జనావాసాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి.. నార్త్ గాజాలో 60 మంది మృతి

జనావాసాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి.. నార్త్ గాజాలో 60 మంది మృతి
  • బీట్​లాహియా పట్టణంలో బాంబుల వర్షం
  • 150 మందికి గాయాలు.. మరో 17 మంది గల్లంతు

గాజా:  ఇజ్రాయెల్– హమాస్​ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నది. గాజా స్ట్రిప్​ నుంచి మిలిటెంట్ సంస్థను తుడిచిపెట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్​ విరుచుకుపడుతున్నది. తాజాగా, మంగళవారం ఉత్తర గాజాలోని బీట్​లాహియా పట్టణంపై ఇజ్రాయెల్​ సైన్యం ఎయిర్ ​స్ట్రైక్​ చేసింది. జనావాసాలపై బాంబుల వర్షం కురిపించింది.

ఈ దాడిలో మొత్తం 60 మంది మృతిచెందగా.. 150 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 20 మంది చిన్నారులున్నారని, ఎక్కువ సంఖ్యలో మహిళలున్నారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 17 మంది ఆచూకీ దొరకడంలేదని, వారిని మృతిచెందినట్టుగానే భావిస్తున్నామని పేర్కొన్నది. కాగా, ఈ దాడిపై ఇప్పటివరకూ ఇజ్రాయెల్ స్పందించలేదు. ​ 

చెల్లాచెదురుగా డెడ్ బాడీలు..

బీట్​లాహియా పట్టణంలోని ఓ నాలుగు అంతస్థుల బిల్డింగ్​పై ఇజ్రాయెల్ ​సైన్యం దాడి చేసిన దృశ్యాలకు సంబంధించిన వీడియోను రాయిటర్ విడుదల చేసింది. ఈ దాడితో ఆ బిల్డింగ్​ చాలావరకు ధ్వంసమైపోగా, చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, క్షతగాత్రులతో అక్కడ భీతావహ పరిస్థితి నెలకొన్నది. ​శిథిలాలనుంచి మృతదేహాలను వెలికి తీసి, దుప్పట్లలో చుట్టి అక్కడ ఉంచారు. క్షతగాత్రులను రక్షించేందుకు స్థానికులు ముందుకు వచ్చారు. 

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇజ్రాయెల్​ సైన్యం ఈ భవనంపై బాంబు దాడి చేసిందని, మృతదేహాలు గోడలపై చెల్లాచెదురుగా పడిపోయాయని ఓ స్థానికుడు వెల్లడించాడు.  కాగా, ఇప్పటివరకూ ఇజ్రాయెల్​ జరిపిన దాడిలో దాదాపు లక్ష మంది వరకు చనిపోయినట్టు పాలస్తీనా సివిల్​ ఎమర్జెన్సీ సర్వీస్​ తెలిపింది. గాజాలోని దవాఖానల్లో మెడికల్​ ఎక్విప్​మెంట్, డాక్టర్లు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నదని పేర్కొన్నది. 

 ఈ దాడులపై కౌన్సిల్​ఆన్​అమెరికన్​ ఇస్లామిక్​ రిలేషన్స్​ (సీఏఐఆర్‌) స్పందించింది.  గాజాపై దాడులను విరమించేలా చూసి, అక్కడి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరింది.