
ఇజ్రాయెల్– హమాస్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నది. గాజా స్ట్రిప్నుంచి మిలిటెంట్ సంస్థను తుడిచిపెట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్విరుచుకుపడుతున్నది. ఇజ్రాయెల్ తాజాగా జరిపిన ఎయిర్ స్రైక్లో గాజా స్ట్రిప్లో దాదాపు 200 మందికి పైగా చనిపోయారు. చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని గాజా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. ఎలాంటి హెచ్చరిక చేయకుండానే ఇజ్రాయెల్ ఈ వైమానిక దాడులకు పాల్పడింది.
ఇజ్రాయెల్ డ్రోన్స్, ఫైటర్ జెట్స్ గాజా స్ట్రిప్ లక్ష్యంగా దూసుకువెళ్లాయి. ఈ దాడులను హమాస్ తీవ్రంగా ఖండించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి తమ చేతుల్లో ఉన్న బందీల ప్రాణాలను ఇజ్రాయెల్ ప్రమాదంలోకి నెట్టేసిందని హమాస్ చెప్పింది. ఇజ్రాయెల్ చేసిన ఈ దాడులకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హమాస్ హెచ్చరించింది.
శిథిలాల దిబ్బగా మారిన గాజాలో ప్రాణనష్టం, ఆస్తినష్టం తగ్గించడం, లక్షల మంది జీవితాలను సాధారణ స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జనవరి 19 నుంచి అమలులోకి వచ్చింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వం వహించాయి. కానీ.. ఇజ్రాయెల్ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని లైట్ తీస్కుని గాజాపై ఎయిర్ స్రైక్ చేయడం గమనార్హం.
2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన మెరుపుదాడిలో 1200 మందికిపైగా ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందగా, 250 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారు. దీంతో హమాస్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. గాజా శిథిలాల దిబ్బగా మారింది. ఇప్పటి వరకూ ఇజ్రాయెల్జరిపిన దాడిలో దాదాపు లక్ష మంది వరకు చనిపోయినట్టు పాలస్తీనా సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది. గాజాలోని దవాఖానల్లో మెడికల్ ఎక్విప్మెంట్, డాక్టర్లు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నదని పేర్కొన్నది.