- ఇజ్రాయెల్ సర్కారుకు ఆ దేశ యువతి విజ్ఞప్తి
- ఆమెతో మాట్లాడించి వీడియోను రిలీజ్ చేసిన హమాస్
గాజా/జెరూసలెం: హమాస్ మిలిటెంట్లు తమ చెరలో ఉన్న మరో బందీ వీడియోను రిలీజ్ చేశారు. తాజా వీడియోలో ఇజ్రాయెల్ కు చెందిన మహిళా జవాన్ లిరి అల్బాగ్ (19) తమను విడిపించాలంటూ సొంత దేశానికి విజ్ఞప్తి చేసింది. లిరి అల్బాగ్ హిబ్రూ భాషలో మాట్లాడిన వీడియోను ఈ మేరకు హమాస్‌కు చెందిన సాయుధ విభాగం ఎజ్దీన్ అల్ ఖాసమ్ బ్రిగేడ్స్ శనివారం విడుదల చేసింది.
వీడియోలో లిరి అల్బాగ్ మాట్లాడుతూ.. ‘‘తాము 450 రోజులుగా మిలిటెంట్ల చెరలో నరకం అనుభవిస్తున్నామని, తమను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని కోరారు. ‘‘నేడు న్యూఇయర్ రోజు. ప్రపంచమంతా సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. మేం మాత్రం మరో చీకటి ఏడాదిలోకి ఎంటరవుతున్నాం. మాతో ఉన్న బందీల్లో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మేం చాలా భయంకరమైన పరిస్థితుల్లో నరకం అనుభవిస్తున్నాం” అని ఆమె గోడు వెళ్లబోసుకున్నది.
కాగా, మిలిటెంట్ల చెరలోని తమ వారిని విడిపించాలంటూ ఇజ్రాయెల్ బందీల కుటుంబసభ్యులు, బంధువులు ‘హోస్టేజెస్ అండ్ మిస్సింగ్ ఫ్యామిలీస్ ఫోరం’ ద్వారా ఉద్యమిస్తున్నారు. ఇప్పటికైనా తమ ఆప్తులను విడిపించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే, బందీలను విడిపించేందుకు ఖతార్, ఈజిప్ట్, అమెరికా వంటి దేశాల మధ్యవర్తిత్వంతో చర్చలు జరుపుతున్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నా.. గాజాపై దాడులు మాత్రం ఆగడంలేదు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకే హమాస్ మిలిటెంట్లు బందీల వీడియోలను రిలీజ్ చేస్తున్నట్టు భావిస్తున్నారు.
గాజాలో 45 వేలు దాటిన మృతులు..
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గత రెండురోజుల్లోనే గాజాపై ఇజ్రాయెల్ వంద దాడులు చేసినట్టు మీడియా వెల్లడించింది. శనివారం నాటి దాడుల్లోనే 30 మంది చనిపోయినట్టు పేర్కొన్నాయి. హమాస్ మిలిటెంట్లు 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1200 మందిని చంపేసి, 250 మందిని పట్టుకెళ్లారు. హమాస్‌పై ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్ ఇప్పటికీ గాజాపై భీకర దాడులు చేస్తోంది. ఇప్పటివరకూ మిలిటెంట్లు, పౌరులు కలిపి దాదాపు 45 వేల మంది కి పైగాచనిపోయారు.