- రెండోసారి ఇజ్రాయెల్ ఆర్మీ గ్రౌండ్ అటాక్స్
- గాజాపై ఇజ్రాయెల్ మరోసారి గ్రౌండ్ అటాక్స్ చేసింది
- హమాస్ మిలిటెంట్ల స్థావరాలపై దాడులు
- యుద్ధ ట్యాంకులు, రాకెట్ లాంచర్లు ధ్వంసం
- లెబనాన్ బార్డర్ లో హెజ్బొల్లా గ్రూప్ పై వైమానిక దాడులు
గాజా/జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి గ్రౌండ్ అటాక్స్ చేసింది. హమాస్ టెర్రరిస్టుల స్థావరాలు లక్ష్యంగా దాడులు జరిపింది. గాజాపై దండయాత్రకు సిద్ధంగా ఉన్నామని, మిలిటెంట్లను ఏరివేసే దాకా యుద్ధం ఆపబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆ దేశ ఆర్మీ మెరుపు దాడులకు దిగింది. బుధవారం అర్ధరాత్రి గాజాలోకి చొరబడి దాడులు చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) గురువారం ప్రకటించింది. ‘‘మా యుద్ధ ట్యాంకులు, దళాలు ఉత్తర గాజాలోకి ప్రవేశించి.. మిలిటెంట్ల స్థావరాలు, రాకెట్ లాంచర్లు, ఇతర యుద్ధ సామగ్రిని నాశనం చేశాయి. మిలిటెంట్లను మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్ లో మా సిబ్బంది ఎవరూ గాయపడలేదు. విజయవంతంగా పని పూర్తి చేసుకుని తిరిగొచ్చారు” అని ఐడీఎఫ్ ట్వీట్ చేసింది.
తమ యుద్ధ ట్యాంకులు గాజాలోకి ప్రవేశిస్తున్న వీడియోను కూడా పోస్టు చేసింది. గాజాలో జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచే హమాస్ మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారని, కేవలం మిలిటెంట్లే లక్ష్యంగా తాము దాడులు జరిపామని పేర్కొంది. ‘‘మేం నెక్స్ట్ స్టేజ్ యుద్ధానికి సిద్ధమవుతున్నాం. ఇందులో భాగంగానే గాజాలోకి ప్రవేశించి దాడులు జరిపాం. గ్రౌండ్ అటాక్స్ తో పాటు ఎయిర్ అటాక్స్ కూడా చేశాం. గత 24 గంటల్లో 250 వైమానిక దాడులు చేశాం” అని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి డేనియల్ తెలిపారు. అయితే, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఎంతమంది చనిపోయారనేది తెలియలేదు. మరోవైపు లెబనాన్ నుంచి దాడులు చేస్తున్న హెజ్బొల్లా గ్రూప్ పైనా ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేసింది. గురువారం తెల్లవారుజామున వైమానిక దాడులతో పాటు డ్రోన్ అటాక్స్ జరిపింది. ఇజ్రాయెల్ దాడిలో ఓ పరుపుల ఫ్యాక్టరీ ధ్వంసమైందని లెబనాన్ మీడియా పేర్కొంది.
పాలస్తీనాలో 6,500 మంది మృతి..
ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 6,500కు పెరిగిందని గాజా హెల్త్ మినిస్ట్రీ గురువారం ప్రకటించింది. హమాస్ దాడుల్లో 1,400 మందికి పైగా మరణించారని ఇజ్రాయెల్ తెలిపింది. వీరిలో ఎక్కువ మంది సాధారణ ప్రజలే ఉన్నారని చెప్పింది. మిలిటెంట్లు 224 మందిని బందీలుగా ఉంచుకున్నారని పేర్కొంది. కాగా, గాజాలో ఫ్యూయల్ అయిపోతున్నదని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఫ్యూయల్ అయిపోతే షెల్టర్లలో ఉన్న ప్రజలకు ఫుడ్ సప్లై చేయడం ఇబ్బందవుతుందని తెలిపింది. గాజా సిటీలోని హాస్పిటల్ లో మెడిసిన్స్ కొరత ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
గాజాపై ఇజ్రాయెల్ దాడిలో జర్నలిస్టు కుటుంబం మృతి..
ఇజ్రాయెల్ దాడిలో తమ జర్నలిస్టు కుటుంబం ప్రాణాలు కోల్పోయిందని అల్ జజీరా న్యూస్ చానెల్ తెలిపింది. ‘‘గాజాలోని శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇందులో అల్ జజీరా గాజా కరస్పాండెంట్ వాయెల్ దాహ్ దౌ భార్య, కొడుకు, బిడ్డ, మనవడు ప్రాణాలు కోల్పోయారు” అని చెప్పింది. ఈ న్యూస్ ను చానెల్ లో ప్రసారం చేసింది.
500 మంది హమాస్ మిలిటెంట్లకు ఇరాన్ శిక్షణ..
హమాస్ మిలిటెంట్లకు ఇరాన్ శిక్షణ ఇచ్చినట్టు ఓ రిపోర్టు బయటకొచ్చింది. ఇజ్రాయెల్ పై దాడికి ముందు దాదాపు 500 మంది టెర్రరిస్టులకు ఇరాన్ ఆర్మీ స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చిందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఇజ్రాయెల్ పై దాడికి హమాస్ మిలిటెంట్లకు ఇరాన్ సాయం అందించిందని ఇంతకుముందు కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. లెబనాన్ రాజధాని బీరుట్ లో హమాస్, హెజ్బొల్లా మిలిటెంట్లతో ఇరాన్ అధికారులు సమావేశమై.. ఇజ్రాయెల్ పై దాడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వివరించింది.
బందీలను కాపాడిన ఐడీఎఫ్..
హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ వాసులను ఐడీఎఫ్ రక్షించింది. దక్షిణ ఇజ్రాయెల్ బార్డర్ లోని కిబుజ్ బిరీ ఏరియాలో హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టిన ఐడీఎఫ్.. అక్కడ బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ వాసులను కాపాడింది. కారులో పారిపోతున్న టెర్రరిస్టులను కాల్చి చంపేసింది. ఈ వీడియోను ఐడీఎఫ్ ట్విట్టర్ లో పోస్టు చేసింది.