జెరూసలెం: ఇరాన్ జరిపిన డ్రోన్, మిసైళ్ల దాడికి ప్రతిగా టైమ్ చూసి దెబ్బ కొడ్తామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేసిందని, ఈ దాడిలో ఒక చిన్నారి గాయపడిందని తెలిపింది. తలకు బలమైన గాయం కావడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నదని తెలిపింది. ఇరాన్ తమ దేశానికి పాత శత్రువు అని, ఈ ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు తాము ఎప్పుడూ సిద్ధమే అని చెప్పింది. ఇరాన్‌పై దాడికి సరైన సమయం అవసరమని అభిప్రాయపడింది. ఇరాన్ దాడులను కలిసికట్టుగా తిప్పి కొడ్తామని తెలిపింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా కలిసికట్టుగా ముందుకెళ్లడం ఫస్ట్ టైమ్ అని ఐడీఎఫ్ ప్రతినిధి తెలిపారు.
యూఎన్‌లో ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్
ఇజ్రాయెల్‌పై దాడులను యూనైటెడ్ నేషన్స్ భేటీలో ఇరాన్ సమర్థించుకుంది. ఇజ్రాయెల్ తమ ఎంబసీపై దాడి చేసిందని, ఫలితంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని ఇరాన్ రాయబారి తెలిపారు. ఆత్మరక్షణలో భాగంగానే దాడులు చేశామని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడితే.. మరిన్ని డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడ్తామని ఇప్పటికే హెచ్చరించామని గుర్తుచేశారు.
అంతర్జాతీయంగా శాంతిని నెలకొల్పే విషయంలో భద్రతామండలి ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. తమ దేశం యుద్ధాన్ని, అలాంటి వాతావరణాన్ని కోరుకోదని స్పష్టం చేశారు. బెదిరింపులకు, ఆక్రమణలకు, దాడులకు తెగబడితే మాత్రం గట్టిగానే స్పందిస్తుందని ఇరాన్ రాయబారి స్పష్టంచేశారు. ఇరాన్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ రాయబారి స్పందిస్తూ.. ఇరాన్‌పై తగిన చర్యలు తీసుకోవాలని యూనైటెడ్ నేషన్స్‌ను కోరారు. సెక్యూరిటీపరమైన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. తమ దేశాన్ని అస్థిరపర్చేందుకు చూస్తే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని జీ7 దేశాల భేటీలో ఇజ్రాయెల్ రాయబారి స్పష్టంచేశారు. కాగా, ఇజ్రాయెల్‌పై దాడిని యూనైటెడ్ నేషన్స్ తీవ్రంగా ఖండించింది.
ప్రతీకార దాడులకు మేం సాయం చేయం: బైడెన్
ఇరాన్‌పై ప్రతీకార దాడులకు పాల్పడితే ఇజ్రాయెల్ కు అమెరికా నుంచి ఎలాంటి సాయం అందదని బైడెన్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌కు ఇనుప కవచంలా ఉంటామన్న బైడెన్.. అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్ జరిపే దాడులను మాత్రమే అడ్డుకుంటామని స్పష్టంచేశారు. ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనను విరమించుకోవాలని బైడెన్‌కు సూచించారు.