ఇరాన్​పై ఇజ్రాయెల్ అటాక్.. సైనిక స్థావరాలు లక్ష్యంగా వైమానిక దాడులు

 ఇరాన్​పై ఇజ్రాయెల్ అటాక్.. సైనిక స్థావరాలు లక్ష్యంగా వైమానిక దాడులు

టెల్ అవీవ్/టెహ్రాన్:  పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది. శనివారం తెల్లవారుజాము నుంచి దాదాపు నాలుగు గంటల పాటు ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులకు పాల్పడింది. మొత్తం 100 ఫైటర్ జెట్స్ తో ఇరాన్ లోని 20 మిసైల్, డ్రోన్ ఫెసిలిటీ సెంటర్లపై మూడు రౌండ్ల ఎయిర్ స్ట్రైక్స్ జరిపింది. మొదటి రౌండ్ లో ఇరాన్ రాడార్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పై దాడులు చేసి.. ఆ తర్వాత రెండు, మూడో రౌండ్ లో మిసైల్, డ్రోన్ ఫెసిలిటీ సెంటర్లపై దాడులు చేసింది. ఎయిర్ స్ట్రైక్స్ ను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, డిఫెన్స్ మినిస్టర్ యోవ్ గాలెంట్ దగ్గరుండి పర్యవేక్షించారు. దేశ రాజధాని టెల్ అవీవ్ లోని కిర్యా మిలటరీ బేస్ లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ ఫొటోలు, వీడియోలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. 

ఇరాన్ దాడి చేస్తే.. బుద్ధి చెప్తాం.. 

ఇరాన్ పై వైమానిక దాడులు ప్రారంభించినట్టు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగేరీ ప్రకటించారు. ఇరాన్ లోని మిలిటరీ స్థావరాలు లక్ష్యంగా దాడులు చేపట్టినట్టు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఇరాన్ తమపై దాడులు చేస్తున్నదని, దానికి ప్రతీకారంగానే ఆ దేశ సైనిక స్థావరాలపై అటాక్స్ చేశామన్నారు. ‘‘ఇరాన్ మాపై మిసైల్ దాడులు చేస్తున్నది. అందుకే ఆ దేశ మిసైల్ ఫెసిలిటీ సెంటర్లపై మేం ఎయిర్ స్ట్రైక్స్ చేశాం. మా లక్ష్యం నెరవేరింది. 

ఇరాన్ గనక మళ్లీ దాడులకు పాల్పడితే, మేం కచ్చితంగా తగిన బుద్ధి చెప్తాం” అని ఆయన హెచ్చరించారు. కాగా, ఈ నెల 1న ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ పై ఇరాన్ దాడులకు పాల్పడింది. దాదాపు 200 మిసైల్స్ తో అటాక్ చేసింది. దీనికి ప్రతీకారంగానే ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ కు దిగింది. ఆయిల్, న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై దాడులు చేస్తుందన్న ఆందోళనలు నెలకొన్నప్పటికీ.. మిసైల్ ఫెసిలిటీస్ లక్ష్యంగానే ఇజ్రాయెల్ దాడులు చేసింది.  

విమానాలకు అంతరాయం.. 

ఇజ్రాయెల్ దాడులతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాడులు జరుగుతున్న టైమ్ లో అన్ని ఫ్లైట్లను ఇరాన్ రద్దు చేసింది. ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ ముగిసిన తర్వాత ఉదయం 9 గంటలకు విమాన రాకపోకలను తిరిగి పునరుద్ధరించింది. ఇక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్ అన్ని విమానాలను రద్దు చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా తమ ఎయిర్ స్పేస్ ను బంద్ చేసింది. 

మాకు జరిగిన నష్టం కొంచెమే: ఇరాన్ 

ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది నిజమేనని ఇరాన్ తెలిపింది. ఆ దాడుల్లో తమ సైనికులు ఇద్దరు చనిపోయారని చెప్పింది. అయితే ఎంతమేర నష్టం జరిగిందనేది మాత్రం వెల్లడించలేదు. భారీగానే నష్టం జరిగినప్పటికీ, తక్కువగానే జరిగినట్టు చెబుతున్నదని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. ‘‘ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ ను మా డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకుంది. కొన్నిచోట్ల మాత్రం కొంతమేర డ్యామేజీ జరిగింది. ఇజ్రాయెల్ యాక్షన్ కు తప్పకుండా రియాక్షన్ ఉంటుంది” అని ఇరాన్ ఆర్మీ తెలిపింది. తమకు ఆత్మరక్షణ హక్కు ఉందని, విదేశీ దురాక్రమణ చర్యలను అడ్డుకుంటామని ఇరాన్ ఫారిన్ మినిస్ట్రీ చెప్పింది. 

ఇందులో మా ప్రమేయం  లేదు: అమెరికా

ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్​లో తమ ప్రమేయం లేదని అమెరికా స్పష్టం చేసింది. దీనిపై తమకు ముందే తెలుసని, కానీ తాము పాల్గొనలేదని చెప్పింది. ఆత్మరక్షణలో భాగంగానే ఇజ్రాయెల్ దాడులు చేసిందని తెలిపింది. దీనికి ఇరాన్ స్పందిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఇక దాడులకు ముగింపు పలకాలని సూచించింది. కాగా, ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులను సౌదీ అరేబియా ఖండించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై ఆందోళన వ్యక్తం చేసింది.