- గాజాలో అతిపెద్ద ఆస్పత్రి క్లోజ్
- గాజాలో ఇదే అతిపెద్ద హాస్పిటల్
- కరెంట్, ఇంధనం లేక పనిచేయని పరికరాలు
- ఆందోళనలో పేషెంట్లు
- ఆస్పత్రికి ఇంధనం ఆఫర్ చేశామన్న నెతన్యాహు
గాజా/ జెరూసలెం: హమాస్ మిలిటెంట్లను సమూలంగా నాశనం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో గాజాలో దారుణ పరిస్థితి నెలకొంది. గాజా మొత్తానికీ అతిపెద్ద, కీలకమైన ఆసుపత్రి ఆల్షిఫా దాదాపుగా మూతపడింది. కరెంట్ లేక, ఇంధన కొరతతో జనరేటర్లు పనిచేయక ఆసుపత్రిలోని కీలక వ్యవస్థలన్నీ పనిచేయకుండా పోయాయి. నిన్నమొన్నటి వరకు డాక్టర్లు కాస్తోకూస్తో సేవలందించారు. మందుల కొరత వల్ల రోగులకు మత్తుమందు ఇవ్వకుండానే ఆపరేషన్లు చేశారు. ప్రస్తుతం అదికూడా సాధ్యం కావడంలేదని ఆల్షిఫా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ అబూ సాల్మియా వాపోయారు.
కనీసం తాగునీరు కూడా సరిగా దొరకడంలేదని, పిల్లలకు పాలు, బ్రెడ్డు వంటి కనీస అవసరాలకు తీవ్ర కొరత ఏర్పడిందని చెప్పారు. దీంతో ఆస్పత్రిలోని పదిహేను వందలకు పైగా రోగులు, ఆస్పత్రి సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రిలో షెల్టర్ పొందుతున్న సుమారు 7 వేలకు పైగా జనం ప్రాణభయంతో వణికిపోతున్నారు. జనరేటర్లను నడిపేందుకు 600 లీటర్ల ఇంధనం కావాలని ఇజ్రాయెల్ ఆర్మీకి విజ్ఞప్తి చేసినట్లు ఆల్షిఫా డైరెక్టర్ చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సానుకూలంగా స్పందించి ఇంధనం పంపించారని, అయితే దానిని అంగీకరించొద్దంటూ హమాస్ ఆరోగ్య శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయని వివరించారు. దీంతో ఆసుపత్రి ముందు పెట్టిన ఇంధనాన్ని తీసుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు.
ఇంధనం తీసుకోనివ్వట్లే.. నెతన్యాహు
గాజా ఆసుపత్రిలోని బాధితులకు సాయం చేయడానికి ప్రయత్నించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. ఇంధనం అందించేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ప్రయత్నించినా హమాస్ మిలిటెంట్లు అడ్డుకున్నారని విమర్శించారు. దీంతో ఆల్షిఫా ఆసుపత్రిలో తలదాచుకున్న పాలస్తీనియన్లు సేఫ్‌గా సౌత్ గాజా వేళ్లేందుకు రూట్ క్లియర్ చేసినట్లు నెతన్యాహు ప్రకటించారు.
హమాస్ కమాండర్‌ను చంపేశాం: ఐడీఎఫ్
మిలిటెంట్ల సీనియర్ కమాండర్ అహ్మద్ సియామ్ ను తుదముట్టించినట్లు ఐడీఎఫ్ట్వీట్ చేసింది. నార్త్ గాజాలోని సాధారణ పౌరులను సియామ్ సౌత్ గాజా వెళ్లకుండా అడ్డుకున్నాడని ఆరోపించింది. దాదాపు వెయ్యి మంది పౌరులను ఇలా బలవంతంగా ఆపేశాడని పేర్కొంది. ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో రంతిసి హాస్పిటల్లో తలదాచుకున్న అహ్మద్ సియామ్చనిపోయినట్లు ప్రకటించింది.
ఫాయిల్ చుట్టి వేడి నీళ్ల పక్కన..
నెలలు నిండకముందే పుట్టిన పసికందులను సాధారణంగా ఇన్ క్యూబేటర్ లో ఉంచుతామని డాక్టర్ సాల్మియా తెలిపారు. ప్రస్తుతం కరెంట్ లేక ఇన్ క్యూబేటర్లు పనిచేయడంలేదన్నారు. దీంతో పసికందులను ఫాయిల్‌లో చుట్టి వేడి నీళ్ల పక్కన ఉంచామని వివరించారు. రోజుల పసిగుడ్డులను కాపాడుకోవడానికి ఇంతకంటే మరోమార్గం లేకపోయిందని చెప్పారు.
ALSO READ : ఇయ్యాల హైదరాబాద్‌లో సదర్ ట్రాఫిక్ ఆంక్షలు