ఓవైపు హమాస్ ఉగ్రవాదుల రాకెట్లు....మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో గాజా కకావికలమవుతోంది. ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం కారణంగా గాజా, లెబనాన్, ఇజ్రాయెల్‌లో మరణాల సంఖ్య 4 వేలు దాటింది. అక్టోబర్ 7వ తేదీ నుంచి గాజాపై ఐదు వేలకుపైగా రాకెట్లను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె స్ వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే 2,329 లక్ష్యాలపై దాడి చేసినట్లు తెలిపింది. దక్షిణ గాజాలోని కిజాన్-ఎ-నజార్ గ్రామంలో నివసిస్తున్న హమాస్ చీఫ్ మొహమ్మద్ డెయిఫ్ కుటుంబంపై జరిగిన రాకెట్ దాడి లో.. డెయిఫ్ తండ్రి, సోదరుడు, సోదరుడి కుమారుడు, మనవరాలు మరణించారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటికే హమాస్ సెకండ్-ఇన్-చీ్‌ఫ జకారియా అబూ ముఅమ్మర్, ఆర్థిక మంత్రిగా జువాద్ షమల్లా మరణించారు.
మరోవైపు గాజా అష్టదిగ్బంధనం అయింది. దీంతో అక్కడి ప్రజలు అన్నమో రామచంద్రా అంటూ ఏడుస్తున్నారు. గాజాకు ఇజ్రాయెల్ విద్యుత్తు సరఫరాను నిలిపివేసింది. గాజా నగరంలో ఉన్న ఒకేఒక్క విద్యుదుత్పత్తి కేంద్రంలో చమురు నిల్వలు నిండుకోవడంతో దాన్ని కూడా షట్‌డౌన్ చేసింది. గాజాలో అంధకారమలుముకుంది.
ALSO READ : హమాస్ దాడుల వెనక సూత్రధారి డెయిఫ్
మృతులు, క్షతగాత్రులతో గాజాలోని ఆస్పత్రులు నిండిపోయాయి. ఆసుపత్రుల్లో మందుల కొరత ఏర్పడింది. కరెంట్ సరఫరా లేక, అత్యవసర శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఆక్సిజన్ యంత్రాలు పనిచేయడం లేదు. ఇజ్రాయెల్ వైపు నుంచి వరుస దాడులతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం లేకుండా పోయింది.