మూసీ ప్రక్షాళనకు ఇజ్రాయెల్​ టెక్నాలజీ : మంత్రి శ్రీధర్​ బాబు వెల్లడి

  • ఆ దేశ రాయబారిరువెన్ ​అజర్​తో భేటీ
  • ఏఐ, సైబర్​సెక్యూరిటీలో తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి
  • స్కిల్​ వర్సిటీలో యువతకు శిక్షణ ఇవ్వాలని విప్రోను కోరిన మంత్రి

హైదరాబాద్, వెలుగు: మూసీ ప్రక్షాళనకు ఇజ్రాయెల్​ టెక్నాలజీ వాడుతామని, ఇందుకోసం ఆ దేశం ముందుకు వచ్చిందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మురికినీటిని శుద్ధిచేసి తిరిగి వాడుకునేందుకు మూసీశుద్ధి ప్రాజెక్టు చేపట్టామని, అందుకు సహకరించాల్సిందిగా ఇజ్రాయెల్​ రాయబారి రువెన్​ అజర్​ను కోరగా.. ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారని మంత్రి వెల్లడించారు. శుక్రవారం సెక్రటేరియెట్​+లో మంత్రితో రువెన్​ అజర్​ సమావేశమయ్యారు.

ఏఐ, సైబర్​ సెక్యూరిటీలో రాష్ట్రానికి సహకరించాలని మంత్రి శ్రీధర్​బాబు కోరారు. రక్షణ రంగం, వ్యవసాయం, నీటి వినియోగంలో ఆధునిక పద్ధతులపైనా తోడ్పాటు అందించడంపై చర్చించారు. 200 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఏఐ సిటీ గురించి వివరించారు. రాష్ట్రంలో యంగ్​ ఇండియా స్కిల్​ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, ఇజ్రాయెల్​ ఎలాంటి ఇండస్ట్రీని పెట్టాలన్నా ప్రతిభ కలిగిన యువత సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాగా, మౌలిక వసతుల కల్పనలో రెండు దేశాల పరస్పర సహకారం అవసరమని ఇజ్రాయెల్​ రాయబారి రువెన్​ ప్రతిపాదనలకు మంత్రి ఓకే చెప్పారు.

సీఎం రేవంత్​ రెడ్డితో కలిసి ఇజ్రాయెల్​లో పర్యటించాల్సిందిగా శ్రీధర్​బాబుకు రువెన్​ ఆహ్వానించారు. ఇటు టర్కీ రాయబారి ఫిరట్​ సునెల్​తోనూ మంత్రి సమావేశమయ్యారు. అరగంట సేపు పరస్పర సహకారంపై చర్చించారు. తెలంగాణ, టర్కీ మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఎంతో కాలంగా కొనసాగుతున్నాయని శ్రీధర్​ బాబు అన్నారు. వ్యవసాయం, ఫార్మా లైఫ్​సైన్సె స్, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందన్నారు. 

స్కిల్​ యూనివర్సిటీలో భాగం కండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్కిల్​ యూనివర్సిటీలో భాగం కావాలని విప్రో చీఫ్​ ఫైనాన్షియల్​ ఆఫీసర్ రాఘవ్ స్వామినాథన్​ను  శ్రీధర్​ బాబు కోరారు. సంస్థ కార్యకలాపాల పురోగతిపై సెక్రటేరియెట్​లో మంత్రితో రాఘవ్​ స్వామినాథన్​ భేటీ అయ్యారు. స్కిల్​ యూనివర్సిటీలో భాగమై యువతకు శిక్షణ ఇచ్చేందుకు తోడ్పడాలని, తద్వారా ప్రతిభ కలిగిన మానవ వనరులను వినియోగించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని మంత్రి వివరించారు. డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​ ఇదే తరహాలో 80 మంది యువతకు తమ అవసరాలకు తగినట్టు శిక్షణ ఇస్తున్నదని తెలిపారు.

4న పెద్దపల్లిలో 9వేల మందికి నియామక పత్రాలు 

డిసెంబర్ 4న పెద్దపల్లిలో నిర్వహించే యువశక్తి సభకు సీఎం రేవంత్​ రెడ్డి వస్తారని,  దాదాపు 9000 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తారని మంత్రి  శ్రీధర్ బాబు తెలిపారు. సభ ఏర్పాట్లపై శుక్రవారం  సచివాలయంలో మంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. స్కిల్  యూనివర్సిటీలో భాగస్వామ్యమయ్యే 7 ఏజెన్సీలతో ఒప్పంద పత్రాలపై సంతకం చేస్తారని, సీఎం కప్ తో పాటు వందలాది కోట్ల రూపాయల విలువైన అనేక కార్యక్రమాలను సీఎం ప్రారంభిస్తారని మంత్రి వివరించారు.