గాజా స్కూల్​పై ఇజ్రాయెల్ బాంబు దాడులు..30 మంది మృతి

గాజా స్కూల్​పై ఇజ్రాయెల్ బాంబు దాడులు..30 మంది మృతి
  •     హమాస్ సెంటర్​గా వాడుకుంటున్న స్కూలుపైనా దాడి 
  •     టెల్ అవీవ్​లో కత్తిపోట్ల కలకలం.. ఇద్దరిని చంపిన మిలిటెంట్ 
  •     ఇజ్రాయెల్ పైకి హమాస్, హెజ్బొల్లా రాకెట్ దాడులు

టెల్ అవీవ్ :  పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ కు.. హమాస్, హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థలకు మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ పైకి లెబనాన్ నుంచి హెజ్బొల్లా, గాజా నుంచి హమాస్ రాకెట్ దాడులు చేయగా.. గాజాలోని ఓ ఆస్పత్రి, స్కూలు సహా ఇతర టార్గెట్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టింది. ఆదివారం గాజాలోని వివిధ టార్గెట్లపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 30 మంది చనిపోయారని గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. సెంట్రల్ గాజాలోని అల్ అక్సా మార్టైర్స్ హాస్పిటల్ పై జరిగిన బాంబుదాడిలో నలుగురు మృతిచెందారని తెలిపింది. ఆస్పత్రిని హమాస్ కమాండ్ సెంటర్ గా వాడుకుంటున్నందునే దాడి చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఎయిర్ స్ట్రైక్ తర్వాత అక్కడ రెండోసారి పేలుళ్లు జరిగాయని, హమాస్ మిలిటెంట్లు అక్కడ పేలుడు పదార్థాలను దాచి ఉంచారనేందుకు అదే ఆధారమని పేర్కొంది. అలాగే నార్త్ గాజాలోని ఓ ఇంటిపై జరిపిన మరో దాడిలో 8 మంది చనిపోయారు. కాగా, ఆదివారం పాలస్తీనియన్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ వైపు ఐదు రాకెట్లు ప్రయోగించారని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఇజ్రాయెల్​ ఆర్మీ తెలిపింది. ఇటీవల ఇరాన్ రాజధాని టెహ్రాన్​లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య, లెబనాన్ రాజధాని బీరుట్ లో హెజ్బొల్లా టాప్ కమాండర్ ఫౌద్ షుకూర్ హత్య నేపథ్యంలో ఇజ్రాయెల్ పై ఇరాన్, లెబనాన్, హెజ్బొల్లా, హమాస్ ప్రతీకారానికి సిద్ధమయ్యాయి. దీంతో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. 

టెల్ అవీవ్​లో కత్తిపోట్ల కలకలం..

ఇజ్రాయెల్​లోని టెల్ అవీవ్ వీధుల్లో ఆదివారం ఓ దుండగుడు కత్తితో విచక్షణారహితంగా చేసిన దాడిలో ఓ వృద్ధురాలు (70), మరో వృద్ధుడు(80) చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఆ దుండగుడిని వెంటనే మట్టుబెట్టామని పోలీసులు వెల్లడించారు. అతడిని పాలస్తీనియన్ మిలిటెంట్ గా గుర్తించామన్నారు.

వాణిజ్య నౌకపై హౌతీల దాడులు 

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో యెమెన్​లోని హౌతీ రెబెల్స్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్​లో వాణిజ్య నౌకలపై దాడులు ప్రారంభించారు. హమాస్​కు మద్దతుగా తరచూ ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో ఇజ్రాయెల్​తో లింకున్న నౌకలపై హౌతీలు దాడులు చేశారు.

గాజా నుంచి ఈజిప్టులోకి 25 టన్నెల్స్

హమాస్ మిలిటెంట్లు గాజా నుంచి ఈజిప్టులోకి ఏకంగా వెహికల్స్ సైతం వెళ్లేలా నిర్మించిన 3 మీటర్ల ఎత్తయిన భారీ టన్నెల్ ను గుర్తించామని ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. హమాస్ ఆయుధాలను స్మగ్లింగ్ చేసే రూట్లను వెలికితీయడంలో భాగంగా దీనిని గుర్తించినట్టు తెలిపింది. ఫిలడెల్ఫీ కారిడార్ గా పిలిచే ఈ రూట్లో 25 టన్నెల్స్ ఈజిప్టు భూభాగంలోకి ఎంటరయ్యేలా ఉన్నాయని పేర్కొంది.