ఆరు నెలలుగా హమాస్ నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయిల్ గాజాపై యుద్దం చేస్తోంది. ఈ యుద్దంలో అనేక వేల మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని రోజులు లెక్కపెట్టుకుంటున్నారు. గతేడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు దక్షిణ ఇజ్రాయిల్ లోకి ప్రవేశించి 1200మందిని హతమార్చారు. 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. వారిలో 109 మందిని హమాస్ విడుదల చేయగా.. మిగిలిన వారిని విడిపించేందుకు హమాస్, ఇజ్రాయిల్ ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే 36 మంది హమాస్ చెరలో ఉన్న బందీలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఇజ్రాయిల్ దాడులు చేస్తూనే ఉంది. ఇజ్రాయిల్ దాడుల్లో హమాస్ సైన్యం కమాండర్లు, కీలక నేతలు చనిపోయారు.
కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం ఆదివారం ఈజిప్టులోని కైరోలో చర్చలు జరిగాయి. ఈ చర్చలు ఎప్పటిలాగే విఫలమైయ్యాయి. గాజాలో బందీలుగా ఉన్నవారిని విడుదల చేసే వరకు ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. హమాస్ డిమాండ్లను ఇజ్రాయెల్ ప్రధాని తోసిపుచ్చారు. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు చాలా దేశాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొటుంన్నాడు. ఆయన తీరును ఖండిస్తూ రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గాజాలో కాల్పుల విరమణ పాటించాలంటూ ఐక్యరాజ్య సమితిలోని మానవ హక్కుల మండలి తీర్మానం చేసింది. గాజాస్ట్రిప్‌లో అక్రమ నిర్బంధాన్ని ఎత్తివేయాలని ఆ తీర్మానంలో కోరింది. ఈ సందర్భంగా జరిగిన ఓటింగ్‌కు భారత్, ఫ్రాన్స్, జపాన్, నెదర్లాండ్స్, రొమేనియా సహా 13 దేశాలు దూరంగా ఉన్నాయి.