హెజ్బొల్లాను అంతం చేస్తం

హెజ్బొల్లాను అంతం చేస్తం
  • ఆ టెర్రర్ మూక నిర్మూలనే సమస్యకు ఏకైక పరిష్కారం: నెతన్యాహు 
  • కాల్పుల విరమణకు అమెరికా సహా 12 దేశాల పిలుపు.. నో అన్న ఇజ్రాయెల్ ప్రధాని 
  • లెబనాన్​పై దాడులు ముమ్మరం చేయాలని ఆర్మీకి ఆదేశం 
  • ఇరువైపులా కొనసాగిన రాకెట్, మిసైల్ దాడులు

జెరూసలెం/బీరుట్:  అమెరికా, దాని మిత్రపక్షాలు పిలుపు ఇచ్చిన 21 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. హెజ్బొల్లా మిలిటెంట్ల నిర్మూలనే లక్ష్యంగా ప్రధాని నెతన్యాహు ప్రభుత్వం దాడులు ముమ్మరం చేసింది. వరుసగా నాల్గో రోజైన గురువారం కూడా లెబనాన్​పై మిసైళ్ల వర్షం కురిపించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తమ ప్రభుత్వం అంగీకరించడం లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. హెజ్బొల్లా అంతంతోనే ఉత్తర సరిహద్దుల్లో తలెత్తిన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. 

కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంటే హెజ్బొల్లా కోలుకునేందుకు టైమ్ ఇచ్చినట్లవుతుందని అన్నారు. అమెరికా, ఫ్రాన్స్‌‌, యూరోపియన్ యూనియన్​తో పాటు పలు అరబ్ దేశాలు సూచించిన 21 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని నెతన్యాహు తిరస్కరించినట్లు ఇజ్రాయెల్ పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం సైన్యాన్ని మోహరించి దాడులు ముమ్మరం చేయాల్సిందిగా ప్రధాని ఆదేశాలు జారీ చేశారని చెప్పింది. సోమవారం నుంచి లెబనాన్​లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నది. ఇప్పటి దాకా 600 మందికి పైగా చనిపోయారు. వీరిలో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. సుమారు 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 

హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి

బుధవారం రాత్రి సౌత్ లెబనాన్‌‌లోని బెకా వ్యాలీతోపాటు 75 హెజ్బొల్లా స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌‌ వెల్లడించింది. ఫైర్‌‌ లాంచర్లతో పాటు ఆయుధ సామగ్రిని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నది. ఇప్పటిదాకా వైమానిక దాడులు జరిపిన ఇజ్రాయెల్ ఆర్మీ.. ఇక లెబనాన్​లోకి చొచ్చుకెళ్లేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి కీలక ప్రకటన చేశారు. ‘‘టెల్​అవీవ్​పై హెజ్బొల్లా గురువారం కూడా రాకెట్లతో దాడులు చేసింది. మేము గట్టిగానే బదులిచ్చాం. ఇప్పటి దాకా వైమానిక దాడులు జరిపాం. ఇక నుంచి భూతల దాడులకు ప్లాన్ చేస్తున్నాం. లెబనాన్​లోకి చొచ్చుకెళ్లి హెజ్బొల్లా మిలిటెంట్లను మట్టుబెడ్తాం. ఇజ్రాయెల్​లోని ఈలాట్ సిటీపై హెజ్బొల్లా జరిపిన డ్రోన్ దాడిలో ఇద్దరు గాయపడ్డారు. రెండో డ్రోన్​ను కూల్చేశాం’’అని తెలిపారు. 45 రాకెట్లను హెజ్బొల్లా ప్రయోగించగా.. 30 రాకెట్లను అడ్డుకున్నామని, మిగిలినవి సముద్రంలో పడ్డాయని వెల్లడించారు.

లెబనాన్​లో 23 మంది సిరియన్లు మృతి

ఇజ్రాయెల్ హైఫా సిటీలోని రాఫెల్ మిలటరీ ఫ్యాక్టరీ కాంప్లెక్స్​పై మిసైల్స్​తో దాడి చేశామని హెజ్బొల్లా ప్రకటించింది. ఫ్యాక్టరీపై మూడు రోజుల్లో ఇది మూడో దాడి అని తెలిపింది. ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడిలో 23 మంది సిరియన్లు చనిపోయినట్లు లెబనాన్ అధికారులు ప్రకటించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్లని వివరించారు. సిరియా బార్డర్ వెంట ఉన్న బాల్​బెక్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఇంటిపై ఇజ్రాయెల్ మిసైల్​తో దాడి చేసిందన్నారు. శిథిలాల కింద మరికొంత మంది ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నలుగురు లెబనాన్ పౌరులు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని తెలిపారు.
 
లెబనాన్​కు ఎవరూ వెళ్లొద్దు: ఇండియన్ ఎంబసీ

మిడిల్ ఈస్ట్​లో నెలకొన్న ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని బీరుట్​లోని ఇండియన్ ఎంబసీ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య దాడులు జరుగుతున్న నేపథ్యంలో లెబనాన్​కు ఎవరూ వెళ్లొద్దని తెలిపారు. 2024, ఆగస్టు 1న కూడా గైడ్​లైన్స్ జారీ చేశామని, వాటినే పాటించాలని గుర్తు చేశారు. లెబనాన్​లో ఉన్న ఇండియన్లు అందరూ వెంటనే అక్కడి నుంచి బయల్దేరాలని సూచించారు.

12 దేశాలు చెప్పినా.. పట్టించుకోని నెతన్యాహు

ఇజ్రాయెల్‌‌, హెజ్బొల్లా మధ్య సంధి కుదిర్చేందుకు అమెరికా, ఫ్రాన్స్‌‌ తీవ్రంగా ప్రయత్నించాయి. దాడులకు విరామం ఇవ్వాలని కోరాయి. ఈ మేరకు మొత్తం 12 దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాలని తీర్మానించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రన్ జాయింట్ స్టేట్​మెంట్ రిలీజ్ చేశారు. ‘‘సాధారణ పౌరుల భద్రత గురించి ఇజ్రాయెల్, లెబనాన్ ఆలోచించాలి. ఏడాది కాలంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. వారం నుంచి దాడులు ముమ్మరం చేశారు. 21 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయండి. సాధారణ పౌరులంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు టైమ్ ఇవ్వండి. దాడుల వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి’’అని బెడెన్, మాక్రన్ కోరినా నెతన్యాహు పెడచెవిన పెట్టారు.