హమాస్ చెరలో 491 రోజులు.. విడుదలై భార్య, పిల్లలను చూడాలని వస్తే..

హమాస్ చెరలో 491 రోజులు.. విడుదలై భార్య, పిల్లలను చూడాలని వస్తే..

జెరూసలెం:  ఇజ్రాయెల్‌‌, హమాస్‌‌ కాల్పుల విరమణ ఒప్పందంలో బందీల విడుదల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా హమాస్‌‌ మరో ముగ్గురు బందీలను శనివారం విడుదల చేసింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్‌‌ 183 పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. హమాస్‌‌ చెరలో ఉన్న ఎల్‌‌ షరాబీ, ఒహాద్‌‌ బెన్‌‌ అమి, ఓర్‌‌‌‌ లెవీలను ఇజ్రాయెల్‌‌ రెడ్‌‌ క్రాస్‌‌ సొసైటీకి అప్పగించింది. అయితే, 491 రోజులు హమాస్‌‌ చెరలో చిత్రవధ అనుభవించిన ఎల్‌‌ షరాబీ.. ఇన్నాళ్ల తర్వాత తన భార్య, ఇద్దరు కూతుళ్లను తిరిగి చూస్తానని ఎంతో ఆశతో వచ్చాడు. 

కానీ.. అతడిని బందీగా పట్టుకున్న రోజే.. అతడి భార్య, ఇద్దరు కూతుళ్లు నోయా (16), యాహెల్‌‌ (13)ను మిలిటెంట్లు చంపేశారని తెలియదు. వాళ్లు ఎక్కడో ఒక చోట హ్యాపీగా ఉంటారని భావించాడు. షరాబీ భార్య, పిల్లలు లేరని అధికారులు  కూడా చెప్పలేదు. హమాస్‌‌ చెరలో బందీగా ఉన్న అతని బ్రదర్‌‌‌‌ యోస్సీ షరాబీ చనిపోయాడని మాత్రం చెప్పారు.

ఎల్‌‌ షరాబీని తన తల్లి, సోదరులకు అప్పగించారు. హమాస్‌‌  దాడిలో తన కుటుంబం నలుగురిని కోల్పోయిందని షరాబీ మరో బ్రదర్‌‌‌‌ షరూన్‌‌ ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్యా పిల్లలను ఎప్పుడూ చూడలేడన్న నిజాన్ని షరాబీకి ఎలా చెప్పాలో తెలియడం లేదంటున్నాడు.