ఇజ్రాయెల్, లెబనాన్ కేంద్రంగా పని చేసే మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఇవాళ (సెప్టెంబర్ 27) నెతన్యాహు ప్రసంగిస్తూ.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ మొదట దాడి చేస్తే.. కచ్చితంగా తిరిగి ఇరాన్‌పై ప్రతిదాడి ఉంటుందని పునర్ఘాటించారు. ‘‘మీరు మమ్మల్ని కొట్టినట్లయితే, తిరిగి మేము మిమ్మల్ని కొడతాం’’ టెహ్రాన్ నిరంకుశ పాలకులకు ఇదే నా సందేశమని పేర్కొన్నారు.
ఇరాన్ తమపై దాడి చేస్తే తిరిగి మూల్యం చెల్లించుకోక తప్పదని.. ఇరాన్‌లో ఇజ్రాయెల్ వెళ్లలేని ప్రదేశమే లేదనే విషయం ఆ దేశం గుర్తుంచుకోవాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ యొక్క పొడవాటి చేయి చేరుకోలేని ప్రదేశం ఇరాన్‌లో లేదన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ పై దుందుడుకు చర్యలకు దిగే ముందు ఈ అంశం మొత్తం మధ్యప్రాచ్యానికి సంబంధించిన విషయమనేది దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఈ పోడియంలోని చాలా మంది ఇజ్రాయెల్‌పై అబద్ధాలు, అసత్యాలు మాట్లాడారని.. ఆ తప్పుడు మాటలను సరిదిద్దేందుకే ఇవాళ ఇక్కడి వచ్చానని తన ప్రసంగం ప్రారంభంలో నెతన్యాహు నొక్కి చెప్పారు.
ALSO READ | మాటల్లేవ్..మాట్లాడుకోవటం లేదు..ఇక చంపుడే: లెబనాన్ కు ఇజ్రాయెల్ అల్టిమేటం
కాగా, ఇటీవల ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య భీకర దాడులు జరిగాయి. ఇజ్రాయెల్, హెజ్బొల్లా పరస్పరం రాకెట్లు, బాంబ్ల వర్షం కురుపించుకున్నాయి. హెబ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున హెజ్బొల్లా సభ్యులు, లెబనాన్ సాధారణ పౌరులు మృతి చెందారు. హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో మధ్యప్రాచ్యదేశాల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో హెజ్బొల్లాకు సహయ సహకారాలు అందించే ఇరాన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బహిరంగంగా మాస్ వార్నింగ్ ఇవ్వడం ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది.