ముగ్గురు బందీలు రిలీజ్ ..మహిళలను విడుదల చేసిన హమాస్

ముగ్గురు బందీలు రిలీజ్ ..మహిళలను విడుదల చేసిన హమాస్

గాజా: పదిహేను నెలల చెర నుంచి ముగ్గురు బందీలకు విముక్తి లభించింది. హమాస్ నిర్భందం నుంచి ఆదివారం సాయంత్రం ముగ్గురు మహిళలు విడుదలయ్యారు. గాజా స్ట్రిప్​లో బంధీలను హమాస్ టెర్రరిస్టులు రెడ్​ క్రాస్ బృందానికి అప్పగించారు. రెడ్ క్రాస్ వాహనాల్లో బంధీలు బార్డర్ దాటి ఇజ్రాయెల్ భూభాగంలోకి అడుగుపెట్టారు. వారికి స్వాగతం చెప్పిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్), ఇజ్రాయెలీ సెక్యూరిటీ ఏజెన్సీ (ఐఎస్ఏ) బలగాలు.. భారీ భద్రత నడుమ వారిని ఆసుపత్రికి తరలిస్తున్నాయి. బంధీలను ఐడీఎఫ్​ బలగాలకు అప్పగించడాన్ని టీవీలలో చూస్తూ వారి కుటుంబ సభ్యులు సంతోషంతో కేరింతలు కొట్టారు. తమ వాళ్లను మళ్లీ ప్రాణాలతో చూస్తామని అనుకోలేదంటూ కన్నీటి పర్యంతమవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతకుముందు ఉదయం 11:15 గంటల (లోకల్ టైమ్) నుంచి ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. 

నిజానికి ఉదయం 8:30 గంటల నుంచే సీజ్ ఫైర్ అమల్లోకి రావాల్సి ఉండగా, విడుదల చేయనున్న బందీల లిస్టును హమాస్ లేటుగా రిలీజ్ చేయడంతో దాదాపు 3 గంటలు ఆలస్యంగా ఒప్పందం అమల్లోకి వచ్చింది. కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో గాజాలో పాలస్తీనియన్లు సంబురాలు చేసుకున్నారు. ఖాన్ యూనిస్ సిటీలో పదుల సంఖ్యలో జనం వీధుల్లోకి వచ్చారు. గాజా సిటీలో హమాస్ ఫైటర్స్ పరేడ్ నిర్వహించారు. వాళ్లకు జనం స్వాగతం పలికారు. మరోవైపు, యుద్ధం కారణంగా గాజాను వదిలి వివిధ ప్రాంతాలకు తరలివెళ్లిన పాలస్తీనియన్లు తిరిగి తమ ఇండ్లకు చేరుకుంటున్నారు.

ఇజ్రాయెల్ దాడుల్లో 11 మంది మృతి.. 

కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చే టైమ్ వరకూ గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. బందీల లిస్టును హమాస్ రిలీజ్ చేసే వరకూ దాడులు కొనసాగుతాయని శనివారం రాత్రి చెప్పిన ఇజ్రాయెల్.. ఆదివారం ఉదయం వరకు ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడుల్లో గాజా స్ట్రిప్ లో కనీసం 8 మంది చనిపోయారని ఖాన్ యూనిస్ సిటీ అధికారులు తెలిపారు. గాజా సిటీలో మరో ముగ్గురు చనిపోయారని హెల్త్ మినిస్ట్రీ తెలిపింది.