సుప్రీం అధికారాలకు కత్తెర!.. ఇజ్రాయెల్​లో ఆందోళన

ఇజ్రాయెల్​లో న్యాయ వ్యవస్థ సంస్కరణల ప్రక్రియకు తాత్కాలిక విరామం ప్రకటించడం ద్వారా ఆ దేశ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు దేశంలో అంతర్యుద్ధం తలెత్తకుండా చేశారని చెప్పాలి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న కల్లోల పరిస్థితులను కుదుటపరచేందుకు, సంస్కరణలపై స్థూలంగా ఒక ఏకాభిప్రాయానికి వచ్చేందుకు ఆ రకమైన నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా నెతన్యాహుయే ప్రకటించారు. ఫలితంగా నేషనల్ యూనియన్ సమ్మె విరమించుకుంది. కొన్నాళ్లుగా నిరసన ప్రదర్శనలతో హోరెత్తుతున్న అక్కడి పరిస్థితులను ఎంతవరకు కుదుటపరుస్తుందో చూడాలి.  

న్యాయవ్యవస్థ ప్రక్షాళనపై సంక్షోభం

ఒక లిఖిత రాజ్యాంగం లేకుండా నెట్టుకొస్తున్న ఇజ్రాయెల్ లో ఇటువంటి పరిస్థితులు తలెత్తడంలో ఆశ్చర్యం లేదు. రాజ్యాంగం ఉన్న దేశాలలోనే  వివిధ వ్యవస్థల అధికార పరిధుల మధ్య వివాదాలను  చూస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు  ప్రాథమిక చట్టాలు, హక్కులతో కాలం వెళ్ళదీస్తున్న ఇజ్రాయెల్​లో న్యాయ వ్యవస్థ ప్రక్షాళన, సంస్కరణల పేరుతో తెచ్చిన ప్రతిపాదనలు తాజా సంక్షోభానికి కేంద్ర బిందువుగా మారాయి. న్యాయ వ్యవస్థ కొన్నేళ్ళుగా తన అధికార పరిమితులను పెంచుకుంటూ వస్తోందని పాలక సంకీర్ణం ఆరోపిస్తోంది. న్యాయమూర్తులను ఎంపిక చేసే తొమ్మండుగురు సభ్యుల కమిటీని రూపొందించడంలో తేదలచిన మార్పులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని విమర్శలొచ్చాయి. నూతన ప్రతిపాదన కింద కమిటీలో ప్రభుత్వం తరఫున ఏడుగురు ఉండి మిగిలినవారి సంఖ్య నాలుగుకు తగ్గిపోతుందని, న్యాయమూర్తుల ఎంపికలో ప్రభుత్వానిదే పైచేయి అవుతుందని నిరసనకారుల వాదన. ప్రభుత్వం చేసే చట్టాలను కొట్టివేయడంలో న్యాయ వ్యవస్థకున్న అపరిమిత అధికారాలకు కళ్ళెం వేయాలని ప్రభుత్వ అభిలాష. నెసెట్ చేసిన చట్టాలను సుప్రీం కోర్టు కొట్టి వేసినా, పార్లమెంట్  సాధారణ మెజారిటీతో కోర్టు తీర్పులు చెల్లుబాటు కాకుండా చేయవచ్చని  మరో బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనలపై వివిధ దశల్లో  చర్చలు జరుగుతాయి.   నాలుగు విడతల ఓటింగ్ ఉంటుంది.  మెజారిటీ ఉండడం వల్ల ప్రభుత్వానికి అది పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు. ప్రతిపాదిత ప్రక్షాళన వల్ల ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ అధికారాలకు అంతు లేకుండా పోతుందని విమర్శకుల మాట. ముఖ్యంగా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న నెతన్యాహు ఆ చిక్కుల నుంచి బయటపడేందుకు ఈ అధికారాలను ఉపయోగించుకుంటారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. 

సెటిలర్ల సమస్య

వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంలలో  ప్రస్తుతం సుమారుగా  ఏడు లక్షల మంది సెటిలర్లు ఉన్నారు. వారి ఉనికి రోజూ సామాజిక, రాజకీయ, భద్రతా ఆందోళనలకు కారణమవుతోంది. వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయెలీ సెటిలర్లకు చట్ట బద్ధత లేదని  పేర్కొంటున్న తీర్మానం ఐక్యరాజ్య సమితిలో 2016లో ఓటింగ్ కు వచ్చినపుడు బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనాలు దానికి అనుకూలంగా ఓటు వేశాయి. అమెరికా గైర్హాజరైంది. వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న గృహాలకు అధికారిక అనుమతి మంజూరు చేయాలని, మరో  18 వేల గృహాలు నిర్మించాలని నెతన్యాహు ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 13న తొమ్మిది అనధికారిక ఆవాస ప్రాంతాలకు ఆమోద ముద్ర వేసింది. మరో పది వేల నూతన గృహాల నిర్మాణానికి పచ్చ జెండా ఊపింది. కానీ, ఈ విస్తరణ పథకాలను  జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, అమెరికాలు వ్యతిరేకించడంతో వాటిని కూడా నిలిపివేయవలసి వచ్చింది. ఇజ్రాయెల్ కు, పాలస్తీనా అధికారులకు మధ్య తెరవెనుక చర్చలు జరిగేటట్లు అమెరికా చూసింది. ఇజ్రాయెల్-–పాలస్తీనా సమస్యపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రూపొందించిన తీర్మానం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఓటింగ్ కు వస్తే  అమెరికా వీటో చేయాల్సి వచ్చేది. దాని మిత్ర దేశాలు అనుకూలంగా ఓటు వేస్తే తనకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందని అమెరికా భావించింది. రష్యా- ఉక్రెయిన్ యుద్దం మొదలై ఏడాది పూర్తయిన సందర్భంలో యూరప్ దేశాలతో తాను కలసిగట్టుగా ఉన్నానని చాటుకోవాలని అమెరికా ఉద్దేశం. చివరకు భద్రతా మండలి 1967 నాటి హద్దులను ఆధారం చేసుకుని ఇజ్రాయెల్-–పాలస్తీనా రెండు దేశాలుగా ఉండడమే ఇప్పటికీ ఆచరణయోగ్యమైన పరిష్కారమని పునరుద్ఘాటించింది. నెతన్యాహుకు మళ్ళీ మితవాద మిత్రపక్షాల సెగ తగలడంతో నూతన ఆవాసాల నిర్మాణాన్ని స్తంభింపజేసేది లేదని ప్రభుత్వం ప్రకటించవలసి వచ్చింది. ఇజ్రాయెల్, పాలస్తీనా పరస్పర దాడుల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఇంతవరకు 70 మంది పాలస్తీనియన్లు, 13 మంది ఇజ్రాయెలీలు చనిపోయి ఉంటారని అంచనా. యూదులు, క్రైస్తవులు, ముస్లింలు పవిత్రమైనదిగా భావించే ఇజ్రాయెల్ మొత్తానికి, మునుపెన్నడూ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చక్కని భద్రతా పరిస్థితి, ఆరోగ్యదాయకమైన ఆర్థిక వ్యవస్థ నెతన్యాహుకు చాలా ఏళ్ళుగా అనుకూలాంశాలుగా ఉంటూ వచ్చాయి. ఇప్పుడవి చెదిరిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

నెతన్యాహుకు మిత్రపక్షాల నస

బెంజమిన్ నెతన్యాహు మూడవసారి ప్రధాని అయి మూడు నెలలు గడిచాయో లేదో అప్పుడే ఆయనను సమస్యలు చుట్టుముడుతున్నాయి. జడ్జీల రెక్కలను కత్తిరించే ముసాయిదా ప్రతిపాదనలపై ఓటింగ్ ను ఇజ్రాయెల్ పార్లమెంట్ నెసెట్​లో ఏప్రిల్ నెలాఖరు వరకు వాయిదా వేయడం ద్వారా ఆయన ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం 120 మంది సభ్యులు గల నెసెట్ లో నెతన్యాహు నేతృత్వంలోని లిఖూద్ పార్టీకి 32 సీట్లు లభించాయి. అతి రూఢివాద యూదు పార్టీలకు 18 సీట్లు లభించాయి. మరో తీవ్ర మితవాద కూటమికి 14 సీట్లు లభించాయి. అలా సంకీర్ణ ప్రభుత్వానికి 2022 డిసెంబర్ 29న నెతన్యాహు నాయకుడు అయ్యారు. ఫలితంగా, మిత్రపక్షాలను మెప్పించే పనికి ఆయన మొదట్లోనే శ్రీకారం చుట్టాల్సి వచ్చింది. ఏదైనా ఒక కేసులో దోషిగా తేలినా, జైలు శిక్ష పడకపోతే ఆ వ్యక్తి మంత్రిగా కొనసాగవచ్చంటూ నెసెట్ ఒక చట్టం చేసింది. షొమె హ తొరా హ (షాస్) పార్టీ సభ్యుడు ఒకరు పన్నుల చెల్లింపులకు సంబంధించిన నేరాలలో దోషిగా తేలారు. కానీ, ఆయనకు పడిన శిక్ష సస్పెన్షన్ లో ఉంది. ఆయన మూడు మంత్రిత్వ శాఖలను చేపట్టారు. ఆయనకు సాయపడడానికే కొత్త చట్టం తెచ్చారని జనాభిప్రాయం. 

సుప్రీంకోర్టు బలహీనపడితే..

సెక్యులర్, మధ్యేవాద ఎలీట్ కున్న చివరి కోట సుప్రీం కోర్టేనని, అది కూడా బలహీనపడితే ప్రజా ప్రయోజనాలను కాపాడేవారెవరని విమర్శకులు మొత్తుకుంటున్నారు. మతపరమైన యూదులు ముఖ్యంగా అతి రూఢివాదులు తమ జీవన విధానానికి కోర్టును ఒక ప్రతిబంధకంగా చూస్తున్నారు. మతాచారాలను తు.చ తప్పకుండా పాటించే వర్గానికిచ్చే కొన్ని ప్రత్యేక సదుపాయాలను, ఫైనాన్షియల్ సబ్సిడీలను కోర్టు తరచు వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇజ్రాయెల్  సైన్యంలో కొన్నాళ్ళపాటు అందరూ విధిగా పనిచేసి తీరాలి. యూదులు మత అధ్యయనాల కోసం ఈ సైనిక సేవను వాయిదా వేయడానికి వీలు కల్పిస్తున్న ప్రత్యేక వ్యవస్థను కోర్టు తిరస్కరించింది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో వేళ్లూనుకోవాలని చూస్తున్న మితవాద ఇజ్రాయెలీయులకు కూడా కోర్టు విలన్ లా కనిపిస్తోంది. స్త్రీ, పురుషులిద్దరూ సైన్యంలో కొంతకాలం విధిగా పనిచేయడం ఇజ్రాయెల్​లో ఒక నియమం. అలా, సైన్యంలో సేవ, తర్ఫీదు పూర్తయిన తర్వాత  పౌరులను రిజర్వు దళాలకు కేటాయిస్తారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినపుడు రెగ్యులర్ దళాలు వీరి సేవలను వినియోగించుకుంటాయి. ప్రభుత్వ కార్యకలాపాలను తగినంతగా పరిశీలించే అధికారం కోర్టుకు లేకపోతే తాము సైన్యం అరాచక ఆదేశాలకు బలికావాల్సి ఉంటుందేమోనని ఈ రిజర్విస్టులు ఆందోళన చెందుతున్నారు. వైమానిక దళ పైలట్ల బృందానికి ఈ రిజర్విస్టుల అవసరం చాలా ఉంది. 
- మల్లంపల్లి ధూర్జటి,
సీనియర్ ​జర్నలిస్ట్