గాజా స్ట్రిప్: ఉత్తర గాజాపై ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. ఈ దాడిలో మొత్తం 22 మంది మృతిచెందారని, ఇందులో మహిళలు, చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు పాలస్తీనా అధికారులు తెలిపారు. బీట్లాహియాలో పట్టణంలోని నివాస గృహాలు, భవనాలపై శనివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 11 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు కన్నుమూసినట్టు పేర్కొన్నారు.
మరో 15 మందికి తీవ్ర గాయాలైనట్టు తెలిపారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది 3 కుటుంబాలకు చెందినవారే అని పేర్కొన్నారు. కాగా, తాము ఓ నివాస భవనంలో తలదాచుకున్న టెర్రరిస్టులే టార్గెట్గా దాడి చేశామని, పౌరులకు హాని కలగకుండా చర్యలు తీసుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. పౌరులు మృతిచెందినట్టు తప్పుడు సంఖ్యలను మీడియా సృష్టిస్తున్నదని పేర్కొన్నది.