- మొత్తం 22 మంది మృతి
- అందులో 13 మంది చిన్నారులు
- చనిపోయిన వారంతా రెండు కుటుంబాలకు చెందినవారు
రఫా/టెల్ అవీవ్: దక్షిణ గాజా సిటీపై ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మొత్తం 22 మంది చనిపోయారు. మృతుల్లో 13 మంది చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్ బలగాలు రెండుసార్లు వైమానిక దాడుల చేశాయి. మొదటిసారి చేసిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు (భార్యభర్తలు, వారి మూడేండ్ల కుమారుడు) ప్రాణాలు కోల్పోయారు.
భార్య నిండు గర్భిణి. అయితే ఆమె బిడ్డను డాక్టర్లు కాపాడారు. అలాగే, మరో నలుగురు వ్యక్తులు కూడా ఈ దాడుల్లో మరణించారు. గాయపడిన వారిని అధికారులు కువైతి హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహాలను కూడా అక్కడికే తరలించారు. రెండో అటాక్‌లో 15 మంది చనిపోయారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని అధికారులు తెలిపారు. శనివారం రాత్రి కూడా ఇజ్రాయెల్ బలగాలు గాజా సిటీపై ఎయిర్ స్ట్రయిక్స్ చేశాయి. ఈ దాడిలో ముగ్గురు పిల్లలు సహా 9 మంది మృతి చెందారు.
ఇజ్రాయెల్ బలగాలపై ఆంక్షలకు అమెరికా రెడీ
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్)కు చెందిన నెట్జా యెహుదా బెటాలియన్‌పై అమెరికా ఆంక్షలు విధించనున్నది. వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనీయన్లపై నెట్జా యెహుదా సైనికులు అరాచకాలకు పాల్పడుతున్నారని, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని అమెరికా పేర్కొంది. దీంతో ఆ బెటాలియన్‌పై ఆంక్షలు విధించాలని నిర్ణయించామని తెలిపింది.
తమ బెటాలియన్ పై ఆంక్షలు విధించాలన్న అమెరికా నిర్ణయంపై ఇజ్రాయెల్ స్పందించింది. బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. ‘‘రాక్షస టెర్రరిస్టులపై మా బలగాలు పోరాడుతున్నాయి. ఇలాంటి సమయంలో మా బలగాలపై ఆంక్షలు విధించాలన్న నిర్ణయం అనైతికం. అమెరికా చర్యను అడ్డుకుని తీరుతం” అని చెప్పారు. అమెరికాది పిచ్చి నిర్ణయమని ఇజ్రాయెల్ మంత్రులు ఇతామర్ బెన్ గ్విర్, బెజాలెల్ స్మోట్రిచ్ అన్నారు.
ఇజ్రాయెల్‌కు అమెరికా మిలిటరీ సాయం
గాజా సిటీపై విరుచుపడుతున్న ఇజ్రాయెల్ కు అమెరికా మిలిటరీ సాయం ప్రకటించింది. ఇందులో భాగంగా కొన్ని బిలియన్ల డాలర్ల సాయాన్ని అందించనుంది. మరోవైపు గాజాపై మరిన్ని దాడులు చేస్తామని ఇజ్రాయెల్ పేర్కొంది. కాగా, గాజాకు అమెరికా ప్రతినిధుల సభ రూ.21 లక్షల కోట్ల మానవతా సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మొత్తం ప్యాకేజీకి సభ ఆమోదం తెలిపింది.