరూసలెం: హమాస్ అకృత్యాలను ఇజ్రాయెల్ బయటపెట్టింది. తమను ఎదురించిన పాలస్తీనా ప్రజలను హమాస్ మిలిటెంట్లు ఏ విధంగా చిత్రహింసలకు గురిచేశారో తెలియజేసే వీడియోను తాజాగా విడుదల చేసింది. 2018 నుంచి 2020 మధ్య గాజాలోని హమాస్ స్థావరాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఆ వీడియోలో ఉంది. అన్ని సీసీటీవీ ఫుటేజీలను కలిపి మొత్తం 47 నిమిషాల వీడియోను ఇజ్రాయెల్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. హమాస్ కేవలం ఇజ్రాయెల్ శత్రువు కాదని, గాజాకు కూడా శత్రువేనని ఆ పోస్టులో పేర్కొంది.
‘‘జబాలియాలోని హమాస్ బేస్ లో మాకు ఈ ఫుటేజీ దొరికింది. తమను వ్యతిరేకించిన గాజా ప్రజలను హమాస్ ఎంత దారుణంగా చిత్రహింసలకు గురిచేసిందో చెప్పడానికి ఇదే నిదర్శనం” అని తెలిపింది. ఇజ్రాయెల్ విడుదల చేసిన వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నారనే అనుమానంతో చాలామంది అమాయకులను హమాస్ మిలిటెంట్లు చిత్రహింసలకు గురి చేశారు.
చిన్న చీకటి రూముల్లో బాధితులను బంధించారు. చైన్లతో కట్టేసి, ఒంటి కాలిపై నిలబెట్టి, తలకిందులుగా వేలాడదీసి.. దారుణంగా కొడుతూ విచారిస్తున్నట్టుగా వీడియోలో ఉంది. కాగా, తమకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కు సహకారం అందజేస్తున్నారనే అనుమానంతో చాలామంది అమాయకులను హమాస్ చిత్రహింసలకు గురిచేసిందనే ఆరోపణలు ఉన్నాయి. హమాస్ బారి నుంచి బయటపడిన బాధితులు కొందరు.. తమకెదురైన పరిస్థితిని గతంలో మీడియాకు వెల్లడించారు. తమకు నరకం చూపించారని వాపోయారు.