- మృతుల్లో 14 మంది చిన్నారులు
గాజా: పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా సెంట్రల్ గాజాలోని ఓ స్కూల్ బిల్డింగుపై జరిపిన వైమానిక దాడిలో అక్కడ తలదాచుకుంటున్న 33 మంది మృతి చెందారు. చనిపోయినవారిలో 14 మంది చిన్నారులు, 9 మంది మహిళలు ఉన్నారని స్థానిక అధికారులు గురువారం వెల్లడించారు. అయితే, హమాస్ టెర్రరిస్టులు ఆ స్కూల్ ను అడ్డాగా చేసుకుని తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
హమాస్ టెర్రరిస్టులు ఆ పాఠశాలలో ఆశ్రయం పొందుతూ.. తమ బలగాలపై దాడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నారన్న సమాచారం మేరకే దాడులు చేసినట్టు వెల్లడించింది. కాగా, పాలస్తీనియన్ శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న అల్-సర్ది స్కూల్ బిల్డింగ్ పై మిసైల్స్ తో ఇజ్రాయెల్ చేసిన అటాక్ లో బిల్డింగ్ రెండో, మూడో అంతస్తులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
సమీపంలోని మరో ప్రాంతంపై జరిగిన దాడిలో కూడా ఆరుగురు మరణించారు. అయితే, దాడిలో పౌరుల ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. కాగా, గతవారం రఫాలో 'యూఎన్ఆర్డబ్ల్యూఏ' కేంద్రం సమీపంలో జరిగిన దాడిలో కూడా 45 మంది మృతి చెందారు. ఈ దాడిని ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండించాయి.